Sunday, August 19, 2012

గ్రేటర్’ విలీనంపై దుమారం


గర శివార్లలోని 34 గ్రామ పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడంపై మరోమారు అగ్గి రాజుకుంది. దీనికి కారణం కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రేటర్ విస్తరణ ఫైలుకు రెక్కలు రావడమే. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి మరలా ఈ ప్రక్రియకు తెరలేపడంపై (రంగాడ్డిజిల్లా) జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ప్రజల జీవితాలు, మనోభావాలతో ముడిపడి ఉన్న గ్రామాల విలీనంపై తొందరపాటు చర్యలు పనికిరావని స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి కావాలంటే ముందుగా శివారు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు శివారు గ్రామాల ప్రజల నుంచి ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం అభివృద్ధితో ముడిపెట్టి గ్రామీణ వాతావరణంతో పాటు భిన్న సామాజిక పరిస్థితులు, సెంటిమెంట్లు ఉన్న ప్రజలను జీహెచ్‌ఎంసీలో కలపడం దారునమన్న వాదనలు  బలంగా వినిపిస్తున్నాయి. 

మరోవైపు పెంకుటిళ్లు, అల్పాదాయ వర్గాల ప్రజలే ఎక్కువగా ఉన్న గ్రామాలను ఉన్న ఫలంగా మహానగరంలో విలీనం చేస్తే తర్వాత ఎదురయ్యే పర్యవసానాలను కూడా గమనించాలని మేథావులు పేర్కొంటున్నారు. వీటన్నింటి కన్నా జిల్లా ఉనికి, స్వయంపాలన తదితర కీలక అంశాలనూ పరిశీలనకు తీసుకోకుండానే ఊరికే అభివృద్ధి అనే ముసుగులో పల్లెలను జీహెచ్‌ఎంసీలో కలపడం అన్యాయమంటున్నారు. దీన్ని ప్రజలెవరూ ఒప్పుకోరని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే, పల్లె ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అంశాలేవీ పట్టించుకోకుండా కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం శివారు గ్రామ పంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేసే చర్యలను ప్రతిగటించకపోతే భవిష్యత్తులో జిల్లా ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని విద్యావంతులు, తెలంగాణవాదుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. శివారు గ్రామాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తే అభివృద్ధి కన్నా ముందు పేదవర్గాల ప్రజలపై పన్నుల భారం ఎక్కువవుతుంథి. 

దీంతో పుట్టిన ఊరిలో ఇప్పటివరకు మూడు పూటలా తిండి ఉన్నా లేకున్నా, కంటినిండా నిద్రపోతున్న వారికి మహానగర మాయా ప్రపంచంలో బతుకు అనునిత్యం నరకమయమవుతుందనేది నూటికి నూరు పాళ్లు నిజం. అభివృద్ధి ముసుగు తొడిగి ఇప్పటికే గ్రేటర్‌లో విలీనం చేసుకున్న శివారు మున్సిపాలిల్లో, మెదక్ జిల్లా పటాన్‌చెరు, రామచంద్రాపురం ప్రాంతాల్లో గత రెండున్నరేళ్లుగా కనిపిస్తున్న ప్రగతి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న పుట్టెడు కష్టాలే ఇందుకు తాజా నిదర్శనం. అయితే, ఇన్ని ప్రతిబంధకాలు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉండగా, శివారు గ్రామపంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? హైకోర్టు స్టే ఉత్తర్వులు అమల్లో ఉండగా, మున్సిపల్ మంత్రి ఇప్పుడు వీలు కాదని మొత్తుకుంటున్నా..

విలీనానికి ఎవరు తొందరపడుతున్నారు? అసలు ఆయా గ్రామ పంచాయతీల పాలకవర్గాల తీర్మాణాలకు వ్యతిరేకంగా జీహెచ్‌ఎంసీలో విలీనం ఎవరి కోసం? అని బాధిత గ్రామాల ప్రజలే కాదు, ప్రజాస్వామికవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజల మనోభవాలను పట్టించుకోకుండా, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా, ఏకపక్షంగా జీహెచ్‌ఎంసీ విస్తరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఆందోళన తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.

