Tuesday, December 13, 2011

ఇంటర్నెట్ హద్దుల్లో ఉండాల్సిందేనా?!


ఒకరికొకరు రాసుకునే ఉత్తరాలను- తోక లేని పిట్ట తొంభై ఆమడలు ప్రయాణిస్తుందంటారు. ఇది గతం. ఇప్పుడు ఇంటర్నెట్, ఈమెయిల్స్ దే రాజ్యం. ఈ నెట్ పిట్ట తొంభై కాదు కదా... ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలూ క్షణాల్లో చుట్టి వస్తుంది. జస్ట్ క్లిక్ మనిపిస్తే చాలు. చక చక పరుగులు పెడుతుంది. ఫేస్ బుక్, ట్విట్టర్, గుగుల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ... నెటిజనుల అభిలాషమేరకు.. అంతర్జాల సంచలనాలు. ఇతర ఎన్నో వెబ్ సైట్లు. ఎవరికి వాళ్లు దున్నిపడేస్తున్నారు. ఉన్నవీ లేనివీ కుమ్మరించి పారేస్తున్నారు. ఒక్కోసారి ఆ పైత్యానికో విచక్షణ వుండదు కదా అనిపిస్తుంది. అంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఎంత అడిగే వారు లేకున్నా.. అంత బరితెగింపా? అని ఆశ్చర్యపోతున్నారు సామాన్యులు.
నెట్... దృశ్య ప్రాధాన్య కామధేనువు. కంటి ముందు ఎన్నో కమనీయదృశ్యాలు. వాటితో పాటు మరెన్నో కఠినమైన విషయాలు. అంతుచిక్కని రహస్యాలు. అనుకోని గందరగోళాలు. తెలిసినవీ తెలియనివీ అనేకానేక మతలబులు. నెట్ కు అడిక్ట్ అయితే చాలు- అంతే సంగతులు. ఒక పద్ధతి పాడు ఉండదు. అవసరమైనంత సమాచారం వరకైతే పరవాలేదు. అనవసర సమాచారం అనవసరంగా పోగవుతోంది. వద్దన్నా వదలని దృశ్యాలు.. ఇతర సమాచారాలు. విసిగి వేసారేలా చేస్తున్నాయి. అందుకు ఎన్నో ఉదాహరణలు. 


సెల్ఫ్ డిసిప్లిన్ లేక పోవడంతో, సెల్ఫ్ ఎడిట్ అంతకన్నా లేక పోవడంతో... వెబ్ సైట్లలో అసందర్భ సమాచారం, అనవసరంగా పేరుకుపోతోంది. కాస్త సరదాగా అన్నట్టు మొదలైన ఈ విధానం.. ఇప్పుడో వరదగా మారింది. అనవసర దురదగా తయారైంది. ఎంత దారుణం అంటే, ఎవరికైనా కాస్త ఇమేజీ వుంటే దాన్ని డామేజీ చేయడానికి వెనకాడ్డం లేదు. అడ్డగోలుగా రాయడం, మార్ఫింగ్ వంటి నీచ విధానాల ద్వారా వారి ముఖచిత్రాలను అసహ్యంగా తయారు చేయడం- వంటి వాటితో చేయాల్సినదంతా చేస్తున్నారు. బాలకృష్ణ, చిరంజీవి వంటి అగ్ర నటులకే తప్పడంలేదీ తిప్పలు. 
ఐ హేట్ బాలయ్య డాట్ కామ్ వంటి వివాదాలు తెలిసిందే. బాలకృష్ణ వంటి మాస్ హీరోలను ఎన్ని రకాలుగా అవమాన పరచాలో అన్ని రకాలుగా అవమాన పరచారు. ఆయన ఈ సైట్ నిర్వాహకుల వివరాలేమిటో తెలుసుకోమని కోరుతూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికొచ్చిందీ వ్యవహారం. 
ఇటీవల వెలుగులోకి వచ్చిన గ్రేటాంధ్రా డాట్ కామ్ వ్యవహారం గురించైతే చెప్పనే అక్కర్లేదు. ఒక పద్ధతి ప్రకారం నటులు ఇతర రాజకీయనాయకుల మీద కావాలని సంచలన వార్తలను రాస్తూ పట్టుపడిన విధం తెలిసిందే. తమ తమ వెబ్ సైట్ల హిట్లను పెంచుకోవడంలో భాగంగా కొందరిని పనిగట్టుకుని అవమానపరచడమనే నీచానికి దిగజారిందీ వెబ్ సైటు. దానికి తోడు కొందరి మీద ప్రత్యేకాభిమానం- మరి కొందరి మీద దురభిమానం దృష్టిలో పెట్టుకుని పాడు వార్తలు వండి వర్చాడంలో దిట్టగా పేరుంది ఈ వెబ్ సైట్ నిర్వాహకుడికి. దీంతో గ్రేటాంధ్రా డాట్ కామ్ నిర్వాహకుడు వెంకట రెడ్డిని పోలీసులు అరెస్టు చేసారు కూడా. ఇదేనా పద్ధతి? అని అడిగేవారు లేకపోవడంతో ఇలాంటి సైట్ల నిర్వాహకులకు ఒక అడ్డు అదుపూ లేకపోతోంది. 
ఇలాంటివెన్నో విషయాలు. ప్రాంతీయ విభేదాలు రెచ్చుగొట్టడాలు. దారుణమైన బూతు రాతలు. ఆడ-మగ విచక్షణ కోల్పోతూ.. అసభ్యకరమైన దృశ్యాలను తయారు చేయడాలు.  వాటి ద్వారా సంచలనం సృష్టించాలనే నీచమైన పద్ధతులు.. ఇప్పుడో ఫ్యాషనైపోయింది.  అంతెందుకు.. నిన్న మొన్న చిరంజీవి కాబోయే కోడలు ఉపాసన మీద కూడా నెట్లో ఇలాంటి దారుణాలకే ఒడిగట్టారు కొందరు. స్వీయ నియంత్రణతో తప్ప మరే విధంగానూ అడ్డుకట్ట వేయలేం అన్నట్టుగా తయారైంది. అది తెలుసుకోకుంటే భవిష్యత్తు మరింత దారుణంగా తగలబడేట్టుంది చూస్తుంటే.

No comments:

Post a Comment