Saturday, February 16, 2013

వందల కోట్ల రూపాయలు కు సిమ్స్ శఠగోపం...!!???






వందల కోట్ల రూపాయలు డిపాజిట్లుగా సేకరించి శఠగోపం పెట్టిన కంపెనీల జాబితాలో తాజాగా 'సిమ్స్' కూడా చేరింది. ఈ కంపెనీ గత మూడు నెలలుగా ఖాతాదారులకు వడ్డీ చెల్లించడంలేదు. నిలదీస్తున్న వారికి ఎప్పటికప్పుడు సర్దిచెబుతూ జాప్యం చేసింది. డిపాజిటర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో అందరికీ 15వ తేదీన సొమ్ము చెల్లిస్తామని, ఆందోళన చెందవద్దని పేర్కొంది. ఆ మేరకు  డిపాజిటర్లు ఎక్కడికక్కడ స్థానిక కార్యాలయాలకు వెళ్లారు. అయితే అక్కడ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఏమీ లేకపోవడంతో ఆందోళనకు దిగారు. కొన్నిచోట్ల ఫర్నీచర్ ధ్వంసం చేయగా, మరికొన్నిచోట్ల తీసుకెళ్లిపోయారు.మ్యాజిక్, రాగ మాదిరి గానే బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థల లిస్టులోకి ఇప్పుడు తాజాగా సిమ్స్ సంస్థ చేరిందంటూ ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఖాతాదారులకు గత మూడు నెలల నుండి చెల్లింపులు నిలిచిపోవటంతో పాటు బుధవారం(15-02-13) నుండి సంస్థ ఎమ్‌డి సెల్‌ఫోన్ పనిచేయకపోవడంతో బాధితులు లబోదిబోమంటూ కార్యాలయం చుట్టు తిరుగుతున్నారు. నగరంలోని అక్కయ్యపాలెం సమీపంలో సుమారు నాలుగేళ్ళ క్రితం కె.సురేంద్రగుప్తా ‘సెక్యూరిటీ ఇన్‌వెస్ట్‌మెంట్ మేకింగ్ సర్వీసెస్’ (సిమ్స్) పేరుతో ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేశాడు. సంస్థలో డైరెక్టర్లను, ఏజెంట్లను నియమించి రూ.లక్ష చెల్లిస్తే వారానికి రూ.8వేలు చొప్పిన వడ్డీ చెల్లిస్తామని గుప్తా ప్రచారం చేశారు. దీంతో అనేకమంది ఖాతాదారులు ఇందులోకి చేరడంతో అధిక మొత్తంలో నగదు చేకూరడంతో జిల్లాలోని అనకాపల్లి, చోడవరం, తదితర ప్రాంతాల్లో బ్రాంచ్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వ్యాపారం బాగా వృద్ధి చెందడంతో కొద్ది నెలల క్రితం మద్దిలపాలెం ప్రాంతంలో శాఖ కార్యాలయాన్ని గుప్తా ప్రారంభించారు. ఇదిలా ఉండగా గత మూడు నెలలుగా సిమ్స్‌లో ఖాతాదారులకు పేమెంట్లు ఇవ్వకపోవడంతో సంస్థపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో అనేకమంది ఖాతాదారులు సిమ్స్ కార్యాలయానికి చేరుకుని తమ పేమెంట్లు గురించి సిబ్బందిని నిలదీస్తుండడంతో ఈనెల 15న పేమెంట్లు ఇస్తామని, కంగారు పడాల్సిన అవసరం లేదని వారం రోజుల క్రితం పలు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఈ తరుణంలో శుక్రవారం సిమ్స్ ఆఫీసు వద్దకు ఖాతాదారులు వెళ్ళగా పేమెంట్లు ఇవ్వడం లేదని తెలుసుకుని తీవ్ర అగ్రహావేశాలకు గురయ్యారు. ఇది గమనించిన సిబ్బంది కార్యాలయాన్ని మూసి వేసి అక్కడ నుండి జారుకున్నారు. ఖాతాదారులు ఏజెంట్లను నిలదీయడంతో వారు ఎమ్‌డి గుప్తా సెల్‌ఫోన్‌ను కాల్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉండడాన్ని గమనించారు. దీంతో ఖాతాదారులు లబోదిబోమంటూ ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా సిమ్స్ నిర్వాహకుడు సురేంద్ర గుప్తా ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సిఐ షేక్‌హుస్సేన్ నేతృత్వంలో నాలుగో పట్టణ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment