Wednesday, July 6, 2011

హస్తినలో తెరపడని హైడ్రామా



హస్తినలో తెరపడని హైడ్రామా
తెలంగాణ అంశంపై 06-07-2011మంగళవారం కూడా హస్తినలో హైడ్రామా కొనసాగింది. అయితే, ఇంకా తెరపడలేదు. దాదాపు వందమంది ప్రజాప్రతినిధులు రాజీనామాలు సమర్పించడంతో ఆ వేడి అధిష్టానాన్ని గట్టిగానే తాకింది. అయితే, ఇప్పటికిప్పుడు ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేకపోయినా, అతి త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా నిర్ణయాన్ని వెలువరించాలన్న దృక్పథంలో కాంగ్రెస్‌ అధిష్టానం వ్యవహరిస్తోంది. అలాగే, విభజనవాదంపై ఇక సాగతీత సరికాదని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. ఈ సారి తొందరపాటుతో కాకుండా ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర నేతలు, ప్రజలను సంతృప్తి పరిచేవిధంగా నిర్ణయం తీసుకోవాలని సంకల్పించింది. వచ్చే రెండు మూడు రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌ అగ్రనేతలు ఉన్నారు. 06-07-11మంగళవారం రోజంతా టి.కాంగ్రెస్‌ ఎంపీలు, నేతలు అధినేత్రి రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ అజాద్‌, ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీలతో చర్చోపచర్చలు జరిపారు. రాత్రి పదిన్నర గంటల సమయంలో ప్రణబ్‌ ముఖర్జీతో టి.కాంగ్రెస్‌ ఎంపీలు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, వివేక్‌, మందా జగన్నాథం, మధుయాష్కీ, బలరామ్‌ నాయక్‌లతో పాటు జానారెడ్డి, సారయ్య, పొన్నాల, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలు భేటీ అయ్యారు. తెలంగాణలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రణబ్‌కు వివరించారు. తాము పార్టీకి వ్యతిరేకం కాదని, పార్టీ ప్రతిష్టను కాపాడుతూనే తమకు ఇబ్బంది లేకుండా ఏదో ఒక పరిష్కారాన్ని సూచించాలని టి.నేతలు ప్రణబ్‌ను కోరారు. దీనిపై చర్చలను కొనసాగిద్దామని ప్రణబ్‌ వారికి హామీ ఇచ్చారు. చర్చలు సంతృప్తికరంగా సాగడం పట్ల టి.నేతలు కూడా సంతోషం వెలిబుచ్చారు. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలని ప్రణబ్‌ను కోరినట్టు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ జానారెడ్డి చెప్పారు. ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొనే వరకూ ఓర్పు వహించాలని తమను ప్రణబ్‌ కోరారని, తక్షణం తెలంగాణను ప్రకటించాలని, అంతవరకు మాత్రమే తాము ఓర్పు వహించగలమని జానారెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా, జానా బృందం భేటీ ముగిసిన అనంతరం ప్రణబ్‌తో విజయవాడ ఎంపీ లగడపాటి సమావేశం కావడం విశేషం.
చర్చోపచర్చలు
తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల మూకుమ్మడి రాజీనామాల పట్ల తొలుత నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిన కాంగ్రెస్‌ అధిష్టానంలో మంగళవారంనాడు కొంత కదలిక వచ్చింది. సున్నితమైన, సంక్లిష్టమైన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ఇప్పటికిప్పుడు పరిష్కరించే అవకాశాలు లేకపోయినా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల రాజీనామాలను ఉపసంహరింపజేసేందుకున్న మార్గాలను అన్వేషించడం ప్రారంభించింది.
