Monday, February 6, 2012

ఆర్‌ఈసీఎస్ మాజీ చైర్మన్ జనరాజ్‌దాస్ మృతి


ఆర్‌ఈసీఎస్ మాజీ చైర్మన్ పెంటకోట జనరాజ్‌దాస్ (55) 05/02/2012ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతితో మునగపాకలో విషాదఛాయలు అలముకున్నాయి. రాజకీయ చరిత్రలో మచ్చలేని నాయకునిగా, ప్రజాక్షేమం కోసం పరితపించే జనరాజ్‌దాస్ ఇక లేరన్న నిజం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొద్దిరోజులుగా కిడ్నీపరమైన సమస్యలతో బాధపడుతూ విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం పరమపదించారు. ఆయనకు భార్య వాణి, బద్రి, శ్రీకాంత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నేతగా వ్యవహరించి, ఆ పార్టీ అధినేత స్వర్గీయ నందమూరి తారకరామారావు మన్ననలను పొందారు. 

తెలుగుయువత కార్యదర్శిగా, ఆర్‌ఈసీఎస్ చైర్మన్‌గా, తెలుగుదేశంపార్టీ జిల్లాఅధ్యక్షునిగా పనిచేశారు. ఇదే తరుణంలో మునగపాక పీఏసీఎస్‌కు అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికై డీసీసీబీ అధ్యక్షునిగా నియమితులవుతారనుకున్న తరుణంలో ఆ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆర్‌ఈసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన కాలంలోనే మునగపాకలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు, బైపాస్‌రోడ్డు, పీహెచ్‌సీ భవనం, పీఏసీఎస్ భవన నిర్మాణానికి విశేష కృషి చేశారు. ఆయన మృతికి మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నేత కొణతాల రామకృష్ణ, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రఘుబాబు, చలనచిత్ర డ్యాన్స్ డెరైక్టర్ లంకా సత్యానంద్ తదితరులు సంతాపం ప్రకటించారు.

No comments:

Post a Comment