Wednesday, December 14, 2011

చిరంజీవి పెట్టిన కొత్త డిమాండ్‌తో గందరగోళ పరిస్థితి నెలకొంది.


 కాంగ్రెస్‌ పార్టీకి కొత్త చిక్కులు మొదలయ్యాయి. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో కాంగ్రెస్‌ మరింత బలోపేతమయిం దని భావిస్తున్న తరుణంలో చిరంజీవి పెట్టిన సరికొత్త డిమాండ్‌తో జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో వణుకు మొదలయింది. చిరంజీవికి జాతీయ స్థాయిలో ప్రాధా న్యత కల్గిన పాత్ర వుంటుందని ఇప్పటికే ఆ పార్టీ అధిష్ఠానం ఆయన కు హామీ ఇచ్చింది. ఈ మేరకు త్వరలోనే ఆయనకు కేంద్ర కేబినెట్‌లో స్థానం కల్పించ వచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. దానికి బలా న్నిస్తూ చిరంజీవి ఇటీవల అధినేత్రి సోనియా గాంధీతో కూడా భేటీ అయి పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానని ఆమె ముందు వాగ్దానం చేశారు. 
ఇందుకు ప్రతిఫలంగా విలీనం ప్రక్రియ పూర్తి కాగానే ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామంటూ అధిష్ఠానంలోని నాయకులు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిరు తన రాజకీయ చతురతను ప్రదర్శిం చారు. తాను కేంద్రంలో ఏ పదవులు కోరుకోవడం లేదని, రాష్ట్రంలోనే ప్రజలకు అందుబాటులో వుంటూ సేవ చేయాలని భావిస్తున్నట్లు బాంబు పేల్చారు. తనకు రాష్ట్ర హోంశాఖ మంత్రి పదవి కావాలని నెమ్మదిగా మనసులో మాట బయట పెట్టినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్‌ వర్గాలలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ్రపజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత తనను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆదరించారని, అక్కడే వుండి తన ప్రజలకు సేవలందించాలని భావిస్తున్నట్లు ఆయన తన మనసులో మాట బయటకు చెప్పడంలో అంతరార్థం వేరే వుందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన పావులు కదుపుతున్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 
ఏ రాజకీయ అనుభవం లేని చిరంజీవి ఈ స్థాయిలో మెలిక పెడతారన్నది ఊహించని పరిణామమేనని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లు సైతం అవాక్కవుతున్నారు. చిరంజీవి తొలిసారిగా రాజకీయ చదరంగంలో ఎత్తుకు పై ఎత్తులు వేయడం ప్రారంభించారని ఆందోళన పడుతున్నారు. ఆయన తన 16 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని గట్టెక్కించడం శుభపరిణామమే అయినా ఆయన కోరికలో నిగూఢ రాజకీయ చతురత కనపడుతున్నదని బెంబేలెత్తుతున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రెండు రోజులుగా ఢిల్లీలొ మకాం వేసి చిరంజీవి వింత పోకడపై సమీక్షలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. మంగళవారం పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో ఎంపీలు వుండవల్లి అరుణ్‌ కుమార్‌, కేవీపీ రామచంద్రరావు తదితర ఎంపీలతో బొత్స కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తున్నది. బుధవారం ఉదయం బొత్స రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో సమావేశమై ఈ పరిణామంపై చర్చించే అవకాశం వుంది.

                                                                                            .......మేజర్‌న్యూస్‌

No comments:

Post a Comment