Monday, June 6, 2011

ఢిల్లీకి ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు


ఢిల్లీకి ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు

ప్రజారాజ్యం పార్టీ శాసన సభ్యులు సోమవారం ఉదయం ఢిల్లీకి రానున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి గులాం నబీ ఆజాద్‌తోను మరికోందరు అధిష్ఠానం పెద్దలతోనూ చిరంజీవి, ఆయన ఎమ్మెల్యేలు భేటీకానునున్నారు. త్వరలోనే ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో అధికారికంగా విలీనమవుతున్న ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలతో ముఖాముఖి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే రెండు రోజులుగా ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఢిల్లీలో మకాం వేసి అధిష్ఠానం పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. శనివారం రాత్రి చిరంజీవి ఆజాద్‌తో భేటీ అయి సుమారు రెండు గంటలపాటు సమావేశమయిన సంగతి తెలిసిందే.
ఈ సమావేశంలో మంత్రి వర్గం విస్తరణపై తీవ్ర స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలుస్తున్నది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి పార్టీకి జీవం పోశానంటూ చిరంజీవి బేరాలకు దిగినట్లు తెలిసింది. తన పార్టీని నమ్ముకుని తనకు అండదండలందించిన శాసన సభ్యులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చిరంజీవి ఆజాద్‌ను కోరినట్లు తెలుస్తున్నది. మంత్రివర్గ విస్తరణలో కనీసం నాలుగు మంత్రిపదవులైనా కేటాయించాలని శనివారం జరిగిన సమావేశంలో చిరంజీవి ఆజాద్‌ను కోరినట్లు, రెండు మంత్రిపదవులు ఇచ్చేందుకు అధిష్ఠానం సిద్ధంగా వుందని ఆజాద్‌ తేల్చి చెప్పినట్లు తెలుస్తున్నది.


ప్రస్తుత పరిస్థితులలో క్యాబినెట్‌ నుంచి ఎవరిని తప్పించినా పార్టీకి ఆయా జిల్లాలలో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం వున్నందున సర్ధుకు పోవాలని ఆజాద్‌ సూచించినట్లు తెలిసింది. ముందు ముందు స్థానిక సంస్థల ఎన్నిల సవాల్‌గా మారనున్నాయని, అసలే జగన్‌ పార్టీలోకి ఎమ్మెల్యేలు ఫిరాయిస్తున్నారని, ఏ మాత్రం సమతుల్యం తప్పినా పరిణామాలు ఊహించని విధంగా వుంటాయని తన అభిప్రాయాన్ని చెప్పారని సమాచారం. చిరంజీవి కూడా తాను ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కుంటున్నానని మరోమారు అధిష్ఠానంలోని నాయకులకు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించమని వేడుకున్నట్లు తెలుస్తున్నది. ఇది ఇలా వుండగా పార్టీ విలీనం అంనంతరం కాంగ్రెస్‌ పార్టీలోని శాసన సభ్యులతో పనిచేయాలికనుక ఒకసారి పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే బావుంటుందంటూ ఆజాద్‌ చిరంజీవితో అన్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకే పార్టీ ఎమ్మెల్యేలందరూ ఢిల్లీకి పయనమయ్యారని తెలుస్తున్నది. ఈ ముఖాముఖి కార్యక్రమంలో ఏదో నిగూఢార్ధం దాగివుందని ఢిల్లీలోని కాంగ్రెస్‌ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు.

No comments:

Post a Comment