Saturday, January 29, 2011

పోలవరంతోపాటు ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా: జగన్ డిమాండ్


7న ప్రారంభం కానున్న యువనేత పాదయాత్ర... 9న పోలవరంలో బహిరంగ సభ
మెట్ట ప్రాంతాల్లోనూ పాదయాత్ర చేపట్టాలని అభ్యర్థనలు..
 ఈ నేపథ్యంలో ఆదివారం ఖరారు కానున్న షెడ్యూలు... వివరాలు వెల్లడించిన మాజీమంత్రి  బోసు బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరంతోపాటు ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలన్న డిమాండ్‌తో వచ్చేనెల 7 నుంచి యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారని మాజీ మంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే పిల్లి సుభాష్‌చంద్రబోస్ వెల్లడించారు. శుక్రవారం ఇక్కడి సీఆర్సీ ఓల్డేజ్ హోమ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యువనేత పాదయాత్ర షెడ్యూల్ వివరించారు. యాత్ర 7న రావులపాలెంలో ప్రారంభమవుతుందని, 9వ తేదీన పోలవరంలో ముగుస్తుందని, అనంతరం అక్కడ బహిరంగ సభ జరుగుతుందని బోస్ వివరించారు. 70 కిలోమీటర్ల మేర మూడ్రోజులపాటు ఈ పాదయాత్ర సాగుతుందన్నారు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల మెట్ట ప్రాంతాలకు అధిక ప్రయోజనం కలుగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా పాదయాత్ర జరపాలని అభ్యర్థనలు వస్తున్నాయని అన్నారు. దీనిపై చర్చించేందుకు ఆదివారం ముఖ్యులతో సమావేశమై యాత్ర తాలూకు తుది షెడ్యూలు ఖరారు చేస్తామని సుభాష్ చంద్రబోస్ శుక్రవారం రాత్రి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా డెల్టా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు మేలు జరుగుతుందని బోస్ పేర్కొన్నారు.ఉభయ గోదావరి జిల్లాల్లోని 10.20 లక్షల ఎకరాలు సాగులోకి రావడంతోపాటు వైఎస్‌ఆర్ హయాంలో ప్రారంభించిన ఎల్లంపల్లి, దుమ్ముగూడెం తదితర ఏడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవసరైమైన 69 టీఎంసీల నీరు అందుతుందన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ధవళేశ్వరం బ్యారేజ్‌కు 78 టీఎంసీల ఇన్‌ఫ్లో వస్తుందన్నారు. పోలవరం పూర్తి కాకుంటే ఉభయ గోదావరి జిల్లాల రైతులకు మొదటి పంట కూడా పండించుకోలేని ప్రమాదం పొంచి ఉందని బోస్ తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజ్ పరిధిలో సాగుభూమి పూర్తిగా వినియోగంలోకి రావాలంటే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించాల్సిందిగా సర్ ఆర్థర్ కాటన్ గతంలోనే సూచించారని బోస్ గుర్తు చేశారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న దివంగత నేత వైఎస్ పోలవరానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆయన హయాంలో పూర్తయిన 35 శాతం పనులు తప్ప పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని బోస్ విమర్శించారు. వివిధ శాఖలకు చెందిన 17 రకాల అనుమతులతోపాటు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ అనుమతి ఉన్నా పోలవరానికి జాతీయ హోదా ప్రకటించకుండా కేంద్రం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. వైఎస్ బతికుండగా ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో ముంపు సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అవగాహన చేసుకున్నా, కేంద్రం రోజుకో కొర్రీ వేస్తూ కాలయాపన చేస్తోందన్నారు.పోలవరం పూర్తయితే ఐదు జిల్లాల్లో సుమారు 22.70 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని, 80 టీఎంసీల నీరు కృష్ణాకు మళ్లించే అవకాశం ఉంటుందని బోస్ వివరించారు. దీంతో కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరించడంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, తెలంగాణకు మరింత నీరు అందించవచ్చని తెలిపారు. అంతేకాకుండా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 520 గ్రామాలకు తాగునీటి అవసరాలు, ఏలేరు ఆయకట్టుకు పుష్కలంగా నీరు వంటి ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు. పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తే ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ఇందుకోసం నడుం బిగించాలని బోస్ పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభ సమయంలో పుష్కర ఎత్తిపోతల పథకం అవసరం లేదని ఎందరో నిపుణులు సూచించినా వైఎస్.. వెనుకడుగు వేయలేదన్నారు. మరో రూ. 168 కోట్లు మంజూరు చేస్తే పుష్కర పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉభయ గోదావరి జిల్లాల రైతుల ఆందోళనను గుర్తించిన జగన్ పాదయాత్ర చే యాలన్న నిర్ణయం తీసుకున్నారని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్రలో పాల్గొని యువనేతకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వెదిరేశ్వరం సర్పంచ్ బొక్కా వెంకటలక్ష్మి,రావులపాలెం నీటి సంఘం అధ్యక్షుడు గొలుగూరి మునిరెడ్డి, రావులపాలెం కాంగ్రెస్ మైనార్టీసెల్ అధ్యక్షుడు మన్యం భాను, సీఆర్‌సీ అధ్యక్షుడు మల్లిడి కనికిరెడ్డి, సీఆర్‌సీ మెంబర్ కర్రి సత్తిరెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోపెల్ల మల్లి, సీఆర్‌సీ మాజీ అధ్యక్షుడు ద్వారంపూడి వెంకటరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి కముజు సత్యనారాయణ, ఆర్‌వీవీ సత్యనారాయణచౌదరి, నీరజారాణి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment