Monday, February 20, 2012

గంటాశ్రీనివాసరావు కు క్లిష్ట పరిస్థితులు!!!


 మంత్రి గంటాశ్రీనివాసరావు జిల్లాలోనే చక్రం తిప్పుతున్నతన సొంత నియోజకవర్గంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పిఆర్పీ విలీనంతో కాంగ్రెస్ కేడర్ తనకు అండగా నిలుస్తారని భావించినా, పరిస్థితులు అంత అనుకూలంగా కనబడటం లేదు. ఇటీవల మంత్రికి జరిగిన పౌరసన్మాన కార్యక్రమంలో ఈ విషయాలు మరింత ప్రస్పుటమయ్యాయి. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు, కాంగ్రెస్‌లోనే కొంత మంది నేతలు కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి. ఇద్దరు రాజకీయ ఉద్ధండులపై పై చేయి సాధించిన గంటా, తన ఇలాకాలో పరిస్థితులు ఎంత వరకు సరిదిద్దుకుంటారో ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న కొణతాల రామకృష్ణ తన అనుచరులు, కార్యకర్తలతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. దీనితో అనకాపల్లి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై ఆ ప్రభావం తీవ్రంగా చూపుతుందని భావించారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడం, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకాంగ్రెస్‌లో ప్రత్యామ్నాయ నేతగా మెలిగే పరిస్థితి స్పష్టమయింది. గంటాకు మంత్రి పదవిరావడంతో కొణతాల కాంగ్రెస్‌కు దూరమైన లోటు భర్తీ అవుతుందని, స్థానికంగా పార్టీమరింత బలోపేతమవుతుందని జిల్లా కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అయితే స్థానికంగా పరిస్థితులు గంటాకు అనుకూలించడం లేదు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో శనివారం రాత్రి నిర్వహించిన గంటా పౌరసన్మాన కార్యక్రమానికి మెజార్టీ కాంగ్రెస్ పార్టీనేతలు, కార్యకర్తలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది.గంటాతోపాటు ఆయనకు సన్నిహితంగా మెలిగే ప్రజారాజ్యం పార్టీ నాయకులు, కార్యకర్తలతోనే కార్యక్రమం కొనసాగించారు. మాజీ మంత్రి కొణతాలతో విభేదించి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కొణతాల జగన్ పిఆర్‌పి కాంగ్రెస్‌లో విలీనమయినప్పటి నుండి గంటాకు అత్యంత విధేయత కలిగిన నేతగా మెలుగుతున్నారు. గంటా పౌరసన్మాన సభకు జగన్‌తోపాటు ఆయన సన్నిహిత వర్గనేతలు, కార్యకర్తలు డుమ్మాకొట్టారు. కొణతాల రామకృష్ణ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరినప్పటికీ ఆయన తమ్ముడు రఘునాథ్ మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. గంటా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా విశాఖకు విచ్చేసిన సందర్భంలో ఆయనకు స్వాగతం పలికేందుకు తన సన్నిహితులతోపాటు వెళ్తానని కొణతాల సోదరుడు రఘునాథ్ ప్రకటించినప్పటికీ గైర్హాజరయ్యారు. గంటాకు స్వాగతం పలికేందుకు మాజీ మున్సిపల్ చైర్మన్ జగన్ అనూహ్యరీతిలో వాహనాలతో, పార్టీనేతలతో అట్టహాసంగా తరలివెళ్లగా పౌరసన్మాన కార్యక్రమానికి గైర్హాజరవడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమయింది. ఆహ్వానపత్రంలో స్థానిక నేత అయిన తనపేరు లేకపోవడంతో కినుకువహించే గైర్హాజరయ్యారని ప్రచారం సాగుతోంది. అయితే జగన్ తిరుమల యాత్రకు వెళ్లడం వలన హాజరుకాలేకపోయారని గంటా అనుచరులు పేర్కొంటుండగా అదమం జగన్ అనుచరవర్గనేతలు, కార్యకర్తలు సైతం పూర్తిగా సన్మాన కార్యక్రమానికి గైర్హాజరవ్వాలనే లక్ష్యంతోనే దూరంగా ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. సహజంగానే అనకాపల్లి అసెంబ్లీ పరిధిలో ప్రజారాజ్యం పార్టీ కేడర్ మాత్రమే గంటాకు సన్నిహితంగా మెలుగుతుంది. మంత్రి పదవి వచ్చాక కాంగ్రెస్ పార్టీ కేడర్ కూడా చేరువవుతుందని, అనకాపల్లి అసెంబ్లీలో కాంగ్రెస్ గట్టి బలాన్ని కూడగట్టుకోగలదని భావించారు. అయితే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కె. రాంజీ, మరికొంతమంది అడపాదడపా నేతలు మాత్రమే గంటాకు సన్నిహితంగా మెలుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయిన మెజార్టీపార్టీనేతలు, కేడర్ గంటాకు దూరంగానే మెలుగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న ఆ పార్టీకేడర్‌ను మంత్రి గంటా ఏ మేరకు కలుపుకుని వెళ్లగలరు.. నామినేటెడ్ పదవుల పంపిణీలో పిఆర్పీ, కాంగ్రెస్ కేడర్‌కు ఏ మేరకు సంతృప్తి పరచగలరనే అంశాలు ఆసక్తి కరంగా మారాయి. జిల్లా రాజకీయాల్లోనే అత్యంత అనుభవం కలిగిన ఇద్దరు నేతలపై గంటా ఇంకా పై చేయి సాధించాలంటే స్థానికంగా పార్టీలో నెలకొన్న గందరగోళాన్ని సరిదిద్దాల్సి వుంది. లేదంటే మున్సిపాల్టీ, మండల పరిషత్, కోఆపరేటీవ్ తదితర ఎన్నికల విజయాలపై కనే్నసిన గంటాకు అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చే ప్రమాదముందని పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

No comments:

Post a Comment