Saturday, July 9, 2011

ఆరో చాంబర్ తెరవొద్దు – సుప్రీం కమిటీకి పద్మనాభుడి సిరికి రక్షణ ఎలా?

ఆరో చాంబర్ తెరవొద్దు – సుప్రీం కమిటీకి పద్మనాభుడి సిరికి రక్షణ ఎలా?
తిరువనంతపురంలోని సుప్రసిద్ద పద్మనాభస్వామి ఆలయం నేలమాళిగలో చివరి చాంబర్‌ను తెరవొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. సంపద లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న నిపుణుల కమిటీకి న్యాయమూర్తులు విఆర్ రవీంద్రన్, ఎకె పట్నాయక్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశించింది. వచ్చే గురువారం జరిగే తదుపరి విచారణ దాకా వాయిదా వేస్తూ, అపార సంపదతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఆలయ పవిత్రత, సంపద భద్రతకు సంబంధించి తగిన సూచనలు చేయాల్సిందిగా పిటిషనర్, తిరువాన్కూర్ రాజవంశీయుడైన రాజా మార్తాండ వర్మ, కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పద్మనాభస్వామి ఆలయం నేలమాళిగలోని ఆరు రహస్య గదుల్లో ఐదింటిని ఇప్పటికే తెరిచిన విషయం తెలిసిందే. అయితే ఆరో గదిని (బి-చాంబర్) మాత్రం తెరవలేదు. ఈ అయిదు గదుల్లో సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన వజ్ర వైఢూర్యాలు పొదిగిన బంగారు, వెండి ఆభరణాలు, పురాతన బంగారు, వెండి నాణేలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. భక్తుల విశ్వాసాన్ని, మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టు తెలియజేసింది. చివరి గదిని తెరిస్తే పాలకులకేకాక, గదిని తెరిచిన వారికీ కీడు కలుగుతుందని భక్తుల విశ్వాసం.
కాగా, ఈ ఆలయం ప్రజల ఆస్తి అని రాజవంశీకుల తరఫున వాదించిన న్యాయవాది కెకె వేణుగోపాల్ ధర్మాసనానికి స్పష్టం చేశారు. ఇప్పుడు బైటపడిన ఆస్తిలో రాజ కుటుంబీకులు ఎవ్వరూ వాటా కోరడం లేదని కోర్టుకు విన్నవించారు. బయటపడిన సొమ్ము ఆలయానికే చెందుతుందని రాజకుటుంబీకులు చెప్తున్నట్టు ధర్మాసనానికి స్పష్టం చేశారు.
అంతేకాక వెలుగు చూసిన సంపద విలవ లక్ష కోట్ల రూపాయలుగా చెప్పడం సరికాదని, అదంతా మీడియా వేస్తున్న అంచనా మాత్రమేనని ఆయన అన్నారు. కాగా, ఆలయ భద్రత పట్ల న్యాయమూర్తులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ‘గర్భగుడిలోని విగ్రహంపై ఉండటానికి బదులు చాలామంది చూపుఈ రహస్య గదులపై ఉంటోంది’ అని వారు వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment