Thursday, February 14, 2013

అతి దారుణంగా హత్య చేసిన భర్తకు యావజ్జీవం,


విశాఖ నగర నడిబొడ్డున అందరూ చూస్తుండగా, తన భార్యను అతి కిరాతకంగా కత్తితో నరికిన భర్తకు యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి బుధవారం(13-02-2013)న తీర్పు చెప్పారు. మద్దిలపాలెం - కళాభారతి రోడ్డుపై 2011 మార్చి నాలుగో తేదీన కృష్ణవేణిని ఆమె భర్త రవికుమార్ అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. భార్యను హతమార్చిన రవికుమార్ వెంటనే విజయనగరం పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలించి పట్టుకున్నారు. అప్పట్లో ఈ ఉదంతం పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఉలిక్కిపడేలా చేసింది. నడి రోడ్డుపై ఓ మహిళను హతమార్చినా, ఎవ్వరూ కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదు.


అయితే ఘటనా స్థలంలో లభించిన సాక్ష్యాధారాలతో పోలీసులు కేసును పగడ్బందీగా ఫైల్ చేయడంతో నిందితుడు రవికుమార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న చెల్లుబోయిన రవికుమార్ మద్దిలపాలెంకు చెందిన దువ్వి కృష్ణవేణిని 2010 ఆగస్ట్ 29న వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో కృష్ణవేణి తల్లిదండ్రులు లక్షా 50 వేల రూపాయల కట్నం, ఆడబడుచులకు 20 వేల రూపాయల లాంఛనాలు ఇచ్చారు. వివాహం చేసుకునే సమయానికి కృష్ణవేణి ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. కొంతకాలం కలిసి కాపురం చేసిన తరువాత కృష్ణవేణికి వేధింపులు ప్రారంభమయ్యాయి. కృష్ణవేణి తల్లిదండ్రులకు ఒక భవనం ఉంది. ఆ భవనంపై వచ్చే అద్దె తనకు ఇవ్వమని, దాన్ని తనకు రాసివ్వాలని, అదనపు కట్నం తేవాలని కృష్ణవేణిని భర్త రవికుమార్ వేధించడం మొదలుపెట్టాడు. అతనితోపాటు అత్త, మామలు గురమ్మ, సూర్యనారాయణ, ఆడబడుచులు శ్యామలాదేవి, ప్రసన్నకుమారి కూడా కృష్ణవేణిని వేధిస్తుండేవారు. 2011 మార్చి నాలుగో తేదీన కృష్ణవేణి కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా, మద్దిలపాలెం-కళాభారతి రోడ్డులో కొబ్బరి బొండాలు నరికే కత్తితో రవికుమార్ ఆమె గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. కృష్ణవేణి తల్లిదండ్రులు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు మహిళా న్యాయ స్థానం ముందుకు వచ్చింది. న్యాయమూర్తి ఎన్.రాజా ప్రసాద్ బాబా ఇరుపక్షాల వాదనలు విన్నారు. రవికుమార్‌పై హత్యా నేరం రుజువు కావడంతో అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అత్త, మామ, ఆడబడుచులకు మూడు సంవత్సరాల చొప్పున శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. వీరికి శిక్షతో పాటు, ఐదు వేల రూపాయల చొప్పున జరిమానా కూడా విధించారు. ఇది చెల్లించకపోతే, ఒక సంవత్సరం అదనంగా జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసును విచారించేందుకు న్యాయవాది ఎం గోపాలరావును స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించారు.ఉరిశిక్ష వేయాల్సింది తను కుమార్తెను దారుణంగా చంపిన హంతకుడికి న్యాయమూర్తి ఉరిశిక్ష విధిస్తారనుకుంటే యావజ్జీవ ఖైదుతో సరిపెట్టారని కృష్ణవేణి తల్లి దువ్వి వేను కోర్టు ఆవరణలో కన్నీళ్లు పెట్టుకుంది. పోలీసులు పకడ్బందీగానే కేసు నమోదు చేసినప్పటికీ, కోర్టులో సరైన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

No comments:

Post a Comment