Tuesday, July 19, 2011

తెలంగాణపై మూడు టీమ్‌లు, ఆజాద్‌తో సీమాంధ్ర భేటీ

హైదరాబాద్: తెలంగాణపై పార్టీలో ఏకాభిప్రాయ సాధన కోసం మూడు ప్రాంతాల నుంచి మూడు టీమ్‌లను ఏర్పాటు చేసే యోచనలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో తనను కలిసి సీమాంధ్ర నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. కోస్తాంధ్ర, తెలంగాణలకు చెందిన టీమ్‌ల్లో ఐదు నుంచి పది సభ్యులేసి, రాయలసీమ టీమ్‌లో ఐదుగురు సభ్యులుంటారు. తమ టీమ్‌లకు సంబంధించిన సభ్యులను ఆయా ప్రాంతాలకు చెందిన నాయకులే ఖరారు చేసుకుంటారు. ఈ టీమ్‌లతో పార్టీ అధిష్టానం సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నిస్తుంది. సీమాంధ్రకు చెందిన 15 మంది మంత్రులు, 31 మంది శాసనసభ్యులు, 12 మంది ఎమ్మెల్సీలు సోమవారం సాయంత్రం ఆజాద్‌ను కలిసినవారిలో ఉన్నారు. పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు నేతృత్వంలో ఈ బృందం ఆజాద్‌తో భేటీ అయ్యారు. 
తెలంగాణకు చెందిన ప్రతినిధులను 5 నుంచి 10 మందిని ఆహ్వానించామని, వారితో సమావేశమైన తర్వాత రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల నాయకులను ఆహ్వానిస్తామని, తద్వారా సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభిస్తామని ఆజాద్ భేటీ అనంతరం చెప్పారు. ఇరు ప్రాంతాల నాయకులు సంయమనం పాటించాలని ఆజాద్ సూచించినట్లు మంత్రి శైలజానాథ్ భేటీ అనంతరం చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఆరో ప్రతిపాదనను అమలు చేయాలని తాము కోరినట్లు ఆయన తెలిపారు. ఆజాద్‌తో చర్చలు సంతృప్తికరంగా సాగాయని కావూరి సాంబశివరావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక పనికిరాదని ఆజాద్ తమతో చెప్పలేదని ఆయన అన్నారు. తెలంగాణపై తన అభిప్రాయాన్ని కూడా ఆజాద్ తమతో చెప్పలేదని ఆయన అన్నారు. 
ఆజాద్‌పై తమకు నమ్మకం ఉందని, అందరితో చర్చించి తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కోరామని ఆయన అన్నారు. ఆజాద్‌కు తమ అభిప్రాయాన్ని తెలిపామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే సీమాంధ్ర ప్రజల ఆకాంక్షను తెలిపామని ఆయన చెప్పారు. సమస్యకు పరిష్కారం లభించే వరకు ఆజాద్‌ను కలుస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి దిగజారుతోందని, పార్టీ ప్రతిష్టను కాపాడడానికి సహకరించాలని ఆజాద్ సీమాంధ్ర నాయకులకు సూచించినట్లు సమాచారం. ఆజాద్‌తో సమావేశం ముగిసిన తర్వాత సీమాంధ్ర నాయకులు తిరిగి కావూరి నివాసంలో సమావేశమయ్యారు. రేపు మంగళవారం వారు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను, కేంద్ర మంత్రులు చిదంబరం, ప్రణబ్ మఖర్జీలను కలుస్తారు.

No comments:

Post a Comment