Monday, August 27, 2012

జగన్ ఎఫెక్ట్ తో చిరంజీవి బలవుతున్నారా?


కాంగ్రేస్ పార్టీలోని రాజకీయాలకు ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి బలికాబోతున్నారా అంటే అవుననే అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 2014లో కాంగ్రెసు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదని... దీంతో చిరంజీవి, ఆయన అభిమానులు ఆశించినట్లుగా ఆయన 'ముఖ్య' కోరిక తీరే అవకాశాలు సన్నగిల్లాయనే వ్యాఖ్యలు ఇప్పటి నుండే వినిపిస్తున్నాయి. సేవే మార్గం - ప్రేమే లక్ష్యం క్యాప్షన్‌తో ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినప్పుడే ఫెయిల్యూర్ అయ్యారని, ఇక ఆయన లక్ష్యం నెరవేరే అవకాశాలు ఏమాత్రం లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెసులో ఎప్పుడూ గ్రూపు రాజకీయాలు జోరుగా ఉంటాయని, కేవలం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మాత్రమే సజావుగా రాష్ట్ర కాంగ్రెసు ఉందని, ఆయనకు ముందు ఆయన తర్వాత కాంగ్రెసు పూర్తిగా కుక్కలు చించిన విస్తరిలాగానే ఉందని, అలాంటి పార్టీలోకి చిరంజీవి వెళ్లడం చేసిన పెద్ద తప్పు అంటున్నారు. సొంత పార్టీ ఉంటేనే ఆయనకు ప్లస్ అయి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెసులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజాధరణ కలిగిన చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యలను పలువురు విశ్లేషిస్తున్నారు.
ఇటీవల కాలంలో చిరంజీవి మాట్లాడుతూ.. తన అభిమానులు తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి వ్యాఖ్యలపై నేతల మధ్య చర్చ జరుగుతోందట. 2014లో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనని అంటున్నారు. కాంగ్రెసు నేతల తీరు చూసినా అది అర్థమవుతుందని చెబుతున్నారు. కొంతకాలం క్రితం మంత్రులు, ఎమ్మెల్యేలు లోకసభ స్థానం వైపు దృష్టి సారించారని, అంతేకాకుండా ఇప్పటికే చాలామంది జగన్ పార్టీలో చేరారని, వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ఇంకా పెద్ద మొత్తంలో జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.
మంత్రివర్గంలోనే ఏడెనిమిది మంది జగన్ వర్గంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని, వారు ఏ క్షణంలోనైనా జగన్ వైపుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. మరోవైపు విద్యుత్, ధరల పెరుగుదల వంటి సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని, ఇవన్నీ తరచి చూస్తే కాంగ్రెసుకు 2014లో గడ్డు కాలమేనని చెబుతున్నారు. అలాంటప్పుడు కాంగ్రెసులో ఉన్న చిరంజీవి చేసేదేమీ లేదని, ఆయన అభిమానుల ఆశలు నెరవేరే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. కాంగ్రెసు నేతలలో కూడా వచ్చేసారి తమ పార్టీ గెలుస్తుందనే ఆశలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలతో పాటు జగన్ ఎఫెక్ట్ కాంగ్రెసు గెలుపుపై ఖచ్చితంగా పడుతుందని అంటున్నారు. ఒకవేళ కాంగ్రెసు పార్టీ గెలిచినా చిరంజీవిని ముఖ్యమంత్రిగా చేసేందుకు పార్టీలో తీవ్ర అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలను కొట్టి పారేయలేమని చెబుతున్నారు. ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇచ్చేందుకే రాష్ట్ర నేతల నుండి అధిష్టానం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఏ మేరకు స్వాగతిస్తారనే ప్రశ్న తలెత్తుతోందని అంటున్నారు.

No comments:

Post a Comment