Thursday, April 28, 2011

భగవాన్ సత్యసాయి మహా శకం ముగిసింది!!!

భగవాన్ సత్యసాయి మహా శకం ముగిసింది!!!


ముగిసిన సాయి శకం
పుట్టపర్తి, 86 సంవత్సరాల సాయి సేవా ప్రస్థానం... అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా... ప్రేమ-సేవ మూడో కన్నుగా సాగిన సాయి తత్పరత... దేశ విదేశాల్లో కోట్లాది మంది భక్తుల పారవశ్యం... బాబా ప్రతి అడుగులో అడుగు వేసిన భక్తజనం... అందరినీ ఆవేదనలో ముంచెత్తుతూ చివరి క్షణాల్లో అనారోగ్యంతో ఆసుపత్రిపాలు... గత నెల రోజులుగా భక్తుల వేదన... చివరకు సాయి మహాభినిష్క్రమణం.’ ఇలా కొనసాగిన భగవాన్ సత్యసాయి మహా శకం ముగిసింది. బుధవారం ఉదయం సాయి మహా సమాధిలోకి వెళ్లిపోవడంతో భౌతికంగా ఇక ఆయన్ను ఎవరూ సందర్శించలేని పరిస్థితి. అయితే అందరి మదిలోనూ ఆయన ఉన్నారంటూ తమ వేదనలోనూ మనో నిబ్బరాన్ని ప్రదర్శిస్తున్న భక్తులు. మళ్లీ సాయి జన్మిస్తారన్న నమ్మకంతో భక్తులు ఉన్నారు.









1926 నవంబర్ 23న జన్మించిన సత్యసాయి ప్రారంభంలో ఎవరికీ తెలియకపోయినప్పటికీ షిర్డీసాయి అవతారంగా సత్యసాయి ప్రకటించుకోవడంతోనే ప్రపంచంలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. కేవలం భక్తికే కాకుండా సేవాధర్మానికి కూడా పెద్దపీట వేసిన సాయికి అనంతకోటిగా భక్తులు ఆకర్షితులయ్యారు. నలుగురికీ ప్రేమ పంచడం మానవ ధర్మంగా సాయి ఎప్పుడూ చేసే ఉపదేశాలు లక్షలాది మంది భక్తులను సమకూర్చాయి. ఇదే సమయంలో సేవా కార్యక్రమాలపై సాయి చేసిన ప్రయత్నాలు, సాటి మానవుడిని ఆదుకునేందుకు నిర్వహించిన అనేక కార్యక్రమాలు కూడా భక్తకోటిని తయారుచేశాయి. దీంతో చిన్న పల్లెగా ఉన్న పుట్టపర్తి ‘ప్రశాంతి’నిలయంగా మారి పెద్ద పట్టణంగా మారిపోయింది. దేశ విదేశాల సంస్కృతికి ప్రశాంతి నిలయం ఆలవాలంగా మారిపోయింది. ఎప్పుడు చూసినా వేల సంఖ్యలో భక్తులతో కళకళలాడుతూనే కనిపించేది. సాయి చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులైన దేశ విదేశీ భక్తులు వేల కోట్ల రూపాయలను విరాళాలుగా గుమ్మరించడంతో సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
వచ్చే నిధులను వివిధ అభివృద్ధి రంగాలకు కేటాయిస్తూ సంక్షేమాన్ని పరుగులు తీయించడంలో బాబా కఠోరంగా శ్రమించారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడడంతోపాటు, భక్తిని పెంచడంలో సత్యసాయి ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు. ఇందులో భాగంగానే విద్య, వైద్యం, తాగునీరు, క్రీడలు, ఆలయాలు, మందిరాల నిర్మాణం, ప్రజల్లో భక్త్భివాన్ని పెంపొందించడం వంటి చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎడారి సీమను సస్యశ్యామలం చేసేందుకు బాబా చేసిన ప్రయత్నాలు ఇప్పటికీ, ఎప్పటికీ అనంతపురం జిల్లా వాసుల మదిలో చిరస్థాయిగానే నిలిచిపోతాయనడంలో సందేహం లేదు. ఇక అత్యుత్తమ విద్య, ప్రపంచ దేశాలకే తలమానికంగా ఉండేలా రూపొందించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వంద రోజుల్లోనే రికార్డు స్థాయిలో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన క్రీడా ప్రాంగణం సాయి శకంలో కీలక అంశాలుగానే మిగిలిపోతాయి. భక్తితోపాటు ప్రజల జీనవ విధానంలో కూడా మార్పులు రావాలని ఎప్పుడూ కోరుకునే బాబా కొంతవరకు అనుకున్న మార్పులు తీసుకురాగలిగారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది కోట్ల మంది భక్తులు సాయి మార్గంలో నడిచేందుకు ముందుకు వస్తున్నారంటేనే సాయి సాధించిన విజయం అవగతమవుతుంది. బాబా భౌతకంగా లేకపోయినా పుట్టపర్తి మాత్రం భక్తులకు ఎప్పుడూ ఆలవాలంగానే మిగిలిపోతుందని, భవిష్యత్తులో మరో షిర్డీగా వర్ధిల్లుతుందని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వారి భావనల మాదిరిగానే పుట్టపర్తి ప్రశాంతి నిలయం రానున్న కాలంలో మరో ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా భాసిల్లే అవకాశాలు పుష్కలంగా కలిపిస్తున్నాయి. సాయి శకం ముగిసినా ఆయన జనం హృదయాల్లో మాత్రం చిరస్థాయిగానే వర్ధిల్లుతారు.

No comments:

Post a Comment