Tuesday, June 7, 2011

కాంగ్రెస్‌ వ్యూహాత్మక నిర్ణయం – బొత్సకు పిసిసి పీఠం


కాంగ్రెస్‌ వ్యూహాత్మక నిర్ణయం – బొత్సకు పిసిసి పీఠం
ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) నూతన అధ్యక్షుడిగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణను కాంగ్రెస్‌ అధిష్టానం నియమించింది. దీంతో కొద్దికాలంగా పిసిసి అధ్యక్ష పదవిపై కొనసాగుతోన్న సస్సెన్స్‌కు తెరపడినట్లయ్యింది. సోమవారం ఢిల్లీలో నాటకీయంగా జరిగిన పరిణామాల అనంతరం బొత్స పేరును పార్టీ అధికారికంగా ప్రకటించింది. మధ్యాహ్నానికి అనూహ్యంగా ఢిల్లీ చేరుకున్న బొత్స సత్యనారాయణ నేరుగా గులాంనబీ ఆజాద్‌ నివాసానికి వెళ్లారు. ఆజాద్‌ పిలుపు మేరకే ఆయన రహస్యంగా ఢిల్లీకి చేరుకున్నారు. రెండు గంటల పాటు జరిగిన చర్చల అనంతరం సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో బొత్సను తీసుకుని ఆజాద్‌ సోనియా నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన అభ్యర్ధిత్వానికి సోనియా ఆమోద ముద్ర వేశారు. అనంతరం రాత్రి ఏడున్నర ప్రాంతంలో బొత్సను పిసిసి అధ్యక్షునిగా నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌ ద్వివేదీ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
వ్యూహాత్మక నిర్ణయం
ప్రత్యేక తెలంగాణా, వైఎస్‌ జగన్‌ తిరుగుబాటుతో, సామాజిక పొందికలు వంటి పలు అంశాలను లోతుగా బేరిజు వేసిన అనంతరమే కాంగ్రెస్‌ అధిష్టానం బొత్సను పిసిసి పదవికి ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి సీమాంధ్ర వ్యక్తి కాబట్టి, తెలంగాణా వ్యక్తికే పిసిసి పదవి లభిస్తుందని తొలుత అందరూ భావించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఇదే సంప్రదాయం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు డిఎస్‌ స్థానంలో మరో తెలంగాణా నేతనే నియమిస్తారని భావించారు. గత రెండు మూడు వారాలుగా పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణలో ఒకరికి పిసిసి పదవి ఖాయమన్న వార్లలు బలంగా వినిపించాయి. అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని చివరకు బొత్సవైపే పార్టీ మొగ్గు చూపింది. బొత్స (సీమాంధ్ర నేత) నియామకం వెనుక ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్‌ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. 1. తెలంగాణా ప్రాంత వ్యక్తిని పిసిసి అధ్యక్షునిగా నియమిస్తే, తెలంగాణాతో పాటు సీమాంధ్రలోనూ సదరు నేత క్రియాశీలంగా వ్యవహరించలేరని పార్టీ భావించింది. ప్రస్తుత అధ్యక్షుడు డిఎస్‌నే తీసుకుంటే…తెలంగాణా వాదులకు వ్యతిరేకంగా ఆయన నోరువిప్పలేని స్థితి. సీమాంధ్ర నేతలపై అధికారం చెలాయించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సీమాంధ్ర నేతైతే కనీసం ఒక ప్రాంతంపైనైనా పట్టు సాధించడం సాధ్యమౌతుందని పార్టీ భావించినట్లు చెబుతున్నారు. 2. వైఎస్‌ జగన్‌ తిరుగుబాటు నేపథ్యంలో రాష్ట్రంలో రెడ్డి సామాజిక తరగతి కాంగ్రెస్‌కు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని అధిష్టానం అంచనా వేసింది.
ప్రస్తుతం కొద్దిమంది నేతలే జగన్‌ శిబిరంలో చేరినప్పటికీ, ఎన్నికల సమయానికి కాంగ్రెస్‌లోని ప్రధానమైన రెడ్డి నేతలందరూ ఫిరాయించడం ఖాయమని భావించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మరో బలమైన సామాజిక తరగతైన కాపు తరగతిపై పార్టీ గాలం వేసింది. చిరంజీవి నేతృత్వంలోని పిఆర్పీని పార్టీలో విలీనం చేసుకోవడం వెనుక పార్టీ లక్ష్యమూ అదే. ప్రస్తుతం బొత్స నియామకం ద్వారా కాపులు మొత్తంగా బిసిలను పార్టీ పునాదివర్గంగా మార్చాలన్నది పార్టీ వ్యూహంగా భావిస్తున్నారు. 3. నాడు వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొత్స అన్ని విషయా ల్లోనూ ఎంతో క్రియాశీల పాత్ర పోషించారు. వైఎస్‌ అంతర్గత కోటరీలో సభ్యుడిగా అన్ని అంశాలపైనా ఆయనకు ఆకళింపు ఉంది. కింది స్థాయి నుండి వచ్చిన నేతగా కలుపుగోలుతనం, చొరవ, వ్యూహాత్మక వైఖరి ఆయనకు అదనపు బలాన్ని ఇచ్చాయి. కేశవరావు, హనుమంతరావు తదితర తెలంగాణా సీనియర్‌ నేతలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. తాను పదవి నుండి తప్పు కున్న తర్వాత ఒకానొక సమయంలో బొత్సకు పిసిసి పగ్గాలు ఇప్పించేందుకు కెకె కూడా ఢిల్లీలో లాబీయింగ్‌ చేశారు. ఈ పరిణామాలన్నీ ఆయనకు కలిసి వచ్చాయి. పిఆర్పీ అధినేత చిరంజీవి కూడా బొత్స అభ్యర్ధిత్వంవైపే మొగ్గు చూపడంతో అధి ష్టానం చివరకు ఆయన పేరునే ఖరారు చేసింది.
పార్టీ ఐక్యతే కర్తవ్యం సిఎంతో విభేదాల్లేవు : సత్యనారాయణ
రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు, తరగతుల నేతలను సమైక్యంగా మందుకు తీసుకెళ్లడమే తన ముందున్న కర్తవ్యమని పిసిసి నూతన అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని పేర్కొన్నారు. పిసిసి అధ్యక్షపదవికి పార్టీ అధిష్టానం తన పేరును ఖరారు చేసిన అనంతరం సోమవారం రాత్రి ఇక్కడి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో ఆయన మీడి యాతో మాట్లాడారు. ‘పార్టీలో మనస్పర్థలు, అభిప్రాయ బేధాలుండటం సహజం. పదవులు, అధికారం ముఖ్యం కాదన్న విషయం అందరికీ తెలుసు. ఆశించిన విధంగా పార్టీ ప్రజాసేవ చేయాలంటే అన్ని ప్రాంతాలు, తరగతుల నేతలు సమైక్యంగా, సమిష్టిగా పనిచేయాలి. అదే నా కర్తవ్యం’ అని ఈ సందర్భంగా బొత్స వ్యాఖ్యా నించారు. ప్రత్యేక తెలంగాణా అంశంపై గతంలో మంత్రిగా, ప్రస్తుతం పిసిసి అధ్యక్షునిగా తనది ఒకే అభిప్రాయమన్నారు. తెలంగాణాకు తాను అనుకూలం లేదా వ్యతిరేకం కాదని, అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌తో తనకు విభేధాలున్నాయన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పిసిసి అధ్యక్షునిగా తన పేరును ఖరారు చేసే ముందు పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డినీ సంప్రదించిందని తెలిపారు. ‘కిరణ్‌ సిఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రివర్గ కూర్పుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం వాస్తవమే. అన్ని ప్రాంతాలు, తరగతులకు సరైన ప్రాతినిధ్యం, ప్రాధాన్యత లభించలేదని నాడు నేను చెప్పాను. ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలన్నాను. దానర్ధం నాకు ముఖ్యమంత్రితో సఖ్యత లేదని కాదు’ అని ఈ సందర్భంగా అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పిసిసి అధ్యక్ష పదవి ఎంతో గురుతరమైన బాధ్యతని, సోనియా, ఆజాద్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని పార్టీ పెద్దలకు, ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు డిఎస్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. పిసిసి పదవి లభించిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేయబోనని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. ‘ఈ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని అమలు చేస్తాను. నా అంతట నేను రాజీనామా చేయాలని భావించడం లేదు’ అని ఈ అంశంపై బొత్స వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment