Sunday, December 18, 2011

పాపం చిరంజీవి !!!


 చిరంజీవి రాజకీయ చరిత్ర సరికొత్తగా రికార్డు కాబోతున్నది. స్వయం కృషితో సినిమా రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి రికార్డు సృష్టించిన చిరు రాజకీయాల్లో మాత్రం అందుకు భిన్నమైన పేరుతో రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. సినీ రంగంలో వెలిగిపోయిన ఎన్టీఆర్ పార్టీ స్థాపించి రాజకీయంగా అధిక గుర్తింపు పొందినప్పటికీ ఆ స్థాయిలో చిరు ప్రయత్నం ఫలించలేదు. అనుభవ రాహిత్యంతో ముందస్తు షరతులేవీ లేకుండా అర్జంట్‌గా ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడినప్పటికీ ఇప్పటివరకు ఆయన సేవలను పార్టీ అధిష్ఠానం గుర్తించలేదు, కానీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ఆర్‌ఎల్‌డీ నేత అజిత్ సింగ్‌కు మాత్రం ఆగమేఘాలపై ఆదివారం నాడే కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటున్నారు. బయట నుంచే సపోర్టిస్తాం..అని కరాఖండిగా ముందే చెప్పి ఉంటే తమకు కొన్ని పదవులు దక్కేవని చిరు ఎమ్మెల్యేలు విశ్వసిస్తున్నారు. పైగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న సమయంలోనే సీఎంపైన మరింత ఒత్తిడి పెంచి ఉన్నా, తమకు ఈ దుస్థితి తప్పేదని వాపోతున్నారు. (సాంకేతికంగా ఈ ఎమ్మేల్యేలకు ఇంకా కాంగ్రెస్‌లోకి ప్రవేశం లభించలేదు- పైగా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్లుగా ఎన్నికల సంఘానికి ఇప్పటికే లేఖలు రాసి, ఏఐసీసీలో మాత్రం విలీన ప్రక్రియ పూర్తి అయినట్లుగా ప్రకటించారు.) శరద్ పవార్, తృణమాల్ కాంగ్రెస్ మాదిరిగా బయటి నుంచి మద్దతుగా ఉండి ఉంటే ఈ తిప్పలు తప్పేవనేది గొల్లుమంటున్నారు. కానీ పార్టీని మరింత కాలం నడపలేకనే చిరు తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి అతి తక్కువ కాలంలో పార్టీని నామరూపాలు లేకుండా చేసుకున్న సరికొత్త చరిత్రతో చిరు రికార్డులకెక్కడం కొసమెరుపు.

No comments:

Post a Comment