మూకుమ్మడి రాజీనామాల రూపంలో తెలంగాణ ప్రజల మనోభావాలను విస్పష్టంగా వ్యక్తీకరించిన ప్రజాప్రతినిధుల ప్రతిష్టను కాపాడుతూనే వారికి రాజీనామాలను ఉపసంహరించుకొనే అవకాశాన్ని కల్పించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించిన అధిష్టానం మంగళవారంనాడంతా గత రాత్రి ఇక్కడకు చేరుకొన్న ముగ్గురు రాష్ట్ర మంత్రులు, మరికొద్ది మంది పార్లమెంట్‌ సభ్యులతో విస్తృతంగా చర్చలు జరిపింది. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలోపేతం కావడానికి ముఖ్యమైన ప్రేరణగా భావిస్తున్న రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14-ఎఫ్‌ క్లాజును తొలగించడంతో పాటు తెలంగాణ డిమాండ్‌పై కేంద్రం తప్పనిసరని భావిస్తున్న సంప్రదింపుల ప్రక్రియను తక్షణమే పున:ప్రారంభించి వేగవంతం చేస్తామనే ప్రకటనతో రాజీనామాల పర్వానికి తెరదించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామనే విస్పష్టమైన ప్రకటన మినహా మరే ప్రత్యామ్నాయంతోనూ తాము సంతృప్తిపడే సమస్యే లేదని ఇప్పటి వరకూ కొంత మొండిగా వ్యవహరిస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల నాయకులు కూడా మంగళవారంనాడు గులాంనబీ ఆజాద్‌తో పాటు కాంగ్రెస్‌ అధ్యక్షురాలి రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌తో తొలిదఫా చర్చల సందర్భంగానే కొంత మెత్తబడినట్లు సమాచారం. సంప్రదింపుల ప్రక్రియ పూర్తికాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల, పార్టీల అభిప్రాయాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఏకాభిప్రాయం సాధించకుండా తెలంగాణపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవడం సాధ్యపడదని కేంద్ర నాయకులు తేల్చిచెప్పిన నేపథ్యంలో గత కొంతకాలంగా ఎలాంటి చలనం లేకుండా పడివున్న సంప్రదింపుల ప్రక్రియనైనా వెంటనే ప్రారంభించాలని వీరు అధిష్టానం ప్రతినిధులను కోరారు.
ఉదయం గులాంనబీ ఆజాద్‌తో తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం చర్చల తర్వాత అహ్మద్‌ పటేల్‌తో కలిసి ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీని కలుసుకొని తెలంగాణ ప్రజాప్రతినిధుల మూకుమ్మడి రాజీనామాలతో తలెత్తిన ఇబ్బందికర పరిస్థితులను, రాజీనామాలకు పరిష్కారం కనుగొనే విషయంలో తెలంగాణ నాయకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఆమెకు వివరించారు. పార్టీ అధ్యక్షురాలి స్థాయిలో జరిగిన ఈ చర్చల అనంతరం అహ్మద్‌ పటేల్‌ తెలంగాణకే చెందిన సీనియర్‌ నాయకుడు, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారు. తెలంగాణ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సారయ్యలతో పాటు పార్లమెంట్‌ సభ్యులు వివేక్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకరరెడ్డి తదితరులు కూడా ఈ చర్చలలో పాలుపంచుకొన్నారు.
ఉదయం, సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జితో, అధ్యక్షురాలి రాజకీయ కార్యదర్శితో జరిపిన చర్చలలో తెలంగాణ ప్రజల మనోభావాల తీవ్రతను, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను, సంక్లిష్టమైన ఈ వివాద పరిష్కారానికున్న మార్గాలను ఎంతో విపులంగా చర్చించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించడంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ ప్రయోజనాల పరిరక్షణను కూడా దృష్టిలో ఉంచుకొని సాగిన ఈ చర్చలలో వివిధ పరిష్కారమార్గాలను పరిశీలించినట్లు సమాచారం. తెలంగాణ ప్రజలు కోరుకొంటున్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించకుండా వారిని సంతృప్తిపరచడం అసాధ్యమని కొందరు నాయకులు వాదించగా కనీసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ సానుకూలమేనంటూ వర్కింగ్‌ కమిటీలో ఒక తీర్మానాన్ని ఆమోదించి ప్రభుత్వ పరిశీలనకు పంపించే విషయాన్ని పరిశీలించాలని మరొకరు సూచించినట్లు సమాచారం.
అధిష్టానం నేతలు స్పష్టీకరిస్తున్న విధంగా తెలంగాణ అంశంపై కోస్తా, రాయలసీమ ప్రాంత ప్రజలతో, రాజకీయ పార్టీలతో చర్చలు జరపడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని వెల్లడించిన తెలంగాణ నేతలు ఒక దశలో రాష్ట్రాన్ని రెండుగా విభజించే విషయంలో ప్రధానంగా అభ్యంతరం వ్యక్తమయ్యే రాజధాని నగరం విషయంలో కూడా కొంతమేరకు రాజీపడేందుకు సిద్ధపడినట్లు అభిజ్ఞ వర్గాల సమాచారం. తెలంగాణ ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తే హైద్రాబాద్‌ నగరాన్ని కొన్నేళ్లపాటు రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా అంగీకరించేందుకు తమకు పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చునని కూడా చర్చల సందర్భంగా తెలంగాణ నేతలు పేర్కొన్నట్లు ధ్రువీకరించబడని వార్తలు వెల్లడిస్తున్నాయి. సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం తెలంగాణ అంశాన్ని పరిష్కరించేందుకు కేంద్రం సూచిస్తున్న సంప్రదింపుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలనే అంశంపై దాదాపుగా అంగీకారం కుదిరినట్లు అభిజ్ఞ వర్గాలు తెలియజేశాయి.
