Wednesday, July 4, 2012

ఇక కొత్త ఏపీపీఎస్సీ


యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యుపిఎస్‌సి) తరహాలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఎపిపిఎస్‌సి)ను తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో ