Thursday, June 16, 2011

తెలంగాణా డిమాండ్.. వాళ్లు వెళ్తుంటారు.. వీళ్లు అంటుంటారు


తెలంగాణా డిమాండ్.. వాళ్లు వెళ్తుంటారు.. వీళ్లు అంటుంటారు
ప్రత్యేక రాష్ట్రం కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టడం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు షరా మామూలైపోయింది. ఈ పర్యటనల్లో తెలంగాణపై త్వరగా ఏదో ఒకటి తేల్చాలని చెప్పి రావడం వారి వంతుగా మారింది. అలాగే, అధినాయకత్వం కూడా ఏదో ఒకటి చెప్పి పంపించడం మినహా మరోమాట చెప్పడం లేదు. 
ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా తెలంగాణా రాష్ట్ర సమితి ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉత్త చేతుల్తో వస్తే ఊరుకోమనీ, హైదరాబాదులో అడుగు పెట్టనీయమనీ, తెలంగాణాలో తిరగలేరనీ, పదవులకు రాజీనామా చేయకపోతే తెలంగాణాలో ఉండలేరనీ హెచ్చరించడం మామూలైపోయింది. 
ఈ పార్టీల వైఖరిని చూసి తెలంగాణా ప్రజలు విసుగెత్తిపోతున్నారు. తెలంగాణా సాధనకు అది చేస్తాం... ఇది చేస్తాం అంటూ కాలం గడపడం తప్పించి మూకుమ్మడిగా అన్ని పార్టీలు ఎందుకు రాజీనామాలు సమర్పించడం లేదని వారు నిలదీస్తున్నారు. తెలంగాణాకోసమే పుట్టామంటూ చెపుతున్న తెరాస ఒకవైపు..., తెలంగాణా సాధన కోసం పదవులను సైతం లెక్కచేయమని చెపుతూవస్తున్న తెదేపా మరోవైపు, రాష్ట్ర సాధన కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ప్రగల్భాలు పలికే కాంగ్రెస్ నేతలు ఇంకోవైపు.. ఎవరికి వారే చిలకపలుకులు పలుకుతున్నారని ప్రజలు అంటున్నారు. 
తెలుగుదేశం పార్టీ వ్యవహారాన్నే పరిశీలిస్తే... కర్ర విరగదు.. పాము చావదు... అన్నట్లుగా సాగుతోంది. తెలంగాణా అంటే.. అది కాంగ్రెస్ సరిచూడాల్సిన అంశం అంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారు. అంతేతప్ప కరాఖండిగా రాష్ట్ర విభజన జరగాల్సిందే అని పట్టుబట్టిన సందర్భం కనిపించడం లేదు. ఏదో ద్వితీయశ్రేణి నాయకత్వంతో రణభేరి వంటి సభలను ఏర్పాటు చేసినా తెరాస వంటి పార్టీలు వేస్తున్న ప్రశ్నలకు ధీటైన సమాధానం చెప్పలేకపోతోంది. 
మిగిలింది.. అధికార కాంగ్రెస్ పార్టీ. తెలంగాణాలోని నేతలకు ఢిల్లీ వెళ్లి రావడం తప్పించి తెలంగాణా విషయంలో సాధించింది ఏమీ లేదన్న వాదనలు వినబడుతున్నా... మన్నుదిన్న పాములా వ్యవహరిస్తోంది. సమస్యను నానబెడుతూ కాలమే పరిష్కారం చూపుతుందన్న ధోరణితో వేచి చూస్తున్నట్లుగా కనబడుతోంది. మరి తెలంగాణా విషయంలో కాలం ఏం సమాధానం చెపుతుందో మనం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితే. ఏం చేద్దాం... అంతే... పొలిట్రిక్స్ అంటే లాభనష్టాల ఫార్ములా సరిచూస్కోవాలి కదా. ఆ లెక్క సరిపోతే దేనికైనా రెడీ.. లేదంటే గింజుకున్నా నో డీల్. దిసీజ్ యాక్చువల్ సిట్యువేషన్.

No comments:

Post a Comment