Sunday, April 10, 2011




ఇది ఆరంభమే!
అవినీతిపై యుద్ధంలో రాజీ లేదు
ప్రజా చైతన్యానికి దేశ యాత్ర
ప్రజాగ్రహానికి మద్దతు మచ్చుతునక
యువత, ప్రజలకు హజారే పిలుపు

:అధికార్లు, ప్రజాప్రతినిధుల్లో పెచ్చుమీరుతోన్న అవినీతిపై ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలకు మచ్చుతునక తాను చేపట్టిన ఆమరణ నిరశనకు లభించిన మద్దతని గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హజారే వ్యాఖ్యానించారు. అవినీతిని అంతం చేసే విషయంలో రాజీ పడకూడదన్న ప్రజా మనోభావాలకు ఇదొక సంకేతంగా ఆయన అభివర్ణించారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా చేపట్టిన ఆమరణ నిరశనతో దిగివచ్చిన ప్రభుత్వం, జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రతిపాదనకు ఆమోదించటంతో శనివారం ఉదయం ఆయన దీక్ష విరమించారు. అనంతరం జంతర్ మంతర్ వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.అవినీతి జాడ్యాన్ని ఏరిపారేసేంత వరకూ ప్రజలు విశ్రమించకూడదని పిలుపునిస్తూ, లంచాలు అడిగిన వారిని ఉపేక్షించవద్దని హెచ్చరించారు. జన్‌లోక్‌పాల్ బిల్లు చట్టం కానున్నందున తన బాధ్యత మరింత పెరిగిందని ఆయన హామీ ఇచ్చారు. తన దీక్షకు లభించిన ప్రజామద్దతే ప్రభుత్వం కళ్లు తెరిపించిందని చెప్పుకున్నారు. అధికార్లు, ప్రజాప్రతినిధుల్లో పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్ట వేయనిపక్షంలో, ప్రజా జీవితాలు మరింత దుర్భరం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మనలో మనకు ఎన్ని అభిప్రాయబేధాలు ఉన్నప్పటికీ, అవినీతిని తుడిచిపెట్టే విషయంలో దేశంలో సమైక్యరాగం వినిపించిందని చెప్పారు. ‘్భన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత. అవినీతిపై ప్రజలు విసుగెత్తిపోయారు. ప్రజల ఆవేదనను గ్రహించి ప్రభుత్వం అవినీతిని అదుపుచేయటానికి ఎలాంటి చర్యలూ తీసుకోక పోవటంవల్లే, అవినీతి ఊడలు మరింత లోతుకు పాతుకుపోయాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకురానున్న చట్టం అవినీతికి భరత వాఖ్యం పలికి తీరుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అవినీతిపై ప్రారంభించిన ఈ యుద్ధానికి కులం మతం ప్రాంతంతో పనిలేదన్నారు. అవినీతి అంతమయ్యేంత వరకూ విశ్రమించరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను ప్రారంభించిన దీక్షకు వివిధ వర్గాలు, ముఖ్యంగా యువతనుంచి లభించిన మద్దతుకు ప్రభుత్వం గడగడలాడిందని అన్నా హజారే ఆనందంగా చెప్పారు. అవినీతిని రూపుమాపటంలో యువత కీలకపాత్ర వహించాలని హజారే సూచించారు. జన్‌లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను తయారు చేయటానికి ఒక కమిటీని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం అంగీకరించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాలేదని, అసలు పోరాటం ఇక్కడి నుంచే మొదలవుతుందని గుర్తు చేశారు. లక్ష్య సాధనలో మనం ఇంకా చాలా దూరాన్ని అధిగమించాల్సి ఉందని హజారే చెప్పుకొచ్చారు. బిల్లును వ్యతిరేకించే రాజకీయ నాయకులకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు దేశంలో పర్యటించి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తానని హామీ ఇచ్చారు.
దీక్ష విరమించిన హజారే
ఫలితాన్నిచ్చిన ఆమరణ నిరశన జన్‌లోక్‌పాల్ ముసాయిదా కమిటీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ మద్దతుదారుల్లో పెల్లుబికిన ఆనందం
 హజారే సత్యాగ్రహం అంతిమ విజయం సాధించింది. స్వతంత్ర భారత చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అవినీతికి వ్యతిరేకంగా సాగించిన అహింసాయుత యుద్ధంలో విజయం సాధించిన అన్నా హజారే, ఈతరానికి స్ఫూర్తిగా నిలిచారు. జాతిపిత త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించిన అహింసా మార్గంలో 97గంటల నిరాహార దీక్ష సాగించి ప్రభుత్వం మెడలు వంచిన హజారే, అవినీతికి వ్యతిరేకంగా పోరాడగల ఆత్మవిశ్వాసాన్ని బలమైన ఆయుధంగా ప్రజలకు అందించారు. నాలుగు దశాబ్దాల కాలంలో ఎవ్వరూ సాధించలేకపోయిన విజయాన్ని ప్రజా మద్దతుతో సాధించి, ప్రజాబలంతో ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలమని నిరూపించారు. చీడపురుగు మాదిరి దేశాన్ని పట్టి పీడీస్తున్న అవినీతికి వ్యతిరేకంగా గాంధేయవాది అన్నాహజారే ప్రారంభించిన ఆమరణ దీక్షకు ప్రజల నుంచి లభించిన స్పందన, కేంద్ర ప్రభుత్వాన్ని తట్టి లేపింది. అవినీతిని రూపుమాపే విషయంలో తమ చిత్తశుద్ధి శంకించవద్దన్న సంకేతాన్ని పంపుతూ కేంద్రం అన్నాహజారే చేసిన ప్రతిపాదనలకు లోబడి లోక్‌జన్‌పాల్ బిల్లు ముసాయిదా తయారీకి అంగీకరించటంతో అన్నా హజారే, ఆయన మద్దతుదారులు సుమారు 97 గంటలపాటు నిర్వహించిన ఆమరణ దీక్షకు తెరపడింది. శనివారం ఉదయం పది గంటల సమయంలో అన్నా హజారే, ముందు తన సహచరులతో దీక్ష విరమింప చేశారు.తరువాత ఒక చిన్న పాప అందించిన నిమ్మరసం తీసుకుని దీక్షకు స్వస్థి చెప్పారు. ఆయన దీక్ష విరమించగానే జంతర్ మంతర్ వద్ద పండుగ వాతావరణం కనిపించింది. అంతేగాక ఇకనుంచి అధికారులకు లంచం ఇవ్వకుండానే పనులు చేయించుకోగలమన్న ఆత్మవిశ్వాసం తోణికిసలాడిందని చెప్పక తప్పదు. 40 ఏళ్లనుంచీ అతీగతీ లేకుండా పడివున్న లోక్‌పాల్ బిల్లు జన్‌లోక్‌పాల్ బిల్లుగా రూపాంతరం కాబోతోంది. జన్‌లోక్‌పాల్ బిల్లుకు బలమైన అధికారాలను ఆపాదిస్తూ, పటిష్టంగా రూపకల్పన చేయటానికి పదిమంది సభ్యులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయటానికి కేంద్రం అంగీకరించింది. ఈమేరకు కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్నాహాజారే డిమాండ్ చేసినట్టు కమిటీలోని పదిమందిలో ఐదుగురు పౌర సమాజం నుంచి ఉంటారు. ఐదుగురు మంత్రులు కమిటీలో భాగస్వాములు అవుతారు. కేంద్ర ఆర్దిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ సంఘానికి అధ్యక్షులుగా ఉంటారు. కాగా మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్ సహాధ్యక్షులుగా ఉంటారు. న్యాయశాఖా మంత్రి వీరప్ప మొయిలీ, హోంమంత్రి పి చిదంబరం, జలవనరుల మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌తో పాటు హజారేతో దీక్ష విరమింప చేయటంలో కీలకపాత్ర వహించిన మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి కపిల్ సిబల్ ప్రభుత్వం తరఫున సంఘంలోఉంటారు. పౌర సమాజం పక్షాన శాంతి భూషణ్‌తోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ప్రశాంత్ భూషణ్, ఎన్ సంతోష్ హేగ్డే, అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ న్యాయ శాఖ కార్యదర్శి వికె భాషన్ సంతకంతో శనివారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ కమిటీ జూన్ నెలాఖరుకు తన ముసాయిదాను ప్రభుత్వానికి అంద చేయాల్సి ఉంటుంది. ముసాయిదాను అధ్యయనం చేసిన తరువాత ప్రభుత్వం బిల్లును వర్షాకాలపు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.



No comments:

Post a Comment