Saturday, January 29, 2011

ధరలు దించకపోతే ఢిల్లీలోనే పోరాటం! చిరంజీవి


అనంతపురం, :కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, అలా జరగని పక్షంలో ఢిల్లీలోనే పోరాటం చేస్తామని ప్రజా రాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి హెచ్చరించారు. శుక్రవారం ఆయన నగరంలోని శివబాలయోగి ఆశ్రమంలో విలేఖరులతో మాట్లాడుతూ రెండు చానళ్లు పనిగట్టుకుని తనను ప్రజలకు, రాజకీయాలకు దూరంచేసే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. తాను దోచుకోవడానికి, దాచుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ప్రజలు అవకాశం కల్పిస్తే ప్రజారాజ్యం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు పనిచేస్తుందన్నారు. ప్రజలు తమ పక్షాన ఉన్నంతవరకు అవాస్తవ కథనాలతో ఏమీ కాదన్నారు. జిల్లా పిఆర్‌పిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, కొన్ని చానళ్లు తమ స్వలాభం కోసం అవాస్తవ కథనాలల్లుతున్నాయన్నారు. జగన్ చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొన్న పిఆర్‌పి ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ కమిటీ విచారణ జరుపుతున్నదన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే కర్నాటకలో కూడా తమ అభ్యర్థులను బరిలో దింపుతామన్నారు.
రాజకీయాలు వీడే ప్రసక్తే లేదు
ధర్మవరం: తాను రాజకీయాలు వీడే ప్రసక్తి లేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. ప్రజల అభిమానం, ఆశీస్సులే ఆక్సిజన్‌గా స్వీకరించి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తూ రాజకీయాల్లో కొనసాగుతానని ధర్మవరం సాక్షిగా ఇదే నా ప్రతిజ్ఞ.... అంటూ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అశేష జనవాహిని కేరింతల మధ్య తెలిపారు. శుక్రవారం అనంతపురం జిల్లా ధర్మవరం పర్యటనలో భాగంగా అనంతపురం నుండి బత్తలపల్లి మీదుగా ధర్మవరం చేరుకున్న చిరుకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా స్థానిక ఎన్‌టి ఆర్‌సర్కిల్‌లో హాజరైన జనవాహినినుద్దేశించి చిరు ఉద్వేగపూరితంగా మాట్లాడుతూ ప్రజాసమస్యలను ఎప్పుడు ప్రస్తావించినా తాను వాటిని ప్రభుత్వదృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పక్క రాష్ట్రాల్లో చేతివృత్తులను ప్రోత్సహిస్తూ వాటిని ఎలా పరిరక్షించుకుంటున్నారో ఆ విధానాలనే ఇక్కడి ప్రభుత్వం అనుసరిస్తే నేతన్న స్థితి కొంతమేర మారుతుందన్నారు. ఆప్కోలో ఉన్న 25 శాతం రిబేట్‌ను తొలగించాలని యోచిస్తున్న ప్రభుత్వం, తమిళనాడులో 40శాతం రిబేట్ ఇస్తూ చేనేతను ఆ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. గతంలో తాను ధర్మవరం వచ్చినప్పుడు ఓ చేనేత కార్మికుడు పట్టుచీరను బహూకరించి అమ్మకు ఇవ్వమని చెప్పిన సంఘటనను మరువలేనన్నారు. చేనేత సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం స్పందించేదాకా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment