Saturday, February 11, 2012

వైభవ్ జ్యూయలరీ అధినేత గ్రంధి మనోజ్‌కు కన్నీటి వీడ్కోలు


 వైభవ్ జ్యూయలరీ అధినేత గ్రంధి మనోజ్‌కు 10/02/2012 తేది శుక్రవారం సాయంత్రం కన్నీటి వీడ్కోలు పలికారు. విశాఖ నుంచి ఈ నెల రెండో తేదీన జైపూర్, హైదరాబాద్, బెంగుళూరు వెళ్లాక ఏడో తేదీన బెంగుళూరులో ఆయన హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన మృత దేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం విశాఖ తీసుకువచ్చారు. దీంతో ఒక్కసారిగా ఇక్కడ విషాద చాయలు అలముకున్నాయి. కన్నీరుమున్నీరై విలపిస్తున్న మనోజ్ తల్లిదండ్రులు, భార్యా, పిల్లలను చూసిన వారికి హృదయం ద్రవించిపోయింది. బంధువులు, సన్నిహితులు, సిబ్బంది కూడా కన్నీటిపర్యంతమయ్యారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి మనోజ్ మృతదేహాన్ని నేరుగా ద్వారకానగర్ వైభవ్ జ్యూయలరీ కాంప్లెక్స్ వద్దకు తీసుకువచ్చి, సందర్శకుల కోసం ఉంచారు. నగరంలో పలుచోట్ల నుంచి తరలివచ్చిన సందర్శకులు మనోజ్ మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. ఆనందవనం అధిపతి సద్గురు శివానందమూర్తి మనోజ్ మృతదేహానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యేలు మళ్ళ విజయప్రసాద్, పంచకర్ల రమేష్‌బాబు, వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే కంభంపాటి హరిబాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి జెవివి సత్యనారాయణమూర్తి, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు, పారిశ్రామికవేత్త మట్టపల్లి చలమయ్య తదితరులు సంతాపం తెలియజేసిన వారిలో ఉన్నారు. సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, కంకటాల మల్లిక్, పైడా కృష్ణప్రసాద్ మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. శుక్రవారం నగరంలో బంగారు, వస్త్ర దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి సంతాపాన్ని తెలియజేశారు.


No comments:

Post a Comment