అడ్డంకులు తొలగిపోకుండానే...
శివారు గ్రామపంచాయతీలను గ్రేటర్‌లో విలీనంపై మొదటినుంచి అభ్యంతరాలు, వివాదాలూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ విషయంలో జిల్లా ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతోనే శివారు గ్రామాల విలీన ప్రక్రియ మొదట్లోనే నిలిచిపోయింది. మరోవైపు ‘గ్రేటర్’ విస్తరణపై స్థానిక ప్రజల మనోభావాలను పట్టించుకోలేదన్న వాదనలూ ఉండనే ఉన్నాయి. అలాగే, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, శివారు గ్రామపంచాయతీల విలీనంపై ప్రతిపాదనలను పలుమార్లు అడ్డగోలుగా మార్చారనే ఆరోపణలు వచ్చాయి. 

ఇందులో ప్రధానంగా  నార్సింగి, శంషాబాద్‌ను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. తర్వాత మార్చి రాజేంద్రనగర్ మండంలోని 14 గ్రామపంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు కొందరు అప్పట్లోనే కోర్టుకు వెళ్లారు. దీంతో శివారు గ్రామాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు స్టే విధించింది. ఈ ప్రక్రియపై సమగ్రమైన నివేదికతో కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తానికి ఇలాంటి అవరోధాలతో ‘గ్రేటర్’లో శివారు గ్రామ పంచాయతీల విలీనంతో పాటు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు ప్రక్రియ  అర్థాంతరంగా నిలిచిపోయింథి.

అయినా, జిల్లా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో శివారు గ్రామాలపై గ్రేటర్ ముప్పు ఎప్పుడు ముంచుకొస్తుందోనని ప్రజలు భయాందోళనల్లోనే ఉండిపోయారు. సరిగ్గా ఈ సమయంలోనే వారికి మున్సిపల్‌శాఖ మంత్రి మహీధర్‌డ్డి ప్రకటన కొండంత ధైర్యాన్నిచ్చింది. శివారు గ్రామాలను ఇప్పట్లో గ్రేటర్‌లో విలీనం చేసే చర్యలు ఉండవని, దాంతోపాటే కొత్త మున్సిపాలిటీల ఏర్పాటూ ఉండదని ఆయన స్పష్టంగా ప్రకటించారు. దీంతో గ్రేటర్ కత్తి వేలాడుతున్న శివారు 34 గ్రామపంచాయతీల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కానీ, మంత్రి ప్రకటనను కూడా పట్టించుకోకుండా, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పెండింగ్‌లో ఉన్న శివారు గ్రామాలను గ్రేటర్‌లో విలీనం చేసే ఫైలును ఆఘమేఘాల మీద ప్రభుత్వానికి పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, 

మొదట్లో పంపిన ప్రతిపాదనలివే..

గ్రేటర్ విస్తరణ కోసం ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లా యంత్రాంగం మొదట్లో ప్రతిపాదనలు పంపింది. ఇందులో 6 కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను ప్రతిపాదించింది. ఇందుకు అర్బన్‌లోని 34 గ్రామ పంచాయతీలను కలపాలని నిర్ణయించారు. మరో 16 గ్రామ పంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. గ్రేటర్‌లో శివారు గ్రామాలను కలిపేందుకు 5 కిలోమీటర్ల పరిధిని ఎంచుకున్నారు. ఈ లెక్కన శంషాబాద్, ఊట్‌పల్లి, తొండుపల్లి, కోత్వాల్‌గూడలను కలిపి శంషాబాద్‌ను నగర పంచాయతీగా ప్రతిపాదించారు.

అలాగే రాజేంద్రనగర్ మండలంలని నార్సింగి, కోకాపేట్, మంచిరేవుల, గండిపేట, వట్టినాగుల పల్లి, ఖానాపూర్‌ను కలిపి నార్సింగి కేంద్రంగా కొత్త మున్సిపాలిటీగా ప్రతిపాదించారు. ఇబ్రహీంపట్నం, జవహర్‌నగర్, బోడుప్పల్, నాగారం గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీ లేదా నగర పంచాయతీలుగా చేయాలని ప్రతిపాదనలు పంపారు. ఇక గ్రేటర్‌లో కలిపి గ్రామ పంచాయతీలకు వస్తే అవి.. సరూర్‌నగర్ మండంలోని మీర్‌పేట, జిల్లెలగూడ, బాలాపూర్, బడంగ్‌పేట్, అల్మాస్‌గూడ, పహడీషరీఫ్, పుప్పాల్‌గూడ, మణికొండ, కిస్మత్‌పూర్, బండ్లగూడ, హైదర్షాకోట్, కుత్బుల్లాపూర్ మండలంలోని ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి, కొంపల్లి,దూలపల్లి ఉన్నాయి. (సక్సెస్ న్యూస్ ప్రతినిధి) 

No comments:

Post a Comment