Friday, January 21, 2011

రచ్చబండ' హామీల అమలుకు2500 కోట్లు కేటాయింపు

తక్షణం రూ.1200 కోట్లు విడుదల
సంక్షేమ పథకాల తీర్పుపై సమీక్ష
నియోజకవర్గాలకు తలా రూ. 96 కోట్లు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఈనెల 24 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 12 వరకు సాగనున్న 'రచ్చబండ'లో సీఎం కిరణ్ ఇచ్చే హామీల అమలుకు ప్రభుత్వం రూ.2500 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.1200 కోట్లు ఇప్పటికే విడుదల చేశారు. ఆయనతోపాటు వెళ్లే ఎమ్మెల్యేలను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద మూడోవిడతగా రూ.96.25 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులివ్వగా ఆ నిధులను జిల్లా ప్రణాళిక అధికారులకు విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.పి.టక్కర్ గురువారం ఆదేశాలిచ్చారు.ఇందులో రూ.73.75 కోట్లను ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులు సూచించే పనులకు కేటాయిస్తారు. మిగిలిన సొమ్ముతో ఎమ్మెల్సీలు సిఫారసు చేసే పనులు చేస్తారు. రచ్చబండలో అన్ని పథకాల అమలు తీరును సీఎం సమగ్రంగా సమీక్షిస్తారు. లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి, అభిప్రాయాలు స్వీకరిస్తారు. వాటన్నింటినీ విశ్లేషించిన అనంతరం అమలులో సమూల మార్పులు తేవాలని ఆయన సంకల్పించారు. ఈ దిశగా పథకాల ప్రయోజనం నేరుగా వారికి చేరుతున్నదా? అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా లేక అవినీతిపరులతో కుమ్మక్కవుతున్నారా? తదితర అంశాలను నిశితంగా గమనిస్తారు.18 లక్షల వ్యక్తిగత లబ్ధిదారులు, 6.5 లక్షల స్వయం సహాయక బృందాలకు అక్కడికక్కడ నిధులు విడుదల చేస్తారు. అలాగే కొత్త దరఖాస్తులు, అక్రమాలపై ఫిర్యాదులు కూడా స్వీకరిస్తారు. పథకాల అమలులో క్షేత్రస్థాయి ఇబ్బందులనూ గమనిస్తారు. యంత్రాంగం తీరుపై ప్రజల్లో అసంతృప్తిని తొలగించటంతోపాటు అవినీతిని నిరోధించటం సీఎం లక్ష్యమని అధికారవర్గాలు తెలిపాయి. గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి ద్వారా వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పడాలన్నది ఆయన ధ్యేయం. తదనుగుణంగానే 20 రోజుల పర్యటన కార్యక్రమాన్ని రూపొందించారు.ఇందులో భాగంగా మహిళలు, రైతులు, వ్యవసాయ కార్మికులతో చర్చించడం ద్వారా 'పనిచేసే ముఖ్యమంత్రి'గా ముద్ర వేయాలన్నది సీఎం లక్ష్యమని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. తనతోపాటు మంత్రులు, ఎమ్మేల్యేలు గ్రామాల్లో పర్యటిస్తే ప్రభుత్వంపై సానుకూల భావన పాదుకొంటుదని ఆయన భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తంమీద 2009 సెప్టెంబర్ నుంచి ప్రభుత్వమే లేదన్న ప్రజల భావనను సమూలంగా తొలగించాలన్నది లక్ష్యమన్నారు.

No comments:

Post a Comment