Friday, July 6, 2012

సీబీఐ జేడీ ఉంటారా? ఊడతారా!!?


రాష్ట్రంలో ఇప్పుడంతా కేసుల హవా నడుస్తోంది. పలువురు ప్రముఖులు విచారణ ఎదుర్కుంటుండటం, కొందరు జైళ్ళలో ఉండటం లాంటి వాటి నేపథ్యంలో వాటన్నిటికీ కీలక సూత్రధారి అయిన సీబీఐ జేడీ వీవీ లక్ష్మీనారాయణపై అందరి దృష్టీ పడింది. ఆయన పదవీకాలం గతనెలతోనే పూర్తి కావటంతో లక్ష్మీనారాయణను కొనసాగిస్తారా లేక వెనక్కి పంపుతారా అనే చర్చ జరుగుతోంది. జగన్‌ ఆస్తుల కేసు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ఓబుళాపురం మైనింగ్‌ లాంటి అత్యంత కీలక మైన కేసుల నిగ్గు దేల్చే బాధ్యతను లక్ష్మీనారాయణ తీసుకున్నారు. 

వాటి విచారణ, ఆధారాల సేకరణ, చార్జిషీట్ల నమోదు వంటి కీలక పరిణామాలన్నీ సాగుతు న్నాయి. వైకాపా అధ్యక్షుడు జగన్‌, ఐఏఎస్‌ అధికారులు బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ లాంటి వారం తా చంచల్‌ గుడా జైలులో ఉన్నారు. ఈ కేసులు ఎంతకాలం కొనసాగుతాయో తెలియని స్థితి. ఇదే సమయంలో దీనికి రాజకీయ రంగు కూడా అలుముకుంటున్నది. ఒకవేళ లక్ష్మీనారాయణను మరో ఏడాది పాటు కొనసాగిస్తే తమపై కాంగ్రెస్‌ కక్ష సాధింపు నిజమే అని తేలిపోయిందంటూ జగన్‌ పార్టీ ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్టవుతుంది. వెనక్కి పంపించినా కష్టమే. జగన్‌ వర్గం చేసిన ఒత్తిడికి తలొగ్గారన్న అపప్రథను కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ నాయకత్వం ఎదుర్కోవలసి ఉంటుంది. 

దానితో పాటు ఎప్పటికైనా కాంగ్రెస్‌తో జగన్‌ కుమ్మక్కు అవుతారని తాము చెబుతున్న మాటలు నిజమయ్యాయంటూ విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తారా లేక వెనక్కి తిప్పి పంపుతారా అనేది ఆసక్తికర పరిణామంగా మారింది. లక్ష్మీనారాయణ ను 2006 జూన్‌లో డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి పంపించారు. అది ముగిసిన తర్వాత మరో ఏడాది పాటు  పొడిగించారు. ఇంతలోనే ఈ కేసులన్నీ వెలుగులోకి వచ్చాయి. వాటిని నిగ్గుదేల్చే పని లక్ష్మీనారాయణ సారథ్యంలో సాగుతోంది. కేసులు నడి మధ్యలో ఉండగా ఆయన డిప్యుటేషన్‌ గడువు పూర్తి కావటంతో దాని పొడిగింపుపై ఆసక్తి ఏర్పడింది. సీబీఐ మాన్యువల్‌ ప్రకారం అధికారి ఎంత సమర్థుడైనా డిప్యుటేషన్‌ను  రెండవసారి పొడిగించటం కుదరదు. అదీగాక ప్రతిష్ఠాత్మకమైన ఈ పదవిని దక్కించుకు నేందుకు ఇప్పటినుంచే పలువురు ఐపీఎస్‌ ఆఫీసర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

లక్ష్మీనారాయణ పదవీ కాలం ముగిసిపోయినందున ఆయనను వెనక్కి పిలిపించాలని వైకాపా గత కొంత కాలంగా డిమాండ్‌ చేస్తోంది. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ నాయకత్వంలో ఢిల్లీ వెళ్ళిన బృందం బుధవారం ప్రధానమంత్రిని కలిసి ఈ డిమాండ్‌నే ముందు పెట్టింది. శరద్‌ యాదవ్‌, ఏబీ బర్దన్‌, శరద్‌పవార్‌ లాంటి వారినీ, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ ను కలిసినప్పుడూ ఈ మాటలే చెప్పింది. ఇంతటి ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో లక్ష్మీనారాయణ పదవీకాలాన్ని పొడిగిస్తే వైకాపా నాయకులు కాంగ్రెస్‌ నాయకత్వంపై విమర్శల దూకుడు మరింత పెం చుతారు. ఒక రకంగా కాంగ్రెస్‌ నాయకత్వానికి ఇది ఇబ్బందికర పరిణామమే.

No comments:

Post a Comment