Saturday, January 14, 2012

చిరంజీవి వైరాగ్యం !


జనవరి 12 : రాజకీయాల్లోకి వచ్చి సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించి, ప్రజలకు మెరుగైన జీవనాన్ని ఇవ్వాలని అనుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. ఎంత చేసినా అధికారుల్లో మార్పు రాదన్నది ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా అరకులో జరుగుతున్న ఎమ్మెల్యేల శిక్షణా తరగతుల్లో గడచిన రెండు రోజుల నుంచి చిరంజీవి చురుకుగా పాల్గొంటున్నారు. చివరి రోజైన బుధవారం ఆయన ప్రసంగించారు. తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలు ప్రసూతి సమయంలో తీవ్ర ఇబ్బందిపడుతున్నారని, ఎనస్థీషియా యూనిట్ లేకపోవడం వలన ఈ సమస్య ఎదురవుతోందని తాను గమనించానని అన్నారు. 
గత మూడు సంవత్సరాలుగా ఈ యూనిట్ గురించి తిరుపతి ఎమ్మెల్యేగా వచ్చిన ప్రతి ఆరోగ్య శాఖ మంత్రినీ కోరుకుంటున్నానని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులను కూడా పదేపదే కోరాను. ఇదిగో మంజూరు చేస్తున్నాం.. అదిగో మంజూరు చేస్తున్నాం అని చెపుతున్నారే తప్ప, ఇప్పటి వరకూ ఆ యూనిట్ రాలేదని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. నాలాంటి వ్యక్తినే అధికారులు పరిగణలోకి తీసుకోనప్పుడు, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అధికారులు డిటాచ్‌డ్‌గా పనిచేస్తున్నారే తప్ప, చిత్తశుద్ధితో కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 
బాక్సైట్‌పై ఆచితూచి అడుగేయండి!

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం ఆచితూచి అడుగేస్తేనే మంచిదని అన్నారు. ఖనిజ సంపద అన్యాక్రాంతం చేసే ముందు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. బాక్సైట్ తవ్వకాల వలన ఇక్కడ వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుందని, దీనివలన నదీ జలాలు కూడా ఇంకిపోయే ప్రమాదం ఉందని అన్నారు. గిరిజనులకు ప్రత్యేకించి మేలు చేయకపోయినా ఫరవాలేదని, వారి జీవన విధానాన్ని దెబ్బతీయకుండ చూడాలని చిరంజీవి అన్నారు. ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లిపోతున్నారని, దీంతో గిరిజన తండాల్లోని జనం మరింత బిక్కుబిక్కుమంటున్నారని అన్నారు. అరకుతో తనకు సన్నిహిత సంబంధం ఉందని, సినిమా షూటింగ్‌లకు వచ్చినప్పుడు ఇక్కడి అందాలే చూశాను తప్ప, ఆ అందాల వెనుక ఉన్న ఆవేదనను చూడలేకపోయానని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి లేక వీరి బతుకులు ఎంత ఛిద్రమైపోయాయో చూస్తే చాలా బాధాకరంగా ఉందని అన్నారు. ఇవే సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు సభ్యులు పెద్దగా పట్టించుకోరని, క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చినప్పుడు సమస్యలకు వచ్చినప్పుడు వాస్తవాలను గమనించగలుగుతామని చిరంజీవి చెప్పారు .

No comments:

Post a Comment