Tuesday, August 7, 2012

స్వాతంత్రదినోత్సవం - మన బాధ్యత


స్వాతంత్రదినోత్సవం - మన బాధ్యత


ఈ రోజు స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక సెలవు దినంగా తప్ప పెద్ద ప్రాముఖ్యత లేకుండా పోయింది, ముఖ్యంగా ఈ కాలం పిల్లలకు. నిజానికి మనం జరుపుకునే పండగలన్నిటిలోనూ అగ్రస్థానం ఆక్రమించగల అర్హత ఉన్న పండగ ఇది. మన ముందు తరానికి తెలిసినంతగా స్వాతంత్రం విలువ, స్వాతంత్రదినోత్సవ గొప్పదనం ఈ తరానికి తెలియదేమో!

ఆగస్టు పదిహేను అనంగానే మూడే పండగలు గుర్తుకు వస్తాయి అవి...

1. స్వాతంత్ర దినోత్సవం
2. గాంధీ జయంతి
3. రమణ మహర్షి పుట్టినరోజు

స్కూల్లో జండా వందనం కాగానే గ్రామాల్లోకి పరిగెత్తేవాళ్ళం, అప్పట్లోచొక్కాలకు పెట్టుకునేందుకు చిన్న పరిమాణంలో గుడ్డతో చేసిన జెండాలు అమ్మేవారు. ఇప్పుడు కూడా కాగితముల తో చేసినవి అమ్ముతున్నారు. మేము అప్పట్లో మా ఇళ్ళకుకు వెళ్ళంగానే మా చొక్కాలకు జండాలు ఉన్నాయో లేవో చూసి లేకపోతే కొనుక్కురమ్మని డబ్బిచ్చి పంపేవారు. జండా పెట్టుకుని వచ్చేదాకా వేరే మాట మాట్లాడనిచ్చేవారు కాదు. తర్వాత స్వాతంత్రం అంటే ఏంటో, అది సాధించడానికి మన వాళ్ళు పడ్డ కష్టలేంటో వివరించి చెప్పి, మేము శ్రద్దగా విన్నామో లేదో ప్రశ్నలేసినిర్ధారించుకుని మరీ చాక్లెట్స్ పెట్టేవారు. ముందు తరానికి  గాంథీ గారంటే ఎంత అభిమానమో! 

'ఏం చేసినా చెయ్యకపోయినా స్వాతంత్ర దినోత్సవం నాడు జండా వందనానికి హాజరయ్యి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుని,జనగణమణ పాడుకోవడం మన కనీస విధి, అంటే నానా అడ్డమైన పనులూ చేసేసి జనగణమణ పాడెయ్యమని కాదు,మంచిగా ఉంటూ మనకు వీలైనంతలో పక్కవాడికి సాయం చేస్తూనే మనమిలా స్వతంత్రంగా ఉండడానికి అవకాశం కల్పించిన మహానుభావుల గురించి తల్చుకోవాలి ' అని చెప్పేవారు.

ఇప్పటి పిల్లలకు బాల గంగాధర్ తిలక్ ఎవరో తెలియదు, లాల్ బహుదూర్ శాస్త్రి కూడా తెలియదు, అదే రాం చరణ్ తేజ గురించో, అరుంధతి సినిమా గురించో అడిగితే ఠక్కున చెప్తారు. ఇది మనం నిజంగా సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం. తల్లిదండ్రులందరూ ఈ విషయంలో బాధ్యత తీసుకుని పిల్లలకు మన స్వాతంత్ర సమరయోధుల గురించి చిన్న చిన్న ఉదాహరణలతో చెప్పి వాళ్ళ మనసుల్లో నాటుకుంటునేలా చెయ్యాలి. తద్వారా వాళ్ళను తలుచుకున్నవారౌతాము, అలాగే మన పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో కూడా అది తోడ్పడుతుంది.

లాల్ బహుదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రి గా పని చేసే రోజుల్లో తమిళనాడు లో ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసారు. అది ఆయనకు వృత్తి పట్ల ఉన్న బాధ్యత. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ గారు కోర్టులో కేసు వాదిస్తూ ఉండగా భార్య చనిపోయిందని టెలిగ్రాం వస్తే చదువుకుని జేబులో పెట్టుకుని వాదన పూర్తి చేసారు. అది ఆయనకు వృత్తి పట్ల ఉన్న నిబద్దత, అది ఆయన గుండె నిబ్బరం. అందుకే ఆయనను ఉక్కు మనిషి అయ్యారు. మన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ధైర్యముంటే తుపాకి పేల్చమని తెల్లవాడికి గుండె చూపించారు. అది ఆయన ధైర్యం. ఇలా ఎన్నో స్పూర్తిదాయకమైన సంఘటనలున్నాయి మన దేశభక్తుల జీవితాల్లో. ఇవి మనందరికీ తెల్సిన విషయాలే. కాస్త శ్రద్ద చూపించి పిల్లలకు స్పూర్తి కలిగించేలా ఆ మహనీయుల జీవితాల్లోంచి విశెషాలు చెప్పే బాధ్యత సంతోషంగా తీసుకుందాం.

..............................................................................................జైహింద్!

No comments:

Post a Comment