Thursday, July 12, 2012

టీడీపీ నేత బండారు ఆమరణ నిరాహార దీక్ష......


టీడీపీ నేత బండారు ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా బుధవారం నిర్వహించిన ఫార్మాసిటీ బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. తాడి గ్రామాన్ని తరలించాలని... ముత్యాలమ్మపాలెం మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్న డిమాండ్లకు అధికారులు స్పందించకపోవడంపై ఆందోళనకారులు మండిపడ్డారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. తెరిచిన పరిశ్రమలపై దాడులు చేశారు. కార్మికులు హాజరుకాకుండా అడ్డుకున్నారు. మరోవైపు రాంకీ ప్రతినిధులు, పరిశ్రమల యాజమాన్యాలతో ఆర్డీవో వరదరాజులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 




















రాంకీ ఫార్మా సిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలించాలని, ముత్యాలమ్మపాలెం మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బండారు దీక్ష చేపట్టి మూడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో తెల్లవారుజామున ఐదు గంటల నుంచే తాడి, ముత్యాలమ్మపాలెం గ్రామస్థులు కర్రలు పట్టుకుని శిబిరం వద్దకు చేరుకున్నారు. ఫార్మాసిటీకి రాకపోకలు జరిగే రహదారులను పూర్తిగా స్తంభింపజేశారు. కార్మికులతోపాటు ఫార్మా ఉద్యోగులెవ్వరినీ విధులకు వెళ్లనీయలేదు. అలాగే వివిధ పనుల నిమిత్తం అటుగా వెళ్లే వారిని సైతం వెనక్కి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో తమను నిలుపు చేయడాన్ని కొందరు ద్విచక్ర వాహనదారులు ప్రశ్నించడంతో వారిపైకి దూసుకువెళ్లారు. దీంతో కొన్నిసార్లు స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అక్కడే వున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి వాహనదారులను అక్కడి నుంచి వెనక్కి పంపించేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు ఇదేపరిస్థితి కొనసాగింది. కొన్ని ఫార్మా కంపెనీల్లో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారన్న సమాచారం మేరకు మత్స్యకారులంతా ఆయా కంపెనీలపై కర్రలతో దాడులు చేశారు. ఈ క్రమంలో ఓ కంపెనీకి చెందిన పూల కుండీలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న గాజువాక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అప్పలరాజు తన సిబ్బందితో అక్కడకు చేరుకొని ఆందోళనకారులను అక్కడ నుంచి పంపివేశారు. కాగా, సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మత్స్యకార మహిళలంతా రాంకీ గేటును దాటి లోపలకు దూసుకొని పోయేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీక్షలో కూర్చున్న ముత్యాలమ్మపాలెం మాజీ సర్పంచ్ ముత్యాలు శిబిరం నుంచి కిందకు దిగి ఆందోళనకారులకు సర్దిచెప్పడంతో శాంతించారు. నీరసించిన బండారు ఆరోగ్యం బండారు ఆమరణ నిరాహార దీక్ష బుధవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. బండారు బాగా నీరశించిపోయారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు, రాత్రి 7.30 గంటలకు వైద్యులు రత్నకుమార్, రాజన్నలు పరీక్షలు నిర్వహించారు. బీపీ తగ్గడంతోపాటు, షుగర్ లెవెల్స్ ఎక్కువగా వున్నాయని, దీనిప్రభావం ఆరోగ్యంపై పడుతుందని వైద్యులు తెలిపారు. తక్షణమే బండారుకు ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి వుందన్నారు. దీనికి బండారు ససేమిరా అన్నారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా బండారు తనదైన శైలిలో మత్స్యకారులనుద్దేశించి మాట్లాడుతూ చైతన్యపరిచారు. ఇదిలావుండగా బండారు ఆరోగ్యం పట్ల పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. దీక్ష ప్రారంభించి ఇప్పటికే మూడు రోజులు గడవడంతో ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీక్షకు పలువురు సంఘీభావం బండారు చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షా శిబిరాన్ని పలువురు సందర్శించి, సంఘీభావం తెలిపారు. అనకాపల్లికి చెందిన దాడి రత్నాకర్, జీవీఎంసీ 55వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పాల అచ్చిలనాయుడు, వాసుపల్లి గణేశ్‌కుమార్, భరణికాన రామారావు, హర్షవర్దన్, మాజీ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, లేళ్ల కోటేశ్వరరావు, ప్రసాదుల శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ పప్పు రాజారావు, బీసీ ర్రాష్ట కార్యదర్శి మూర్తియాదవ్, తదితరులు బండారుకు మద్దతును తెలియజేశారు. బండారు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఫార్మా కంపెనీల్లో నిలిచిన ఉత్పత్తి మత్స్యకారుల ఆందోళనలో భాగంగా బుధవారం ఫార్మాసిటీలోని పలు కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులను విధుల్లోకి వెళ్లనివ్వలేదు. దీంతో పలు కంపెనీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. గతంలో ధర్నాలు జరిగినప్పటికీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ఇలాంటి చర్యల వలన ప్రమాదాలు కూడా జరగవచ్చని కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు.

No comments:

Post a Comment