Friday, December 16, 2011

అటు ఇటు కాని దారిలో చిరంజీవి: అధిష్టానం ఎటు చేస్తుందో..?!!



ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదంటే అది చిరంజీవి చలవే. ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఆపద్బాంధవుడు చిరంజీవిని కాంగ్రెస్ ఇప్పుడు "యూజ్ అండ్ త్రో"లా చూస్తున్నట్లుంది. అవిశ్వాస తీర్మానంలో గట్టెక్కేశాం.. ఇక మరో 6 నెలలు వరకూ ఢోకాలేదు.... ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చూశారు అన్న చందంగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నట్టు ఉంది. చిరంజీవికి రాష్ట్రంలో ఓ కీలక పదవి కట్టబెడతారన్న వార్తలు ఊపందుకోగానే.. ఇక్కడి నేతలు వ్యూహాత్మకంగా చిరు స్టామినాకు రాష్ట్రస్థాయి పదవి సరిపోదనీ, కేంద్రస్థాయి నప్పుతుందని వ్యాఖ్యానించారు. సరే కేంద్రంలో చూస్తే అక్కడివారు వార్త అలా వచ్చిందో లేదో అడ్డుపుల్లలు తీసుకుని రెడీ అయిపోయినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. 
చిరంజీవికి కేంద్రంలో బెర్త్ ఇస్తే రాష్ట్ర వ్యవహారాలతో టచ్ పోతుందనీ, పైపెచ్చు ఆయనకంటే పార్టీలో ఇప్పటికే ఎంతోమంది సీనియర్లున్నారు కనుక వారిని కాదని చిరుకు పదవి ఎలా ఇస్తారని ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం. దీంతో చిరంజీవి అటు కేంద్రానికి కాక ఇటు రాష్ట్రానికి కాకుండా రెంటికీ చెడ్డ రేవడిలా మారిపోయినట్లున్నారు. 
ఐతే చిరంజీవి ఆశలన్నీ అధిష్టానంపైనే పెట్టుకున్నారు. సోనియా గాంధీ ఎలా అంటే.. అలానే నడుచుకుంటామని ఆది నుంచీ చెపుతూ వస్తున్నారు. పదవుల విషయంలో ఎన్ని వార్తలు తిరుగాడుతున్నా.. ఆయన మాత్రం పెదవి విప్పడంలేదు. పార్టీలో తన స్థానం ఏమిటో మేడంకు తెలుసుననీ, ఆ ప్రకారం వారు నిర్ణయం తీసుకుంటారని చెపుతున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహించడమే తన పని అని చెపుతున్నారు. ఏం జరుగుతుందో చూడాల్సిందే.

No comments:

Post a Comment