Tuesday, June 28, 2011

Monday, June 27, 2011

వైఎస్సార్ కాంగ్రెస్‌కు గ్రామాల్లో ఆదరణ మెండు


వైఎస్సార్ కాంగ్రెస్‌కు గ్రామాల్లో ఆదరణ మెండు
పరవాడ : రోజురోజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గ్రామాల్లో ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి అన్నారు.26 06 2011 ఆదివారం మండలంలో పెదముషిడివాడ, సాలాపువానిపాలెం. కలపాక, రావాడ గ్రామపంచాయతీల వైఎస్సార్ కాంగ్రెస్ గ్రామ కమిటీలు ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజురోజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రజలు స్వచ్చందంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆయన అన్నారు.దీనికి కారణం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి మృతి చెందిన తర్వాత నిరుపేదలకు అందాల్సిన పథకాలు కనుమరుగయ్యాయని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలకు బ్రేక్ పడిందని ఆయన ఆరోపంచారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చుట్టు ప్రదక్షిణలు చేయడానికే సమయం కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడితప్పిందని ఆయన ఆరోపించారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ నేత పదవులు కాపాడుకునేందుకే సమయాన్ని వెచ్చిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నావ పూర్తిగా ఖాళీ అయ్యిందని, అయితే నేతలను తిరిగి పార్టీలోకి రప్పించుకునేందుకు నామినేట్‌డ్ పదవులు ఎరవేస్తున్నారని ఆయన ఆరోపించారు. భవిష్యత్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రత్యమ్నాయ పార్టీలు ఉండవని ఆయన జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవాహంలో కొట్టుకు పోతాయని ఆయన అన్నారు. మూడు ఏళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని తెలిసినా అనేక మంది నేడు వైఎస్సార్ పార్టీలోకి వలసలు వస్తున్నారని ఆయన అన్నారు. గ్రామ కమిటీలను పూర్తి చేసి, త్వరలో మండల వ్యాప్తంగా భారీ సమావేశాలను నిర్వహించి కార్యకర్తలో నూతనోత్తజాన్ని తీసుకు వస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గండి రవికుమార్, చల్లా కనకరావు, కన్నూరు వెంకట రమణ, పయిల గోపాలకృష్ట, బొండా కనకరావు, కాసు అంజిరెడ్డి, మండల స్టీరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


పత్రికలను రెగ్యులర్ గా నడపండి

 విశాఖ స్మాల్ పేపర్స్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతున్న  డిటర్స్ ,


విశాఖపట్నం, సక్సెస్ న్యూస్ : పత్రికలను రెగ్యులర్ గా నడపాలని విశాఖ స్మాల్ పేపర్స్ ఎడిటర్స్ అండ్ పిరియాడికల్స్ అసోసియేషన్ సమావేశంలో పలువురు చిన్న పత్రికల ఎడిటర్లు సభ్యులుకు సూచించారు. విశాఖపట్నంలో గల నార్ల వెంకటేశ్వరరావు భవన్ లో సమావేశం నిర్వహించారు.














Friday, June 24, 2011

How to Create a Blog on Blogger

సామాన్యుడిపై బండ


సామాన్యుడిపై బండ
ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో కుంగిపోతున్న సామాన్యుడిపై మరోసారి భారాన్ని మోపేందుకు కేంద్రంలోని యుపిఎ సర్కారు సిద్ధమవుతోంది. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటిరోజే పెట్రోలు ధరను పెంచిన కేంద్రం ఇప్పుడు లీటర్‌ డీజిల్‌కు రు.2-3ల వంతున వంటగ్యాస్‌ సిలెండర్‌ ధరను రు.25 లు వంతున ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ధరలను పెంచటం వంటి అంశాలతో పాటు సుంకాలలో కొత విధించటం వంటి అంశాలను కూడా చర్చించేందుకు మంత్రుల ఉన్నతాధికార కమిటీ శుక్రవారం ఇక్కడ భేటీ కానున్నది. ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ అధ్యక్షతన జరిగే ఈ భేటీ శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు జరిగే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనితో పాటు ప్రజాపంపిణీ వ్యవస్థలో సరఫరా చేసే కిరోసిన్‌ ధర పెంపుదల అంశాన్ని కూడా మంత్రుల కమిటీ ఈ భేటీలో పరిశీలించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. అదే విధంగా క్రూడాయిల్‌ దిగుమతులపై ప్రస్తుతం విధిస్తున్న ఐదు శాతం దిగుమతి సుంకాన్ని, డిజెల్‌పై విధిస్తున్న 7.5 శాతం దిగుమతి సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించే అంశాన్ని కూడా మంత్రుల కమిటీ పరిశీలించనున్నది. ప్రధానితోను, ప్రణబ్‌ ముఖర్జీతోనూ పలుమార్లు భేటీ అయిన చమురు శాఖ మంత్రి జైపాల్‌ రెడ్డి పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచే అంశంపై సత్వరమే ఒక నిర్ణయం తీసుకునేందుకు వీలుగా మంత్రుల కమిటీ భేటీని ఏర్పాటు చేయాలని వత్తిడి తెచ్చారు. యుపిఎ భాగస్వామ్య పక్షాల ప్రతినిధులతో ఏర్పడిన ఈ మంత్రుల ఉన్నతాధికార కమిటీ ఏర్పడింది,

Saturday, June 18, 2011

చిరు కలిసిపోయి జీరో.. జగన్ వెళ్లిపోయి హీరో..?!!



ఒకాయన వెండితెరపై రాజ్యమేలిన రారాజు మెగాస్టార్. ఇంకోకాయన తండ్రిచాటు బిడ్డగా పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన యువనేత. వీళ్లిద్దరూ తమ మనసులో మాట బయటకు చెప్పకపోయినా లక్ష్యం ఒక్కటే. అదే సీఎం పీఠం. ఆ కుర్చీకోసం జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోగా.. అదే కుర్చీ కోసం ఆ పార్టీలో కలిసిపోయారు చిరంజీవి. 
ముందుగా వైఎస్ జగన్ విషయాన్నే తీసుకుంటే... తన తండ్రి హయాంలో పాలన సువర్ణమయంగా సాగిందని, దానికి ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోందనీ చెపుతున్నారు. కానీ ప్రారంభ దశలో ఎలాగోలా అధిష్టానంతో కలిసి ముందుకు నడవాలనీ, అయితే తనదైన ప్రత్యేక ఇమేజ్ కావాలని ఆరాటపడ్డారు. అనుకున్నట్లుగానే తండ్రి వదిలి వెళ్లిన ఆ ప్రాభవాన్ని సొంతం చేసుకోవడంలో ముందుకు నడిచారు. 
ఈ దశలో అధిష్టానం చెప్పిన మాటల్ని సైతం ఖాతరు చేయలేదు. చివరికి అధిష్టానం పంటి కింద రాయిలా మారినట్లు కనపించారు. దీంతో ఏం చేయాలో తెలియని అధిష్టానం పొమ్మనకుండా పొగబెట్టడం ఆరంభించింది. ఖచ్చితంగా ఇదే సమయంలో బయటకొచ్చి ఆత్మగౌరవ నినాదాన్ని మరోసారి ప్రజల ముందుకు తేవడమే కాకుండా కడప పార్లమెంట్ ఉపఎన్నికల్లో రికార్డు విజయాన్ని నమోదు చేశారు. అలా తన లక్ష్యానికి చేరువయ్యే దారులను వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం జనంలో పొలిటికల్ హీరో ఇమేజ్‌ను సృష్టించుకుంటున్నారు. 
జగన్ నిష్క్రమణతో కాంగ్రెస్ పార్టీని రక్షించేందుకు ఆ పార్టీలో కలిసిపోయారు సినీహీరో చిరంజీవి. నిజానికి ఈ కలయిక విషయంలో ప్రజారాజ్యం పార్టీ చూపిన చొరవను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూపలేదన్న వాదనలు వినబడుతున్నాయి. విలీనం ముగిసి కాంగ్రెస్ పార్టీలో సెంటర్ ఫర్ ది అట్రాక్షన్ అవుదామనుకున్న చిరంజీవిని ఎలా తొక్కి పట్టాలా...? అన్న కోణంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పలు గ్రూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. 
ఇందులో భాగంగానే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకునిగా పూర్తి అవతారం ఎత్తిన తర్వాత ఎక్కడికి వెళ్లినా ఆయననే టార్గెట్ చేస్తూ పలువురు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ విమర్శలను ధీటుగా ఎదుర్కొని అపర చాణక్యులున్న కాంగ్రెస్ నాయకులను అధిగమించి చిరంజీవి రాణిస్తే పొలిటికల్ హీరోనే.. లేదంటే జీరోగా మారడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 
చూద్దాం... పొలిటిక్స్‌లో జీరోలైన వారు హీరోలయ్యారు.. హీరోలుగా వెలిగిన వారు అమావాస్య చంద్రుడుగా మారిపోయారు. ఏం చేయాలన్న ప్రజల చేతుల్లోనే ఉంది.

Thursday, June 16, 2011

తెలంగాణా డిమాండ్.. వాళ్లు వెళ్తుంటారు.. వీళ్లు అంటుంటారు


తెలంగాణా డిమాండ్.. వాళ్లు వెళ్తుంటారు.. వీళ్లు అంటుంటారు
ప్రత్యేక రాష్ట్రం కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టడం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు షరా మామూలైపోయింది. ఈ పర్యటనల్లో తెలంగాణపై త్వరగా ఏదో ఒకటి తేల్చాలని చెప్పి రావడం వారి వంతుగా మారింది. అలాగే, అధినాయకత్వం కూడా ఏదో ఒకటి చెప్పి పంపించడం మినహా మరోమాట చెప్పడం లేదు. 
ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా తెలంగాణా రాష్ట్ర సమితి ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉత్త చేతుల్తో వస్తే ఊరుకోమనీ, హైదరాబాదులో అడుగు పెట్టనీయమనీ, తెలంగాణాలో తిరగలేరనీ, పదవులకు రాజీనామా చేయకపోతే తెలంగాణాలో ఉండలేరనీ హెచ్చరించడం మామూలైపోయింది. 
ఈ పార్టీల వైఖరిని చూసి తెలంగాణా ప్రజలు విసుగెత్తిపోతున్నారు. తెలంగాణా సాధనకు అది చేస్తాం... ఇది చేస్తాం అంటూ కాలం గడపడం తప్పించి మూకుమ్మడిగా అన్ని పార్టీలు ఎందుకు రాజీనామాలు సమర్పించడం లేదని వారు నిలదీస్తున్నారు. తెలంగాణాకోసమే పుట్టామంటూ చెపుతున్న తెరాస ఒకవైపు..., తెలంగాణా సాధన కోసం పదవులను సైతం లెక్కచేయమని చెపుతూవస్తున్న తెదేపా మరోవైపు, రాష్ట్ర సాధన కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ప్రగల్భాలు పలికే కాంగ్రెస్ నేతలు ఇంకోవైపు.. ఎవరికి వారే చిలకపలుకులు పలుకుతున్నారని ప్రజలు అంటున్నారు. 
తెలుగుదేశం పార్టీ వ్యవహారాన్నే పరిశీలిస్తే... కర్ర విరగదు.. పాము చావదు... అన్నట్లుగా సాగుతోంది. తెలంగాణా అంటే.. అది కాంగ్రెస్ సరిచూడాల్సిన అంశం అంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారు. అంతేతప్ప కరాఖండిగా రాష్ట్ర విభజన జరగాల్సిందే అని పట్టుబట్టిన సందర్భం కనిపించడం లేదు. ఏదో ద్వితీయశ్రేణి నాయకత్వంతో రణభేరి వంటి సభలను ఏర్పాటు చేసినా తెరాస వంటి పార్టీలు వేస్తున్న ప్రశ్నలకు ధీటైన సమాధానం చెప్పలేకపోతోంది. 
మిగిలింది.. అధికార కాంగ్రెస్ పార్టీ. తెలంగాణాలోని నేతలకు ఢిల్లీ వెళ్లి రావడం తప్పించి తెలంగాణా విషయంలో సాధించింది ఏమీ లేదన్న వాదనలు వినబడుతున్నా... మన్నుదిన్న పాములా వ్యవహరిస్తోంది. సమస్యను నానబెడుతూ కాలమే పరిష్కారం చూపుతుందన్న ధోరణితో వేచి చూస్తున్నట్లుగా కనబడుతోంది. మరి తెలంగాణా విషయంలో కాలం ఏం సమాధానం చెపుతుందో మనం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితే. ఏం చేద్దాం... అంతే... పొలిట్రిక్స్ అంటే లాభనష్టాల ఫార్ములా సరిచూస్కోవాలి కదా. ఆ లెక్క సరిపోతే దేనికైనా రెడీ.. లేదంటే గింజుకున్నా నో డీల్. దిసీజ్ యాక్చువల్ సిట్యువేషన్.

Wednesday, June 15, 2011

Rachaa


33 మంది సీనియర్‌ ఐఏఎస్‌ల బదలీలు


33 మంది సీనియర్‌ ఐఏఎస్‌ల బదలీలు

ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా భారీస్ధాయిలో 33 మంది సీనియర్‌ ఐఏఎస్‌లతోపాటు మరో ముగ్గురు జిల్లా కలెక్టర్ల కు స్ధానచలనం కలిగించడం విశేషం. మొత్తంగా మంగళవారం 36 మంది ఐఏఎస్‌లను స్థానిక ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచు కొని.. హడావిడిగా ఉత్తర్వులు జారీచేసింది. తాజా బదలీల్లో సమర్థ త, నిజాయితీ, వివాద రహిత అధికారులకు కీలక స్థానాల్లో నియ మించడం విశేషం. తాజా బదలీల్లో కడప కలెక్టర్‌తో పాటు ఆర్ధిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జి సుధీర్‌ను, ఆర్ధిక శాఖ కార్యదర్శి వసుధామిశ్రాలను బదలీచేశారు.

తిరిగి ఆర్థిక శాఖలో వసుధా మిశ్రా స్ధానంలో పుష్పా సుబ్రహ్మణ్యంకి అవకాశం కల్పించారు. అదేవిధంగా జి.సుధీర్‌ను ఆర్ధికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పదవి నుంచి వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా నియ మించారు. ఆ స్థానంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ పి. రమేష్‌ కేంద్ర సర్వీసులకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. సమర్థ, నిజాయితీ అధికారిగా పేరుగాంచిన బి.వెంక టేశంకు సమాచారశాఖ కమిషనర్‌గా అవకాశం కల్పించారు. టీటీడీ కార్యనిర్వాహణ అధికారి ఐవైఆర్‌ కృష్ణారావు వ్యవహారశైలిపై సొంత పార్టీ నేతల నుంచే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ స్ధానం నుంచి ఆయనను బదలీచేయక తప్పలేదు.  తాజాగా ఆయన ను ఆ స్థానం నుంచి కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.ఆ స్థానంలో టీటీడీ ఈవోగా వివాదరహితుడు, నిజాయితి పరుడైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి లంకా వెంకట సుబ్రహ్మ ణ్యంను నియమించారు. ఇదిలాఉంటే పలువురు జిల్లా కలెక్టర్లకు తాజా బదలీల్లో స్ధాన చలనం తప్పలేదు. అనంతపూర్‌ జిల్లా కలెక్టర్‌ బి.జనార్ధన్‌రెడ్డిని అక్కడినుంచి బదిలీచేసి పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ సంచాలకులుగా నియమించగా, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా కలెక్టర్‌గా ఉన్న శశి భూషణ్‌ కుమార్‌ను అక్కడినుంచి బదిలీచేసి అంతగా ప్రాధాన్యత లేని సాప్‌ ఎండీగా నియమించారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా కలెక్టరుగా భూభారతి పిడి అనీల్‌ కుమార్‌ను నియమించారు. అదే విధంగా విశాఖ జిల్లా కలెక్టరుగా సమర్థ అధికారిగా పేరుగాంచిన లవ్‌ అగర్వాల్‌ను, అనంతపురం జిల్లా కలెక్టరుగా వి దుర్గుదాస్‌కు అవ కాశం లభించింది.

బదిలీలు   కలెక్టర్, జెసి బదిలీ * కొత్త కలెక్టర్‌గా అగర్వాల్
విశాఖపట్నం : రాజకీయ కారణాలలో.. నిర్ణీత సమయం పూర్తి కావడం వలనో.. మరే ఇతర కారణాలో.. కానీ ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ శ్యామలరావు బదిలీ అయిపోయారు. శ్యామలరావును ఎపిహెచ్‌ఎంఐడిసి ఎం.డి.గా బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్యామలరావు స్థానంలో లౌవ్ అగర్వాల్‌ను నియమించింది. అలాగే జాయింట్ కలెక్టర్ పోలా భాస్కర్‌ను కూడా బదిలీ చేసింది. ఆయనను చీఫ్ రేషన్ ఆఫీసర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జివిఎంసికి పూర్తిస్థాయి కమిషనర్‌గా బి.రామాంజనేయులను నియమించింది. జివిఎంసి కమిషనర్‌గా పనిచేసిన వి.ఎన్.విష్ణును చాలారోజుల కిందట గుంటూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఇప్పటివరకూ ఎవరినీ నియమించలేదు. వుడా వైస్‌చైర్మన్ శశిథర్‌కు జివిఎంసి కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే జిల్లాలోని 15 మంది తహశీల్దార్లకు, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారితోపాటు, మరికొంతమంది డిప్యూటీ తహశీల్దార్లకూ బదిలీలయ్యాయి.
2009 జూన్ 15వ తేదీన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు అనేక వినూత్న కార్యక్రమాలు అమలు చేశారు. ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉండే విధంగా జీవనధార మందుల షాపులను నెలకొల్పారు. తక్కువ ధరకే మందులు అందజేసే ఈ విధానం రాష్ట్రంలోని అనేక జిల్లాలో అమలు చేయడానికి ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌లో ఇ-మస్తర్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఎన్‌ఆర్‌జిఎస్ పనుల్లో జిల్లా రాష్ట్రంలోనే అత్యున్నత స్థానంలో నిలిచింది. జిల్లా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కొత్తగా డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని శ్యామలరావు ప్రారంభించారు. ఆయన జిల్లాకు వచ్చిన కొత్తలో ఆకస్మిక తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. ముఖ్యంగా స్కూళ్లను తనిఖీ చేసి విధి నిర్వహణలో నిర్లక్షంగా ఉన్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది తహశీల్దార్లు, డాక్టర్ల పనితీరు సక్రమంగా లేకపోవడంతో వారిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. కెజిహెచ్‌కు నిధులు తీసుకురావడానికి శ్యామలరావు విశేష కృషి చేశారు.పరిపాలన ఈవిధంగా సాగుతున్న సమయంలో ఏజెన్సీలో చైనా క్లే తవ్వకాల కోసం భూ కేటాయింపు ఆయనకు తెలియకుండానే జరిగిపోయింది. ఇందుకు బాధ్యుడైన తహశీల్దార్‌పై చర్యకు శ్యామలరావు సిఫార్స్ చేశారు. ఇందుకు కలెక్టర్‌నే రాజకీయపక్షాలు బాధ్యునిగా చేశాయి.
ఇక శ్యామలరావుకు, మంత్రి బాలరాజుకు మధ్య కోల్డ్‌వార్ చాలాకాలంగా కొనసాగుతోంది. గత డిఆర్‌సిలో వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. శ్యామలరావు బదిలీకి మంత్రి బాలరాజు విస్తృతంగా ప్రయత్నించినట్టు పార్టీ వర్గాలే చెప్పుకుంటూ వచ్చాయి. శ్యామలరావును బదిలీ చేయడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సుముఖంగా లేరు. రాజకీయ ఒత్తిడులు పెరిగిపోవడంతో ఆయనను బదిలీ చేయక తప్పలేదు. గతంలో స్థానిక ఇపిడిసిఎల్ సి.ఎం.డి.గా బాధ్యతలు నిర్వహించిన లౌవ్ అగర్వాల్ ఇప్పుడు ఇదే జిల్లా కలెక్టర్‌గా రావడం ముదావహం.
జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న పోలా భాస్కర్‌ను చీఫ్ రేషన్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. ఆయన చాలాకాలంగా విశాఖ జిల్లాలో పనిచేస్తున్నారు. గతంలో జివిఎంసి అడిషనల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తరువాత ఐఎఎస్ కన్ఫర్మ్ అయింది. శిక్షణ పూర్తి చేసుకుని భాస్కర్ ఇదే జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా వచ్చారు. పోలా భాస్కర్ స్థానంలో గిరిజా శంకర్‌ను ప్రభుత్వం నియమించింది. గిరిజా శంకర్ గతంలో కడప జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. కొద్ది రోజులుగా ఆయన సెలవులో ఉన్నారు. గిరిజా శంకర్ గతంలో ఇదే జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు.
ఇదిలా ఉండగా జివిఎంసి కమిషనర్‌గా బి.రామాంజనేయులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయన గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. తరువాత ముస్సోరీకి శిక్షణ నిమిత్తం వెళ్లిపోయారు. శిక్షణలో ఉన్నప్పుడే స్కూళ్ళలో డ్రాపౌట్స్‌ను తగ్గించడానికి తీసుకోవలసిన చర్యలపై రామాంజనేయులు బృందం ఒక నివేదికను సమర్పించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అతనికి అవార్డును కూడా అందచేసింది.



ఈ శతాబ్దిలోనే ఇది సుదీర్ఘమైనది – నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం


ఈ శతాబ్దిలోనే ఇది సుదీర్ఘమైనది – నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం
ప్రపంచవ్యాప్తంగా ఖగోళ వింతలను వీక్షించాలనుకునే ఔత్సాహికులకు ఈరోజు సువర్ణావకాశం వచ్చింది. ఈ శతాబ్దిలోనే ఇది సుదీర్ఘమైన – దట్టమైన సంపూర్ణ చంద్ర గ్రహణం ఈ అర్ధరాత్రికే సంభవించ నుంది. భారత్‌లోని ఏప్రాంతం వారైనా ఈ గ్రహణాన్ని వీక్షించొచ్చు. బుధవారం అర్ధరాత్రి 12.52 గంటలకు ప్రారంభమయే గ్రహణం 02.32 గంటలకు ముగియనుంది. అంటే సుమారు గంట 58 నిమిషాలపాటు నిండు పున్నమి జాబిలి గ్రహణ ప్రభావానికి లోనుకానుంది. భూమి ఛాయలో చంద్రుడు సంపూర్ణంగా ఒదిగిపోనున్నాడని ఢిల్లీలోని నెహ్రూ నక్షత్రశాల డైరెక్టర్‌ ఎన్‌.రత్నశ్రీ చెప్పారు. పాక్షిక గ్రహణం అర్ధరాత్రి 12:52 గంటలకు ప్రారంభమై 03.32 గంటలకు ముగుస్తుందన్నారు. 2000 జులైలో సంభవించిన చంద్ర గ్రహణం దీనికన్నా సుదీర్ఘ సమయం కొనసా గిందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఇంతటి సుదీర్ఘకాలపు
చంద్ర గ్రహణం సంభవించేది మళ్ళీ 2141లోనేనని ఆమె చెప్పారు. మధ్య ఆసియా, ఆఫ్రికా ప్రాంతీయులూ ఈ గ్రహణాన్ని చూడగలుగుతారన్నారు. దక్షిణ అమెరికా మీదుగా సాగే గ్రహణ గమనం పశ్చిమ ఆఫ్రికా, యూరపుల మీదుగా ప్రయాణించి తూర్పు ఆసియా, ఆస్ట్రేలియాల ఎగువన ముగుస్తుందని శాస్త్ర సమాచార అవగాహనా ప్రచారోద్యమ సంఘం(స్పేస్‌)కు చెందిన సి.బి.దేవ్‌గన్‌ చెప్పారు. తదుపరి భారత్‌లో వీక్షించడానికి అనువైన చంద్రగ్రహణం. ఈ గ్రహణ సమయంలో చంద్రుణ్ణి అనుసరించి 51ఒపూచీ అనే ఒక నక్షత్రం మిణుకులీనుతుందని భారత ప్లానెటరీ సొసైటీకి చెందిన రఘునందన కుమార్‌ చెప్పారు.

పనికి కాదు బడికి పంపించాలి – విద్యా పక్షోత్సవాల ప్రారంభోత్సవ సభలో సిఎం


పనికి కాదు బడికి పంపించాలి – విద్యా పక్షోత్సవాల ప్రారంభోత్సవ సభలో సిఎం
పిల్లలను పనికి పంపించకుండా బడికి పంపించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తల్లిదండ్రులకు పిలుపు నిచ్చారు. అమీర్‌పేట ధరమ్‌కరమ్‌ రోడ్డులోని ప్రభుత్వోన్నత పాఠశాలలో విద్యా పక్షోత్సవాలను సోమవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13 నుండి 25 వరకు నిర్వహిస్తున్న సందర్భంగా సిఎం మాట్లా డుతూ పేదరికాన్ని జయించేందుకు విద్య ఒక్కటే మార్గమ న్నారు. అక్షరాస్యతలో మన రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాల్లో వెను కంజలో ఉందన్నారు. దీనిని నివారించేందుకే ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. సమస్యలెన్ని ఉన్నప్పటికీ తల్లిదండ్రులు పిల్లలను తప్పక చదివించాలని ప్రతిన బూనితే తప్ప ఈ కార్యక్రమం విజయవంతం కాద న్నారు. వచ్చే మూడేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాల కల్పనకు గాను పదోతరగతి, ఇంటర్‌ డిగ్రీ విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి రూ.150 కోట్లతో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కోసం రూ.3500 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు చెప్పారు. విద్యా పక్షోత్సవాల్లో భాగంగా బడి బయటి పిల్లలను బడిలో చేరేలా యాజమాన్య కమి టీలు, టీచర్లు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు కృషి చేయా లని సూచించారు. బాలికలు విద్యలో రాణించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా సిఎం పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. రాజీవ్‌ విద్యామిషన్‌, మహిళా శిశుసంక్షేమశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఛాయచిత్ర ప్రదర్శన సందర్శించి జవహర్‌ బాలభవన్‌ చిన్నారులు వేసిన చిత్రాలను తిలకించారు.

