Sunday, August 26, 2012

ఎస్సీ, ఎస్టీ నిధుల్లో కోత పెట్టబోమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి


స్సీ, ఎస్టీ నిధుల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ కోత పెట్టబోమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.  సబ్ ప్లాన్ నివేదికను రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయంగా అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీలకు సేవ చేసేది కాంగ్రెస్ పార్టీయేనన్న సిఎం క్షేత్రస్థాయిలో పనులు జరగాలంటే నిఘా తప్పని సరన్నారు.  ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రి వర్గం ఉప సంఘం ఇవాళ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నివేదిక సమర్పించింది. 

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేసేందుకు సమగ్ర చట్టం చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఉప ప్రణాళిక నిధుల వినియోగంపై అధ్యయనానికి ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కేబినెట్ సబ్  కమిటీ భేటీ అయ్యింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్  అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎంతో చర్చించింది. 

అటు సబ్  ప్లాన్  నివేదికను రాష్ట్ర చరిత్రలోనై ఓ మైలురాయిగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. ఇప్పటి వరకు వీటిని సక్రమంగా ఖర్చు చేయని మాట వాస్తవేమేనని అంగీకరించారు. ఉప సంఘం అందించిన నివేదికను మంత్రివర్గంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు.  ఇక ముందు ఎస్సీ, ఎస్టీ నిధుల్లో కోత ఉండబోదని ప్రకటించారు. మరోవైపు జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ్మ విజ్ఞప్తి చేశారు. నివేదిక కోసం రాష్ట్రవ్యాప్తంగా అనేక వర్క్ షాపులు నిర్వహించి క్షేత్రస్ఖాయిలో ఎస్సీ, ఎస్టీల సమస్యలు తెలుసుకున్నామని చెప్పారు. నిధులు దుర్వినియోగం కాకుండా భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత సబ్  ప్లాన్  నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. 

No comments:

Post a Comment