Wednesday, July 4, 2012

ఎన్ టి పిసి...అయిపోయింది...ఇకఫార్మా సిటీ వంతు !!?




ఫార్మాసిటీని ఆనుకుని ఉన్న తాడి గ్రామాన్ని తరలించడంపై మొదలైన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఈ గ్రామాన్ని తరలించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో చాలాకాలంగా ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ భుజాన కెత్తుకుంది. ఈ సమస్యకు పరిష్కారం లభించేంత వరకు వెనక్కు తగ్గేది లేదని, ఇందుకోసం ఆమరణ దీక్షకు దిగుతానని టిడిపి నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇప్పటికే కలెక్టర్‌కు, ఇతర అధికారులకు నోటీసులు ఇచ్చారు. దీంతో వివాదం మరింత జఠిలమైంది. వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్  అధికార బృందాన్ని ఫార్మాసిటికీ పంపించారు.
ఫార్మాసిటీ కాలుష్యంతో తాడి గ్రామం ఇబ్బంది పడుతోందన్నది అఖిలపక్ష నాయకుల ఆరోపణ. ఇందులో పాత అసెస్‌మెంట్ల ప్రకారం 570 కుటుంబాలు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 900కు చేరుకుంది. ఈ గ్రామాన్ని ఇక్కడి నుంచి తరలించాలని కోరుతూ చాలా కాలంగా అఖిలపక్షం ఆందోళన చేస్తోంది. 2008లో ప్రభుత్వం స్పందించి పెదముషిరివాడ గ్రామంలోని సుమారు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించి, వీరిని అక్కడికి తరలించాలని సూచించింది. ఇది కార్యరూపం దాల్చలేదు. తాడి గ్రామాన్ని తరలించాలంటే 2007లో అంచనాల ప్రకారం 100 కోట్ల రూపాయలు కావల్సి ఉంటుంది. ఇప్పుడు అది 250 కోట్ల వరకూ చేరుకుంది.
వివాదం ఇలా కొనసాగుతుండగా, ఫార్మాసిటీ గ్రీన్ బెల్ట్ అంశం తెరమీదకు వచ్చింది. గ్రీన్ బెల్ట్‌ను ఫార్మాసిటీ బౌండరీలో నిర్మించాలా? లేక బౌండరీకి అవతల 500 మీటర్ల పరిధిలో ఏర్పాటు చేయాలా? అన్నది ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. ఈ కేటాయింపులపైనే అప్పటి వుడా వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి సిబిఐకి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఒకవేళ ఫార్మా బౌండరీకి అవతల గ్రీన్ బెల్ట్ నిర్మించాల్సి వస్తే, రాంకీ మరో 400 నుంచి 500 ఎకరాలను సేకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు తాడి గ్రామం కూడా ఆ 500 మీటర్ల పరిధిలోకే వస్తుంది. రాంకీ యాజమాన్యం ఆ స్థలాన్ని సేకరించడానికి ముందుకు రాలేదు. ప్రస్తుతం ఉన్న తాడి గ్రామాన్ని తరలించే బాధ్యతను చేపట్టాలంటూ ఎపిఐఐసి 2007లోనే రాంకీ యాజమాన్యానికి లేఖ రాసింది. ఇందుకు అప్పట్లో 67 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. అంత మొత్తాన్ని వెచ్చించేందుకు రాంకీ ముందుకు రాలేదు. 2012 లెక్కల ప్రకారం ఈ భూమిని సేకరించి, ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చి గ్రామాన్ని తరలించాలంటే 250 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇంత మొత్తాన్ని రాంకీ భరించేందుకు సిద్ధంగా లేదు. ఎపిఐఐసి కూడా దీనిపై మోనం వహించడంతో వివాదం ముదిరింది.
ఇప్పటివరకూ ఈ విషయమై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఇప్పుడు టిడిపి ఒంటరిగానే ఈ ఉద్యమాన్ని నడపాలని నిర్ణయానికి వచ్చింది. ఈనెల 9వ తేదీ నుంచి బండారు సత్యనారాయణ మూర్తి ఆమరణ దీక్షకు దిగాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బండారు  సక్సెస్ న్యూస్ తో మాట్లాడుతూ ఈ విషయంలో ఎవరేం చెప్పినా గ్రామస్థులకు న్యాయం జరిగే వరకూ తాను వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. తాడి గ్రామాన్ని తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూమిని సేకరించి, తరువాత ఎందుకు మోనంగా ఉండిపోయిందని ప్రశ్నించారు.

రోజురోజుకూ ఈ వివాదం ముదురుతుండడంతో జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్ జోక్యం చేసుకున్నారు. ఎపిఐఐసి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సత్యనారాయణను, జెడ్.ఎం. యతిరాజును, ఇజెడ్‌ఎం ప్రసాద్‌ను, కాలుష్య నియంత్రణ మండలి ఇ.ఇ. మహ్మద్ అలీఖాన్‌ను, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయసారథిని తహశీల్దార్ పాండురంగారెడ్డిని ఫార్మాసిటీకి పంపించారు. రాంకీ సిఇఓ లాల్‌కృష్ణ, కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ జిఎం వీరారెడ్డి, రాంకీ ఎజిఎం ప్రకాష్‌రెడ్డితో అధికారుల బృందం పలు అంశాలపై చర్చలు జరిపింది. తాడి గ్రామానికి కాలుష్య సమస్య లేదన్నది రాంకీ వాదన. వివాదం మరింత జఠిలం కాకుండా చూడాల్సిందిగా అధికారుల బృందం సూచించినట్టు తెలుస్తుంది,

No comments:

Post a Comment