Saturday, November 26, 2011

రాష్ట్ర ప్రజలకు వరాలు! ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నేడు ముఖ్యమంత్రి తాయిలాలు


ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కొత్త వరాలను ప్రకటించేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం నిర్వహించనున్న ‘రచ్చబండ’ వేదికగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త వరాలను ప్రకటించనున్నారు. పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షాద్‌నగర్ బయలు దేరేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి ఎటువంటి వరాలను ప్రకటిస్తారన్నది ఆయన మంత్రివర్గ సహచరులకు కూడా అంతు చిక్కడం లేదు. మహిళలకు జీరో వడ్డీపై రుణాలు ఇచ్చే పధకాన్ని ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. డ్వాక్రా మహిళలకు ప్రస్తుతం పావలా వడ్డీపై రుణాలు ఇస్తుండగా దాన్ని జీరో వడ్డీ చేయాలన్న అభిప్రాయంతో ఉన్నారు. పేద ప్రజలకు వంద రూపాయలకే నిత్యావసర సరుకుల ప్యాకేజి కూడా ఇందులో ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ప్యాకేజి గురించి ముఖ్యమంత్రి ఇంతకు ముందే ప్రకటించారు. ‘ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి కొన్ని వరాలను ప్రకటించనున్నారు’ అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన నాయకుడు ఒకరు చెప్పారు. అయితే అవేటిమన్నది వివరించడానికి ఆయన నిరాకరించారు. ముఖ్యమంత్రే ప్రకటిస్తారు కదా, చూస్తూండండి’ అని ఆయన అన్నారు.
ప్రతి నెలా ఒక్కో కొత్త పథకాన్ని ప్రకటించాలన్నది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయం. ప్రధానంగా మహిళలకు ఒక ప్రత్యేక పథకం గురించి ముఖ్యమంత్రి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు. అయితే ఈ పథకాన్ని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించాలా లేక ఇప్పుడే ప్రకటించాలా అన్నది ఆయన ఆలోచిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రకటించినట్లయితే ఓట్ల కోసమే ప్రకటించారన్న అనుమానం కలగవచ్చని, ముందుగానే ప్రకటించి అమలు చేసినట్లయితే మహిళలను ఆకర్షించుకోవచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. ‘ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడింది, పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను ప్రకటించేందుకు అవకాశం ఏర్పడింది’ అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజీవ్ యువ కిరణాలు, రూపాయికే కిలో బియ్యం పథకం, ఇందిర జల ప్రభ వంటి పథకాలను కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్తగా ప్రకటించబోయే పథకం ఎలా ఉంటుంది, ఎవరిని ఉద్దేశించింది అన్నది ఆసక్తిగా మారింది. ఇలా ఉండగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో షాద్‌నగర్‌కు బయలుదేరి వెళతారు. అక్కడ అధికారులు, అనధికారులతో సమావేశమవుతారు. 5.96 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ పనులకు శంకుస్థాపనలు చేస్తారు. 34.31 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన వివిధ పనులను ప్రారంభిస్తారు. అనంతరం షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

No comments:

Post a Comment