Wednesday, December 14, 2011

పదవుల కోసం విలీనం కాలేదు


విశాఖపట్నం ; పి.ఆర్.పి. మేనిఫెస్టోను తూచ తప్పకుండా అమలుచేసే ప్రయత్నంలో వ్యవస్థాపకుడు చిరంజీవి నిమగ్నమై ఉన్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనుటకు డిసెంబర్ 12 సోమవారం ఇక్కడకి వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సామాజిక న్యాయం కొరవడిందని ఆవేదనతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి 104 మంది బి.సి.లకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన విషయం తెలిసిందేనన్నారు. అనుభవ రాహిత్యం వలన అధికారంలోకి రాలేకపోయినప్పటికీ తాను ఆశించిన ఆశయాల సాధనకు విశాల భావాలు కలిగిన అంతర్గత స్వాంతత్య్రమున్న కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరిగిందన్నారు. కేవలం పదవుల కోసం విలీనం అయ్యామన్న ఆరోపణలు అర్ధరహితమన్నారు.
ఎటువంటి షరతులు లేకుండా ఆనాడు విలీనానికి చిరంజీవి అంగీకరించడం జరిగిందన్నారు. ఇప్పుడిప్పుడే తన ఆశయాలను, ప్రజలుకు ఇచ్చిన హామీలను జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పి.సి.సి. అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణల దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. చిరంజీవి సూచనను కాంగ్రెస్ పార్టీ తూచ తప్పకుండా ఆవిష్కరించడానికి సుముఖంగా ఉందని గంటా పేర్కొన్నారు. మరొకవైపు వేర్పాటు వాదంతో రాష్ట్రం అట్టుడికి పోతున్న సమయంలో టి.డి.పి, అర్ధం లేని డిమాండ్‌తో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందన్నారు. రైతు సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, కిరణ్ ప్రభుత్వం మాదిరి దేశంలో మేర ఏ ప్రభుత్వం రైతులకు మేలు చేయలేదని ఛాలెంజ్ చేసారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చిన మాట మేరకు అవిశ్వాసానికి వ్యతిరేకంగా 17 మంది పి.ఆర్.పి. ఎమ్మెల్యేలు ఓటు వేయడం జరిగిందన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా మారనున్నారని జోస్యం చెప్పారు. ఈకార్యక్రమంలో పినపోలు వెంకటేశ్వరరావు, పతివాడ చిన్నంనాయుడు, కంచిపాటి జగన్నాధరావు, గుమ్ముడు సత్యదేవ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment