Tuesday, February 14, 2012

గ్రేటర్ విశాఖ... నగరపాలక సంస్థగా మారింది!!!???


 *జీవీఎంసీలో వికేంద్రీకరణ రగడ:
 కమిషనర్ పోకడపై గుప్పుమంటున్న విమర్శలు
 * విభాగ అధిపతుల అధికారాలకు పగ్గాలు 
 * జీవిఎంసీలో వెల్లువెత్తుతున్న విమర్శలు
 
   జీ.వి.ఎమ్.సి కి కొన్ని నెలల క్రితం వచ్చిన కమీషనర్ రామాంజనేయులు మొదటి నుంచి వినూత్న విధానాలతో ముందుకెళుతున్నారు. ఇంకా కొన్ని రోజుల్లో కౌన్సిల్ పూర్తి పదవీకాలం ముగియనుంది. దీంతో అధికార గణానిదే పూర్తి పెత్తనం కానుంది. ఇప్పటికే కమీషనర్ పరిపాలనపై తన పట్టు సాధించారు. పరిపాలనా సౌలభ్యంకోసం వికేంద్రీకరణ చేపట్టామని అందులో భాగంగానే జోన్లు, వార్డులు, ఏరియాలుగా విభజించామని రామాంజనేయులు చెప్తున్నారు.

   తే మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన వివిధ శాఖల అధిపతులు వికేంద్రికరణ నేపద్యంలో వారి పట్టు కోల్పోతున్నారనే విమర్శలు బయలదేరాయి. ఈ నెల 14నుంచి వార్డు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కమీషనర్ వెల్లడించడంతో అన్నితానై వ్యవహరిస్తున్న కమీషనర్ తీరుతో విభాగాధిపతుల అధికారాలకు కత్తెర పడింది. జీవిఎంసిలో అత్యంత కీలక పాత్రలు పోషించే అడిషనల్ కమీషనర్, ఛీఫ్ సిటీ ప్లానర్, ఛీఫ్ ఇంజనీర్, వైద్యఆరోగ్య అధికారులు వికేంద్రీకరణ నేపద్యంలో  క్రమంగా జోనల్ కమీషనర్ల హస్తాల్లోకి జారిపోతున్నారు. క్షత్రస్థాయి అధికారుల సైతం వీరిని లెక్కచేయడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కమీషనరే సుప్రీం అయినప్పటికీ ఈ తరహా సంస్కరణలు ప్రధాన అధికారులపై వేటుగా భావిస్తున్నారు. ఈ నేపద్యంలో కీలక అధికారులు ఉత్సవ విగ్రహాలుగా మారారని కమీషనర్ కార్యాలయం పరిధిలో విమర్శలు గుప్పుమంటున్నాయి.
 నగరపాలక సంస్థ, గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థగా మారింది. వౌలిక సదుపాయాలు కల్పిస్తే, నగరం అందంగా మారిపోతుందని, ఈ సుందరమైన నగరాన్ని మరింత అభివృద్ధి చేసి జనాన్ని ఉద్ధరిస్తారని కార్పొరేటర్లుగా పంపిస్తే.. వారు చేసింది ఏంటి? వారి జేబులు నింపుకొని, జీవీఎంసీ ఖాజానాకు కన్నం పెట్టారు. ఐదేళ్ల పాటు వీరికి అవకాశం కల్పిస్తే, నగర ప్రజల జీవితాల్లో ఏమాత్రం వెలుగు నింపకపోగా, వారి స్వార్థాన్ని మాత్రమే చూసుకుని రేపో, మాపో కుర్చీలు దిగిపోనున్నారు. నగరపాలక సంస్థ అష్టకష్టాల్లో ఉందని నగరంలోని అట్టడుగు వ్యక్తికి కూడా తెలుసు. తన ఆర్థిక పరిస్థితి బాగులేకపోయినా, జీవీఎంసీ వారు ఇచ్చి నోటీసుల మేరకు పన్ను చెల్లిస్తూ వస్తున్నాడు. పన్ను కట్టపోతే ఉన్న చిన్నపాటి గూడు, సామాను ఎక్కడ ఛిద్రం చేస్తారోనన్న భయమో! లేక సగటు మనిషిగా ఆయనకు ఉన్న బాధ్యతో కానీ పన్ను చెల్లిస్తూ వస్తున్నాడు. మరి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారికి పన్ను చెల్లించాలన్న ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు? ఒకరు కాదు..ఇద్దరు కాదు.. డజన్లకొద్దీ ప్రజా ప్రతినిధులు ఆస్తి పన్ను ఎగవేసిన జాబితాలో ఉన్నారు. వీరిలో కొంతమంది మహనీయులు ప్రతి కౌన్సిల్ సమావేశంలోనూ మాట్లాడే మాటలకు, చేస్తున్న చేతలకు ఏమాత్రం పొంతన లేదన్నది ఈ ఎగవేతతో తేలిపోయింది.
జీవీఎంసీ బరువు బాధ్యతలన్నీ తమ భుజస్కందాలపైనే ఉన్నాయన్నట్టు, పత్రికల వారికి వినిపించేలా ఆర్థిక పరిస్థితుల గురించి ఏకరవుపెడుతుంటారు మన కార్పొరేటర్లు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి రావల్సిన బకాయిలను వెంటనే రాబట్టాలని, అవసరమైతే తామంతా ఒక బృందంగా ఏర్పడి వెళ్లి ఆయా సంస్థల యాజమాన్యాల వద్ద ప్రాధేయ పడదామని సూచనలు ఇస్తుంటారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు తదితర సంస్థలు పన్ను చెల్లించకపోవడాన్ని సమయం దొరికినప్పుడల్లా తప్పుపడుతుంటారు.
గుదిబండలాంటి జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకాన్ని నెత్తిన పెట్టుకుని మూడు వందల కోట్ల రూపాయల వరకూ అప్పులపాలైనపోయి, నెలకు నాలుగు కోట్ల రూపాయలు వడ్డీ, అసలు చెల్లించుకుంటున్న జీవీఎంసీ ఖజానా దుస్థితి కార్పొరేటర్లకు తెలియంది కాదే! మరి వీరు చేస్తున్నదేంటి? బాధ్యతగల పదవుల్లో ఉంటూ వీరు పన్ను చెల్లించకపోవడం సరైనదే అంటారా? వేలు, లక్షల్లో బకాయిపడ్డ వీరు వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఏం సమాధానం చెపుతారు? ప్రజలు నిలదీస్తే, వీరి పరువేంకాను? ఏళ్ల తరబడి వీరు ఆస్తి పన్ను చెల్లించకపోవడానికి కారణాలేంటి? పదవిని అడ్డం పెట్టుకుని పన్ను ఎగవేశారా? లేక ఆస్తి పన్ను మదింపులో వీరికేమైన అభ్యంతరాలు ఉన్నాయా? అలా ఉంటే, రివిజన్ పిటిషన్లు దాఖలు చేశారా? ఇవేవీ లేనప్పుడు వేలాది రూపాయల పన్ను ఎగవేయడానికి కారణమేంటి?
చిన్న పురిపాకలో ఉన్న సామాన్యుడు, లేకుంటే చిన్నపాటి ఇల్లు కట్టుకుని అందులో నివసిస్తున్న సాధారణ వ్యక్తి పన్ను చెల్లించకపోతే, ఆస్తులు జప్తు చేస్తామని రంగు రంగుల నోటీసులు జారీ చేస్తున్న జీవీఎంసీ ఈ మహా నేతలు పన్ను ఎగవేస్తుంటే ఎందుకు మిన్నకుంది? అధికారం, మొహమాటం, లొసుగులు అడ్డొచ్చా? సామాన్యులు పన్ను చెల్లించకపోతే, ఆయా మొత్తాలకు వడ్డీ కూడా విధిస్తున్న జీవీఎంసీ అధికారులు, వీరి నుంచి కనీసం అసలు మొత్తాన్నైనా రాబట్టగలరా? కేవలం 10 రోజుల కాలపరిమితి ఉన్న వీరిని ఇంకా భుజాలపై మోయాల్సిన అవసరం ఉందని జీవీఎంసీ ఉన్నతాధికారులు భావిస్తే, పన్ను వసూళ్ళకు వెనకాడుతారు? అలాంటి మొహమాటాలేవీ లేవనుకుంటే, ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు! ఈ రెంటిలో ఏది జరుగుతుందో వేచి చూద్దాం.

No comments:

Post a Comment