Saturday, June 18, 2011

చిరు కలిసిపోయి జీరో.. జగన్ వెళ్లిపోయి హీరో..?!!



ఒకాయన వెండితెరపై రాజ్యమేలిన రారాజు మెగాస్టార్. ఇంకోకాయన తండ్రిచాటు బిడ్డగా పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన యువనేత. వీళ్లిద్దరూ తమ మనసులో మాట బయటకు చెప్పకపోయినా లక్ష్యం ఒక్కటే. అదే సీఎం పీఠం. ఆ కుర్చీకోసం జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోగా.. అదే కుర్చీ కోసం ఆ పార్టీలో కలిసిపోయారు చిరంజీవి. 
ముందుగా వైఎస్ జగన్ విషయాన్నే తీసుకుంటే... తన తండ్రి హయాంలో పాలన సువర్ణమయంగా సాగిందని, దానికి ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోందనీ చెపుతున్నారు. కానీ ప్రారంభ దశలో ఎలాగోలా అధిష్టానంతో కలిసి ముందుకు నడవాలనీ, అయితే తనదైన ప్రత్యేక ఇమేజ్ కావాలని ఆరాటపడ్డారు. అనుకున్నట్లుగానే తండ్రి వదిలి వెళ్లిన ఆ ప్రాభవాన్ని సొంతం చేసుకోవడంలో ముందుకు నడిచారు. 
ఈ దశలో అధిష్టానం చెప్పిన మాటల్ని సైతం ఖాతరు చేయలేదు. చివరికి అధిష్టానం పంటి కింద రాయిలా మారినట్లు కనపించారు. దీంతో ఏం చేయాలో తెలియని అధిష్టానం పొమ్మనకుండా పొగబెట్టడం ఆరంభించింది. ఖచ్చితంగా ఇదే సమయంలో బయటకొచ్చి ఆత్మగౌరవ నినాదాన్ని మరోసారి ప్రజల ముందుకు తేవడమే కాకుండా కడప పార్లమెంట్ ఉపఎన్నికల్లో రికార్డు విజయాన్ని నమోదు చేశారు. అలా తన లక్ష్యానికి చేరువయ్యే దారులను వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం జనంలో పొలిటికల్ హీరో ఇమేజ్‌ను సృష్టించుకుంటున్నారు. 
జగన్ నిష్క్రమణతో కాంగ్రెస్ పార్టీని రక్షించేందుకు ఆ పార్టీలో కలిసిపోయారు సినీహీరో చిరంజీవి. నిజానికి ఈ కలయిక విషయంలో ప్రజారాజ్యం పార్టీ చూపిన చొరవను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూపలేదన్న వాదనలు వినబడుతున్నాయి. విలీనం ముగిసి కాంగ్రెస్ పార్టీలో సెంటర్ ఫర్ ది అట్రాక్షన్ అవుదామనుకున్న చిరంజీవిని ఎలా తొక్కి పట్టాలా...? అన్న కోణంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పలు గ్రూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. 
ఇందులో భాగంగానే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకునిగా పూర్తి అవతారం ఎత్తిన తర్వాత ఎక్కడికి వెళ్లినా ఆయననే టార్గెట్ చేస్తూ పలువురు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ విమర్శలను ధీటుగా ఎదుర్కొని అపర చాణక్యులున్న కాంగ్రెస్ నాయకులను అధిగమించి చిరంజీవి రాణిస్తే పొలిటికల్ హీరోనే.. లేదంటే జీరోగా మారడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 
చూద్దాం... పొలిటిక్స్‌లో జీరోలైన వారు హీరోలయ్యారు.. హీరోలుగా వెలిగిన వారు అమావాస్య చంద్రుడుగా మారిపోయారు. ఏం చేయాలన్న ప్రజల చేతుల్లోనే ఉంది.

No comments:

Post a Comment