Tuesday, June 7, 2011

కాంగ్రెస్‌ వ్యూహాత్మక నిర్ణయం – బొత్సకు పిసిసి పీఠం


కాంగ్రెస్‌ వ్యూహాత్మక నిర్ణయం – బొత్సకు పిసిసి పీఠం
ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) నూతన అధ్యక్షుడిగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణను కాంగ్రెస్‌ అధిష్టానం నియమించింది. దీంతో కొద్దికాలంగా పిసిసి అధ్యక్ష పదవిపై కొనసాగుతోన్న సస్సెన్స్‌కు తెరపడినట్లయ్యింది. సోమవారం ఢిల్లీలో నాటకీయంగా జరిగిన పరిణామాల అనంతరం బొత్స పేరును పార్టీ అధికారికంగా ప్రకటించింది. మధ్యాహ్నానికి అనూహ్యంగా ఢిల్లీ చేరుకున్న బొత్స సత్యనారాయణ నేరుగా గులాంనబీ ఆజాద్‌ నివాసానికి వెళ్లారు. ఆజాద్‌ పిలుపు మేరకే ఆయన రహస్యంగా ఢిల్లీకి చేరుకున్నారు. రెండు గంటల పాటు జరిగిన చర్చల అనంతరం సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో బొత్సను తీసుకుని ఆజాద్‌ సోనియా నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన అభ్యర్ధిత్వానికి సోనియా ఆమోద ముద్ర వేశారు. అనంతరం రాత్రి ఏడున్నర ప్రాంతంలో బొత్సను పిసిసి అధ్యక్షునిగా నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌ ద్వివేదీ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
వ్యూహాత్మక నిర్ణయం
ప్రత్యేక తెలంగాణా, వైఎస్‌ జగన్‌ తిరుగుబాటుతో, సామాజిక పొందికలు వంటి పలు అంశాలను లోతుగా బేరిజు వేసిన అనంతరమే కాంగ్రెస్‌ అధిష్టానం బొత్సను పిసిసి పదవికి ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి సీమాంధ్ర వ్యక్తి కాబట్టి, తెలంగాణా వ్యక్తికే పిసిసి పదవి లభిస్తుందని తొలుత అందరూ భావించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఇదే సంప్రదాయం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు డిఎస్‌ స్థానంలో మరో తెలంగాణా నేతనే నియమిస్తారని భావించారు. గత రెండు మూడు వారాలుగా పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణలో ఒకరికి పిసిసి పదవి ఖాయమన్న వార్లలు బలంగా వినిపించాయి. అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని చివరకు బొత్సవైపే పార్టీ మొగ్గు చూపింది. బొత్స (సీమాంధ్ర నేత) నియామకం వెనుక ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్‌ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. 1. తెలంగాణా ప్రాంత వ్యక్తిని పిసిసి అధ్యక్షునిగా నియమిస్తే, తెలంగాణాతో పాటు సీమాంధ్రలోనూ సదరు నేత క్రియాశీలంగా వ్యవహరించలేరని పార్టీ భావించింది. ప్రస్తుత అధ్యక్షుడు డిఎస్‌నే తీసుకుంటే…తెలంగాణా వాదులకు వ్యతిరేకంగా ఆయన నోరువిప్పలేని స్థితి. సీమాంధ్ర నేతలపై అధికారం చెలాయించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సీమాంధ్ర నేతైతే కనీసం ఒక ప్రాంతంపైనైనా పట్టు సాధించడం సాధ్యమౌతుందని పార్టీ భావించినట్లు చెబుతున్నారు. 2. వైఎస్‌ జగన్‌ తిరుగుబాటు నేపథ్యంలో రాష్ట్రంలో రెడ్డి సామాజిక తరగతి కాంగ్రెస్‌కు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని అధిష్టానం అంచనా వేసింది.
ప్రస్తుతం కొద్దిమంది నేతలే జగన్‌ శిబిరంలో చేరినప్పటికీ, ఎన్నికల సమయానికి కాంగ్రెస్‌లోని ప్రధానమైన రెడ్డి నేతలందరూ ఫిరాయించడం ఖాయమని భావించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మరో బలమైన సామాజిక తరగతైన కాపు తరగతిపై పార్టీ గాలం వేసింది. చిరంజీవి నేతృత్వంలోని పిఆర్పీని పార్టీలో విలీనం చేసుకోవడం వెనుక పార్టీ లక్ష్యమూ అదే. ప్రస్తుతం బొత్స నియామకం ద్వారా కాపులు మొత్తంగా బిసిలను పార్టీ పునాదివర్గంగా మార్చాలన్నది పార్టీ వ్యూహంగా భావిస్తున్నారు. 3. నాడు వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొత్స అన్ని విషయా ల్లోనూ ఎంతో క్రియాశీల పాత్ర పోషించారు. వైఎస్‌ అంతర్గత కోటరీలో సభ్యుడిగా అన్ని అంశాలపైనా ఆయనకు ఆకళింపు ఉంది. కింది స్థాయి నుండి వచ్చిన నేతగా కలుపుగోలుతనం, చొరవ, వ్యూహాత్మక వైఖరి ఆయనకు అదనపు బలాన్ని ఇచ్చాయి. కేశవరావు, హనుమంతరావు తదితర తెలంగాణా సీనియర్‌ నేతలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. తాను పదవి నుండి తప్పు కున్న తర్వాత ఒకానొక సమయంలో బొత్సకు పిసిసి పగ్గాలు ఇప్పించేందుకు కెకె కూడా ఢిల్లీలో లాబీయింగ్‌ చేశారు. ఈ పరిణామాలన్నీ ఆయనకు కలిసి వచ్చాయి. పిఆర్పీ అధినేత చిరంజీవి కూడా బొత్స అభ్యర్ధిత్వంవైపే మొగ్గు చూపడంతో అధి ష్టానం చివరకు ఆయన పేరునే ఖరారు చేసింది.
పార్టీ ఐక్యతే కర్తవ్యం సిఎంతో విభేదాల్లేవు : సత్యనారాయణ
రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు, తరగతుల నేతలను సమైక్యంగా మందుకు తీసుకెళ్లడమే తన ముందున్న కర్తవ్యమని పిసిసి నూతన అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని పేర్కొన్నారు. పిసిసి అధ్యక్షపదవికి పార్టీ అధిష్టానం తన పేరును ఖరారు చేసిన అనంతరం సోమవారం రాత్రి ఇక్కడి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో ఆయన మీడి యాతో మాట్లాడారు. ‘పార్టీలో మనస్పర్థలు, అభిప్రాయ బేధాలుండటం సహజం. పదవులు, అధికారం ముఖ్యం కాదన్న విషయం అందరికీ తెలుసు. ఆశించిన విధంగా పార్టీ ప్రజాసేవ చేయాలంటే అన్ని ప్రాంతాలు, తరగతుల నేతలు సమైక్యంగా, సమిష్టిగా పనిచేయాలి. అదే నా కర్తవ్యం’ అని ఈ సందర్భంగా బొత్స వ్యాఖ్యా నించారు. ప్రత్యేక తెలంగాణా అంశంపై గతంలో మంత్రిగా, ప్రస్తుతం పిసిసి అధ్యక్షునిగా తనది ఒకే అభిప్రాయమన్నారు. తెలంగాణాకు తాను అనుకూలం లేదా వ్యతిరేకం కాదని, అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌తో తనకు విభేధాలున్నాయన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పిసిసి అధ్యక్షునిగా తన పేరును ఖరారు చేసే ముందు పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డినీ సంప్రదించిందని తెలిపారు. ‘కిరణ్‌ సిఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రివర్గ కూర్పుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం వాస్తవమే. అన్ని ప్రాంతాలు, తరగతులకు సరైన ప్రాతినిధ్యం, ప్రాధాన్యత లభించలేదని నాడు నేను చెప్పాను. ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలన్నాను. దానర్ధం నాకు ముఖ్యమంత్రితో సఖ్యత లేదని కాదు’ అని ఈ సందర్భంగా అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పిసిసి అధ్యక్ష పదవి ఎంతో గురుతరమైన బాధ్యతని, సోనియా, ఆజాద్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని పార్టీ పెద్దలకు, ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు డిఎస్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. పిసిసి పదవి లభించిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేయబోనని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. ‘ఈ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని అమలు చేస్తాను. నా అంతట నేను రాజీనామా చేయాలని భావించడం లేదు’ అని ఈ అంశంపై బొత్స వ్యాఖ్యానించారు.

Monday, June 6, 2011

ఢిల్లీకి ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు


ఢిల్లీకి ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు

ప్రజారాజ్యం పార్టీ శాసన సభ్యులు సోమవారం ఉదయం ఢిల్లీకి రానున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి గులాం నబీ ఆజాద్‌తోను మరికోందరు అధిష్ఠానం పెద్దలతోనూ చిరంజీవి, ఆయన ఎమ్మెల్యేలు భేటీకానునున్నారు. త్వరలోనే ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో అధికారికంగా విలీనమవుతున్న ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలతో ముఖాముఖి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే రెండు రోజులుగా ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఢిల్లీలో మకాం వేసి అధిష్ఠానం పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. శనివారం రాత్రి చిరంజీవి ఆజాద్‌తో భేటీ అయి సుమారు రెండు గంటలపాటు సమావేశమయిన సంగతి తెలిసిందే.
ఈ సమావేశంలో మంత్రి వర్గం విస్తరణపై తీవ్ర స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలుస్తున్నది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి పార్టీకి జీవం పోశానంటూ చిరంజీవి బేరాలకు దిగినట్లు తెలిసింది. తన పార్టీని నమ్ముకుని తనకు అండదండలందించిన శాసన సభ్యులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చిరంజీవి ఆజాద్‌ను కోరినట్లు తెలుస్తున్నది. మంత్రివర్గ విస్తరణలో కనీసం నాలుగు మంత్రిపదవులైనా కేటాయించాలని శనివారం జరిగిన సమావేశంలో చిరంజీవి ఆజాద్‌ను కోరినట్లు, రెండు మంత్రిపదవులు ఇచ్చేందుకు అధిష్ఠానం సిద్ధంగా వుందని ఆజాద్‌ తేల్చి చెప్పినట్లు తెలుస్తున్నది.


ప్రస్తుత పరిస్థితులలో క్యాబినెట్‌ నుంచి ఎవరిని తప్పించినా పార్టీకి ఆయా జిల్లాలలో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం వున్నందున సర్ధుకు పోవాలని ఆజాద్‌ సూచించినట్లు తెలిసింది. ముందు ముందు స్థానిక సంస్థల ఎన్నిల సవాల్‌గా మారనున్నాయని, అసలే జగన్‌ పార్టీలోకి ఎమ్మెల్యేలు ఫిరాయిస్తున్నారని, ఏ మాత్రం సమతుల్యం తప్పినా పరిణామాలు ఊహించని విధంగా వుంటాయని తన అభిప్రాయాన్ని చెప్పారని సమాచారం. చిరంజీవి కూడా తాను ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కుంటున్నానని మరోమారు అధిష్ఠానంలోని నాయకులకు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించమని వేడుకున్నట్లు తెలుస్తున్నది. ఇది ఇలా వుండగా పార్టీ విలీనం అంనంతరం కాంగ్రెస్‌ పార్టీలోని శాసన సభ్యులతో పనిచేయాలికనుక ఒకసారి పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే బావుంటుందంటూ ఆజాద్‌ చిరంజీవితో అన్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకే పార్టీ ఎమ్మెల్యేలందరూ ఢిల్లీకి పయనమయ్యారని తెలుస్తున్నది. ఈ ముఖాముఖి కార్యక్రమంలో ఏదో నిగూఢార్ధం దాగివుందని ఢిల్లీలోని కాంగ్రెస్‌ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు.

నా హత్యకు కేంద్రం కుట్ర – బాబా రామ్‌దేవ్ ఆరోపణ


అవినీతికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన బాబా రామ్‌దేవ్.. తన హత్యకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని సంచలన ఆరోపణ చేశారు. ‘నా ఉద్యమంతో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. అందుకే నన్ను హతమార్చాలని చూస్తోంది. నన్ను ఎన్‌కౌంటర్‌లో చంపేందుకు కుట్ర కూడా జరిగింది. నాకేదైనా అయితే సోనియా, కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని అన్నారు. చర్చల సమయంలోనే మంత్రులు తనను బెదిరించారని ఆరోపించారు. బలవంతంగా తన దీక్షను భగ్నం చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

రామ్‌లీలా క్షేత్రంలో యుద్ధ వాతావ రణం
శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత రామ్‌దేవ్ దీక్షాప్రాంగణం రామ్‌లీలా మైదాన్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. ఒంటిగంట సమయంలో పోలీసులు దీక్షాప్రాంగణంపై విరుచుకుపడి, రామ్‌దేవ్‌ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఆ సందర్భంగా దాదాపు మూడు గంటలపాటు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు, రామ్‌దేవ్ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలో 62 మంది గాయాలపాలయ్యారు. వారిలో 23 మందికి పైగా పోలీసులున్నారు.  అరెస్ట్ అనంతరం ప్రత్యేక విమానంలో రామ్‌దేవ్‌ను డెహ్రాడూన్‌కు తరలించారు. దాంతో రామ్‌దేవ్ ప్రారంభించిన దీక్ష పూర్తిగా ఒక్కరోజు కూడా పూర్తికాకుండానే అర్ధంతరంగా ఆగిపోయింది. 15 రోజుల పాటు ఢిల్లీలో ప్రవేశించకుండా రామ్‌దేవ్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది.


ఎమర్జెన్సీ రోజులు

రామ్‌దేవ్‌పై పోలీస్ చర్యను ప్రభుత్వం పూర్తిగా సమర్ధించుకోగా, బీజేపీ సహా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ప్రభుత్వ చర్యలు ఎమర్జెన్సీ రోజులను గుర్తుతెస్తున్నాయని బీజేపీ విమర్శించింది. దీక్ష భగ్నానికి నిరసనగా ఆదివారం దేశవ్యాప్తంగా 24 గంటల నిరసన కార్యక్రమం చేపట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ పిలుపునిచ్చారు. బాబాకు ప్రాణహాని ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు రామ్‌దేవ్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ప్రకటించారు. అది పూర్తిగా రాజకీయపరమైన నిర్ణయమని స్పష్టంచేశారు.  రామ్‌దేవ్ దీక్షను భగ్నం చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీల సంపూర్ణ మద్దతుందని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ పేర్కొన్నారు. డిమాండ్లపై ఒక అంగీకారానికి వచ్చిన తరువాత దీక్ష విరమిస్తానన్న రామ్‌దేవ్, ఆ తరువాత మాట తప్పారని సిబల్ ఆరోపించారు. రామ్‌దేవ్ బాబాతో ఇక చర్చలుండవని మరోమంత్రి సుబోధ్‌కాంత్‌సహాయ్ స్పష్టంచేశారు. రామ్‌దేవ్ దీక్ష భగ్నానికి నిరసనగా నేడు జరగనున్న లోక్‌పాల్ ముసాయిదా కమిటీ సమావేశానికి గైర్హాజరవుతామని హజారే నేతృత్వంలోని పౌరసమాజం సభ్యులు ప్రకటించారు. జూన్ 8న జంతర్‌మంతర్ వద్ద సామాజిక కార్యకర్తలు నిరాహారదీక్ష చేపడ్తారని హజారే వెల్లడించారు.
మతతత్వ సవాళ్లను ఎదుర్కొంటాం: కాంగ్రెస్
రామ్‌దేవ్ దీక్ష భగ్నానంతర పరిస్థితులపై చర్చించేందుకు సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సమావేశం జరిగింది. సమావేశానంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేదీ విలేకరులతో మాట్లాడారు. రామ్‌దేవ్ దీక్షపై పోలీస్ యాక్షన్‌ను కాంగ్రెస్ పార్టీ సమర్ధిస్తోందా? అన్న ప్రశ్నకు.. ఆ విషయంపై ప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇచ్చిందంటూ.. ఆయన సమాధానం దాటవేశారు. మతతత్వ పార్టీల నుంచి వస్తున్న సవాళ్లను ఎదుర్కోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కోలేక, స్వప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ, మతవాద శక్తులు దేశంలోని రాజ్యాంగ సంస్థలను బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. భేటీలో సోనియా సహా పార్టీ సీనియర్ నేతలు ప్రణబ్, చిదంబరం, సిబల్, ఆంటోనీ, అహ్మద్ పటేల్, ఆజాద్, ముకుల్ వాస్నిక్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి మళ్లీ దీక్ష: రామ్‌దేవ్
అవినీతిపై ఢిల్లీలో తాను చేపట్టిన నిరశన దీక్షను కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్న నేపథ్యంలో యోగా గురువు బాబా రామ్‌దేవ్ సోమవారం నుంచి హరిద్వార్‌లో తన దీక్షను కొనసాగించాలని నిర్ణయించారు. చట్టాన్ని ఎవరూ అతిక్రమించరాదనే తాను ఢిల్లీకి తిరిగి వెళ్లడంలేదని ఆది వారం రాత్రి హరిద్వార్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో తాను దీక్షకు ప్రయత్నించినా అక్కడకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. అంతకుముందు హరిద్వార్ నుంచి కారులో ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నించిన రామ్‌దేవ్‌ను యూపీ పోలీసులు అడ్డుకొని తిరిగి హరిద్వార్ పంపారు.

Sunday, June 5, 2011

విజయవాడలో విలీన సభ….


విజయవాడలో విలీన సభ….
కాంగ్రెస్‌ అధిష్ఠానంతో బేరసారాలు పూర్తి అయిన తర్వాత, విలీనానికి ఈసీ నుంచి అనుమతి వచ్చిన తర్వాత చిరంజీవి ఇక విలీన సభకు ఏర్పాట్లు ప్రారంభించనున్నారు. కనీ వినీ ఎరుగని రీతిలో విలీన సభ నిర్వహిస్తామని ఆయన చాలా రోజుల క్రితమే చెప్పారు. ఈ విలీన సభను విజయవాడలో జరపాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవులపై ప్రతిష్టంభన తొలగి పోతే ఇక విలీనం జరగటం లాంఛనమే అవుతుందని పార్టీ వర్గాలు చెప్పాయి.
నాలుగు మంత్రి పదవులు, విప్‌…
తనకు కేంద్రంలో పదవి ఇచ్చినప్పటికీ, రాష్ట్ర మంత్రి వర్గంలో నాలుగు మంత్రి పదవులు, ఒక విప్‌ కావాలని చిరంజీవి గట్టిగా కోరుతున్నారు. అలాగే మున్ముందు జరిగే కార్పొరేషన్‌ పదవుల భర్తీలో తమకు గణనీయమైన వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ నాయకత్వం మాత్రం మూడు పదవులతో సర్దుకోమని నచ్చజెబుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చిరు అగదే డిమాండ్‌ చేస్తే సర్ది చెప్పి మూడు మంత్రి పదవులు, ఒక విప్‌కు అంగీకరించేలా ప్రయత్నాలు చేయవచ్చునని తెలిసింది. కార్పొరేషన్‌ పదవుల విషయంలో మాత్రం ఇప్పుడప్పుడే హామీ ఇవ్వకుండా కొంతకాలం వేచి చూడాలని చెప్పే అవకాశాలున్నాయి. 18 మంది ఎమ్మెల్యేలలో భూమా శోభా నాగిరెడ్డి పోగా చిరంజీవిని మినహాయించి 16 మందిలో చాలా మంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. గంటా శ్రీనివాసరావు, కన్నబాబు, వంగా గీత లాంటి వారు ఎప్పటినుంచో ఈ ఆశలు పెంచుకుని ఉన్నారు.
రేపు ఈసీ అనుమతి…
చిరంజీవి ఢిల్లీ యాత్రలో మరో విశేషం ఉంది. తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు అనుమతి ఇవ్వాలని చాలా రోజుల క్రితమే దర ఖాస్తు చేసుకున్నారు. అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్ని కల సం ఘం సోమవారం అనుమతి పత్రాన్ని అందజేసే అవకాశం ఉం దంటు న్నారు. ఆ పత్రం వస్తే విలీనానికి అన్ని అడ్డంకులూ తొలగినట్టే అవుతుంది.

డిజిపి అరవిందరావుకు డాక్టరేట్‌



డిజిపి అరవిందరావుకు డాక్టరేట్‌

డిజిపి కె అరవిందరావుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రకటించింది. అరవిందరావు వర్సిటీ భాషలు అనువాద అధ్యయన కేంద్రంలో ఆచార్య శ్రీపాద సుబ్రహ్యణ్యం పర్యవేక్షణలో ‘అద్వైత దృష్ట్యా ఉపనిషనిత్తుల జ్ఞానస్వరూపం-ఒక పరిశీలన’ అనే అంశంపై పిహెచ్‌డి చేసినట్లు ప్రజాసంబంధాల అధికారి జి.చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనకు త్వరలో జరిగే స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ ప్రదానం చేస్తారు.
అనుమాండ్ల భూమయ్యకు దత్తపీఠం స్వర్ణకంకణం
పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ అనుమాండ్ల భూమయ్యకు మైసూరు దత్తపీఠం వారి ప్రతిష్టాత్మకమైన ఆస్థాన విద్యాంసుని గౌరవం, స్వర్ణకంకణ సత్కారం లభించింది. దత్తపీఠంలో జరిగిన ఓ కార్యక్రమంలో గణపతి సచ్చిదానంద స్వామి చేతులమీదుగా భూమయ్య ఈ గౌరవాన్ని అందుకున్నట్లు వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.