Wednesday, January 26, 2011

క్లైమాక్స్ చేరిన రాజకీయం: కిరణ్ కుమార్ రెడ్డితో అమితుమీకే జగన్ రెడీ..!!

 ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో అమీతుమీ తేల్చుకోవడానికే మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ సిద్ధపడినట్లు కనిపిస్తోంది. దీంతో కాంగ్రెసు రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై, తనపై కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆసరా చేసుకుని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధపడాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే, తమంత తాము ప్రభుత్వాన్ని కూల్చినట్లు అనిపించకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిని రెచ్చగొట్టే చర్యకు వైయస్ జగన్ వర్గం పూనుకుంది. బుధవారం సాయంత్రం దాదాపు 30 మంది జగన్ వర్గం శాసనసభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి శాసనసభలో విశ్వాస తీర్మానం ప్రతిపాదించి మెజారిటీ నిరూపించుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు.కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సమావేశంలోనే మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి ఎదురుదాడికి దిగడం కూడా ముఖ్యమంత్రిని సవాల్ చేయడమేనని భావిస్తున్నారు. జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులు ఇంత పెద్ద యెత్తున ఎప్పుడూ సిఎల్పీ కార్యాలయంలో ఇంత ఘాటుగా మాట్లాడలేదు. సిఎల్పీ కార్యాలయం నుంచే కిరణ్ కుమార్ రెడ్డికి సవాల్ విసరడం కిరణ్ కుమార్ రెడ్డిని, ఆయన వర్గాన్ని రెచ్చగొట్టడమేనని అంటున్నారు. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై ముఖ్యమంత్రికి మద్దతుగా నిలుస్తున్న నాయకులు సవాల్ విసురుతున్నారు. రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెసు అధిష్టానం జగన్ వర్గంపై చర్యలు తీసుకోకుండా సవాళ్లు ప్రతిసవాళ్లను ప్రోత్సహిస్తోంది. ఎవరు ముందుకు అడుగు వేస్తారనేది ఇప్పుడు తేలాల్సిన విషయం.

No comments:

Post a Comment