ప్రజాభీష్టం మేరకే తప్పనిసరైన పరిస్థితులలో చట్టసభల సభ్యత్వాలకు రాజీనామాలు చేయాల్సి వచ్చినప్పటికీ తాము కాంగ్రెస్‌ అధిష్టానానికి విధేయులమేనని, కొన్ని ప్రతిపక్షాలు కోరుకొంటున్న విధంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించాలని భావించడం లేదని ఈ సందర్భంగా అధిష్టానం ప్రతినిధులకు మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, రాజీనామా చేసిన లోక్‌సభ సభ్యులు గడ్డం వివేక్‌, పొన్నం ప్రభాకర్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకరరెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలియవచ్చింది. అయితే, అదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి అయిన కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ ఇటీవలి హైద్రాబాద్‌ పర్యటనలో తెలంగాణ విషయంలో చేసిన వ్యాఖ్యల పట్ల వారు తీవ్ర అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితుల్లో హైద్రాబాద్‌ వచ్చిన ఆయన కనీసం తమతో మాట్లాడకుండా ప్రజారాజ్యం అధినేత చిరంజీవి నివాసానికి వెళ్లడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని వారు మండిపడ్డారు. అయితే, సమయాభావం వల్లనే తాను అందరినీ కలుసుకోలేకపోయానని, తనకు దురుద్దేశాలు ఆపాదించవద్దని ఆయన ఇచ్చిన వివరణతో తెలంగాణ నేతలు సంతృప్తిపడ్డారు.
ఉదయం గులాం నబీ ఆజాద్‌తో చర్చల అనంతరం విలేఖరులతో మాట్లాడిన మంత్రి జానారెడ్డి అధిష్టానం ఆహ్వానంపైనే తాము ఎఐసిసి ఇన్‌చార్జితో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రజల మనోగతాన్ని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయనకు విపులంగా తెలియజేశామని, అధిష్టానం కూడా సమస్య పరిష్కారానికే ప్రయత్నిస్తున్నదని ఆయన తెలియజేశారు. తెలంగాణ సమస్య ఒక్కరోజులో పరిష్కారమయ్యేది కాదన్న ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తెలంగాణపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ప్రభుత్వం, పార్టీ ప్రయత్నిస్తున్నాయని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలనే తాము కోరుతున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరేలా చూసేందుకే తాము ప్రయత్నిస్తున్నామన్న ఆయన తమ పార్టీ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తమపై ఉందన్నారు. గులాం నబీ ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌లతో జరిపిన చర్చలు ఎంతో సుహృద్భావ వాతావరణంలో, సదావగాహనతో, సీరియస్‌గా జరిగాయని మరో ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ వెల్లడించారు. తెలంగాణ విషయంలో నిర్ణయం తీసుకొనేందుకు విస్తృత స్థాయి సంప్రదింపుల ప్రక్రియ పూర్తికావడం తప్పనిసరని కేంద్ర హో మంత్రి తేల్చిచెప్పినందున దానిని సత్వరమే ప్రారంభించి నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయాలని తాము కోరుతున్నామని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ ప్రాంతం వారితో, ఏ పార్టీతో చర్చించదలిచినా తమకెలాంటి అభ్యంతరం ఉండదన్నారు. తొలి విడత చర్చలు తమకు సంతృప్తినిచ్చాయని, మంగళవారం రాత్రి లేదా బుధవారం జరుగనున్న మలివిడత చర్చల్లో సమస్యకు ఒక పరిష్కారం లభించగలదన్న విశ్వాసం తమకుందని కూడా ఆయన చెప్పారు.
కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో తెలంగాణ నేతలతో సుమారు అరగంటసేపు చర్చలు జరిపిన అహ్మద్‌పటేల్‌ మరోదఫా మరింత విస్తృత సంప్రదిపుల కోసం రాత్రి పదకొండు గంటలకు తన నివాసానికి రావాలని ఆహ్వానించి వెళ్లడంతో రాత్రి పోద్దుపోయేంత వరకూ జైపాల్‌ నివాసంలోనే ఉన్న తెలంగాణ నేతలు పలువురు పరిస్థితిని సమీక్షించుకొని తమ వాదనలకు మరింత పదునుపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

No comments:

Post a Comment