Wednesday, June 15, 2011

33 మంది సీనియర్‌ ఐఏఎస్‌ల బదలీలు


33 మంది సీనియర్‌ ఐఏఎస్‌ల బదలీలు

ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా భారీస్ధాయిలో 33 మంది సీనియర్‌ ఐఏఎస్‌లతోపాటు మరో ముగ్గురు జిల్లా కలెక్టర్ల కు స్ధానచలనం కలిగించడం విశేషం. మొత్తంగా మంగళవారం 36 మంది ఐఏఎస్‌లను స్థానిక ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచు కొని.. హడావిడిగా ఉత్తర్వులు జారీచేసింది. తాజా బదలీల్లో సమర్థ త, నిజాయితీ, వివాద రహిత అధికారులకు కీలక స్థానాల్లో నియ మించడం విశేషం. తాజా బదలీల్లో కడప కలెక్టర్‌తో పాటు ఆర్ధిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జి సుధీర్‌ను, ఆర్ధిక శాఖ కార్యదర్శి వసుధామిశ్రాలను బదలీచేశారు.

తిరిగి ఆర్థిక శాఖలో వసుధా మిశ్రా స్ధానంలో పుష్పా సుబ్రహ్మణ్యంకి అవకాశం కల్పించారు. అదేవిధంగా జి.సుధీర్‌ను ఆర్ధికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పదవి నుంచి వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా నియ మించారు. ఆ స్థానంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ పి. రమేష్‌ కేంద్ర సర్వీసులకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. సమర్థ, నిజాయితీ అధికారిగా పేరుగాంచిన బి.వెంక టేశంకు సమాచారశాఖ కమిషనర్‌గా అవకాశం కల్పించారు. టీటీడీ కార్యనిర్వాహణ అధికారి ఐవైఆర్‌ కృష్ణారావు వ్యవహారశైలిపై సొంత పార్టీ నేతల నుంచే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ స్ధానం నుంచి ఆయనను బదలీచేయక తప్పలేదు.  తాజాగా ఆయన ను ఆ స్థానం నుంచి కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.ఆ స్థానంలో టీటీడీ ఈవోగా వివాదరహితుడు, నిజాయితి పరుడైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి లంకా వెంకట సుబ్రహ్మ ణ్యంను నియమించారు. ఇదిలాఉంటే పలువురు జిల్లా కలెక్టర్లకు తాజా బదలీల్లో స్ధాన చలనం తప్పలేదు. అనంతపూర్‌ జిల్లా కలెక్టర్‌ బి.జనార్ధన్‌రెడ్డిని అక్కడినుంచి బదిలీచేసి పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ సంచాలకులుగా నియమించగా, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా కలెక్టర్‌గా ఉన్న శశి భూషణ్‌ కుమార్‌ను అక్కడినుంచి బదిలీచేసి అంతగా ప్రాధాన్యత లేని సాప్‌ ఎండీగా నియమించారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా కలెక్టరుగా భూభారతి పిడి అనీల్‌ కుమార్‌ను నియమించారు. అదే విధంగా విశాఖ జిల్లా కలెక్టరుగా సమర్థ అధికారిగా పేరుగాంచిన లవ్‌ అగర్వాల్‌ను, అనంతపురం జిల్లా కలెక్టరుగా వి దుర్గుదాస్‌కు అవ కాశం లభించింది.

బదిలీలు   కలెక్టర్, జెసి బదిలీ * కొత్త కలెక్టర్‌గా అగర్వాల్
విశాఖపట్నం : రాజకీయ కారణాలలో.. నిర్ణీత సమయం పూర్తి కావడం వలనో.. మరే ఇతర కారణాలో.. కానీ ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ శ్యామలరావు బదిలీ అయిపోయారు. శ్యామలరావును ఎపిహెచ్‌ఎంఐడిసి ఎం.డి.గా బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్యామలరావు స్థానంలో లౌవ్ అగర్వాల్‌ను నియమించింది. అలాగే జాయింట్ కలెక్టర్ పోలా భాస్కర్‌ను కూడా బదిలీ చేసింది. ఆయనను చీఫ్ రేషన్ ఆఫీసర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జివిఎంసికి పూర్తిస్థాయి కమిషనర్‌గా బి.రామాంజనేయులను నియమించింది. జివిఎంసి కమిషనర్‌గా పనిచేసిన వి.ఎన్.విష్ణును చాలారోజుల కిందట గుంటూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఇప్పటివరకూ ఎవరినీ నియమించలేదు. వుడా వైస్‌చైర్మన్ శశిథర్‌కు జివిఎంసి కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే జిల్లాలోని 15 మంది తహశీల్దార్లకు, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారితోపాటు, మరికొంతమంది డిప్యూటీ తహశీల్దార్లకూ బదిలీలయ్యాయి.
2009 జూన్ 15వ తేదీన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు అనేక వినూత్న కార్యక్రమాలు అమలు చేశారు. ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉండే విధంగా జీవనధార మందుల షాపులను నెలకొల్పారు. తక్కువ ధరకే మందులు అందజేసే ఈ విధానం రాష్ట్రంలోని అనేక జిల్లాలో అమలు చేయడానికి ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌లో ఇ-మస్తర్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఎన్‌ఆర్‌జిఎస్ పనుల్లో జిల్లా రాష్ట్రంలోనే అత్యున్నత స్థానంలో నిలిచింది. జిల్లా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కొత్తగా డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని శ్యామలరావు ప్రారంభించారు. ఆయన జిల్లాకు వచ్చిన కొత్తలో ఆకస్మిక తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. ముఖ్యంగా స్కూళ్లను తనిఖీ చేసి విధి నిర్వహణలో నిర్లక్షంగా ఉన్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది తహశీల్దార్లు, డాక్టర్ల పనితీరు సక్రమంగా లేకపోవడంతో వారిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. కెజిహెచ్‌కు నిధులు తీసుకురావడానికి శ్యామలరావు విశేష కృషి చేశారు.పరిపాలన ఈవిధంగా సాగుతున్న సమయంలో ఏజెన్సీలో చైనా క్లే తవ్వకాల కోసం భూ కేటాయింపు ఆయనకు తెలియకుండానే జరిగిపోయింది. ఇందుకు బాధ్యుడైన తహశీల్దార్‌పై చర్యకు శ్యామలరావు సిఫార్స్ చేశారు. ఇందుకు కలెక్టర్‌నే రాజకీయపక్షాలు బాధ్యునిగా చేశాయి.
ఇక శ్యామలరావుకు, మంత్రి బాలరాజుకు మధ్య కోల్డ్‌వార్ చాలాకాలంగా కొనసాగుతోంది. గత డిఆర్‌సిలో వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. శ్యామలరావు బదిలీకి మంత్రి బాలరాజు విస్తృతంగా ప్రయత్నించినట్టు పార్టీ వర్గాలే చెప్పుకుంటూ వచ్చాయి. శ్యామలరావును బదిలీ చేయడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సుముఖంగా లేరు. రాజకీయ ఒత్తిడులు పెరిగిపోవడంతో ఆయనను బదిలీ చేయక తప్పలేదు. గతంలో స్థానిక ఇపిడిసిఎల్ సి.ఎం.డి.గా బాధ్యతలు నిర్వహించిన లౌవ్ అగర్వాల్ ఇప్పుడు ఇదే జిల్లా కలెక్టర్‌గా రావడం ముదావహం.
జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న పోలా భాస్కర్‌ను చీఫ్ రేషన్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. ఆయన చాలాకాలంగా విశాఖ జిల్లాలో పనిచేస్తున్నారు. గతంలో జివిఎంసి అడిషనల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తరువాత ఐఎఎస్ కన్ఫర్మ్ అయింది. శిక్షణ పూర్తి చేసుకుని భాస్కర్ ఇదే జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా వచ్చారు. పోలా భాస్కర్ స్థానంలో గిరిజా శంకర్‌ను ప్రభుత్వం నియమించింది. గిరిజా శంకర్ గతంలో కడప జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. కొద్ది రోజులుగా ఆయన సెలవులో ఉన్నారు. గిరిజా శంకర్ గతంలో ఇదే జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు.
ఇదిలా ఉండగా జివిఎంసి కమిషనర్‌గా బి.రామాంజనేయులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయన గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. తరువాత ముస్సోరీకి శిక్షణ నిమిత్తం వెళ్లిపోయారు. శిక్షణలో ఉన్నప్పుడే స్కూళ్ళలో డ్రాపౌట్స్‌ను తగ్గించడానికి తీసుకోవలసిన చర్యలపై రామాంజనేయులు బృందం ఒక నివేదికను సమర్పించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అతనికి అవార్డును కూడా అందచేసింది.



No comments:

Post a Comment