Monday, June 6, 2011

నా హత్యకు కేంద్రం కుట్ర – బాబా రామ్‌దేవ్ ఆరోపణ


అవినీతికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన బాబా రామ్‌దేవ్.. తన హత్యకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని సంచలన ఆరోపణ చేశారు. ‘నా ఉద్యమంతో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. అందుకే నన్ను హతమార్చాలని చూస్తోంది. నన్ను ఎన్‌కౌంటర్‌లో చంపేందుకు కుట్ర కూడా జరిగింది. నాకేదైనా అయితే సోనియా, కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని అన్నారు. చర్చల సమయంలోనే మంత్రులు తనను బెదిరించారని ఆరోపించారు. బలవంతంగా తన దీక్షను భగ్నం చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

రామ్‌లీలా క్షేత్రంలో యుద్ధ వాతావ రణం
శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత రామ్‌దేవ్ దీక్షాప్రాంగణం రామ్‌లీలా మైదాన్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. ఒంటిగంట సమయంలో పోలీసులు దీక్షాప్రాంగణంపై విరుచుకుపడి, రామ్‌దేవ్‌ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఆ సందర్భంగా దాదాపు మూడు గంటలపాటు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు, రామ్‌దేవ్ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలో 62 మంది గాయాలపాలయ్యారు. వారిలో 23 మందికి పైగా పోలీసులున్నారు.  అరెస్ట్ అనంతరం ప్రత్యేక విమానంలో రామ్‌దేవ్‌ను డెహ్రాడూన్‌కు తరలించారు. దాంతో రామ్‌దేవ్ ప్రారంభించిన దీక్ష పూర్తిగా ఒక్కరోజు కూడా పూర్తికాకుండానే అర్ధంతరంగా ఆగిపోయింది. 15 రోజుల పాటు ఢిల్లీలో ప్రవేశించకుండా రామ్‌దేవ్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది.


ఎమర్జెన్సీ రోజులు

రామ్‌దేవ్‌పై పోలీస్ చర్యను ప్రభుత్వం పూర్తిగా సమర్ధించుకోగా, బీజేపీ సహా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ప్రభుత్వ చర్యలు ఎమర్జెన్సీ రోజులను గుర్తుతెస్తున్నాయని బీజేపీ విమర్శించింది. దీక్ష భగ్నానికి నిరసనగా ఆదివారం దేశవ్యాప్తంగా 24 గంటల నిరసన కార్యక్రమం చేపట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ పిలుపునిచ్చారు. బాబాకు ప్రాణహాని ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు రామ్‌దేవ్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ప్రకటించారు. అది పూర్తిగా రాజకీయపరమైన నిర్ణయమని స్పష్టంచేశారు.  రామ్‌దేవ్ దీక్షను భగ్నం చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీల సంపూర్ణ మద్దతుందని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ పేర్కొన్నారు. డిమాండ్లపై ఒక అంగీకారానికి వచ్చిన తరువాత దీక్ష విరమిస్తానన్న రామ్‌దేవ్, ఆ తరువాత మాట తప్పారని సిబల్ ఆరోపించారు. రామ్‌దేవ్ బాబాతో ఇక చర్చలుండవని మరోమంత్రి సుబోధ్‌కాంత్‌సహాయ్ స్పష్టంచేశారు. రామ్‌దేవ్ దీక్ష భగ్నానికి నిరసనగా నేడు జరగనున్న లోక్‌పాల్ ముసాయిదా కమిటీ సమావేశానికి గైర్హాజరవుతామని హజారే నేతృత్వంలోని పౌరసమాజం సభ్యులు ప్రకటించారు. జూన్ 8న జంతర్‌మంతర్ వద్ద సామాజిక కార్యకర్తలు నిరాహారదీక్ష చేపడ్తారని హజారే వెల్లడించారు.
మతతత్వ సవాళ్లను ఎదుర్కొంటాం: కాంగ్రెస్
రామ్‌దేవ్ దీక్ష భగ్నానంతర పరిస్థితులపై చర్చించేందుకు సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సమావేశం జరిగింది. సమావేశానంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేదీ విలేకరులతో మాట్లాడారు. రామ్‌దేవ్ దీక్షపై పోలీస్ యాక్షన్‌ను కాంగ్రెస్ పార్టీ సమర్ధిస్తోందా? అన్న ప్రశ్నకు.. ఆ విషయంపై ప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇచ్చిందంటూ.. ఆయన సమాధానం దాటవేశారు. మతతత్వ పార్టీల నుంచి వస్తున్న సవాళ్లను ఎదుర్కోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కోలేక, స్వప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ, మతవాద శక్తులు దేశంలోని రాజ్యాంగ సంస్థలను బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. భేటీలో సోనియా సహా పార్టీ సీనియర్ నేతలు ప్రణబ్, చిదంబరం, సిబల్, ఆంటోనీ, అహ్మద్ పటేల్, ఆజాద్, ముకుల్ వాస్నిక్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి మళ్లీ దీక్ష: రామ్‌దేవ్
అవినీతిపై ఢిల్లీలో తాను చేపట్టిన నిరశన దీక్షను కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్న నేపథ్యంలో యోగా గురువు బాబా రామ్‌దేవ్ సోమవారం నుంచి హరిద్వార్‌లో తన దీక్షను కొనసాగించాలని నిర్ణయించారు. చట్టాన్ని ఎవరూ అతిక్రమించరాదనే తాను ఢిల్లీకి తిరిగి వెళ్లడంలేదని ఆది వారం రాత్రి హరిద్వార్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో తాను దీక్షకు ప్రయత్నించినా అక్కడకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. అంతకుముందు హరిద్వార్ నుంచి కారులో ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నించిన రామ్‌దేవ్‌ను యూపీ పోలీసులు అడ్డుకొని తిరిగి హరిద్వార్ పంపారు.

No comments:

Post a Comment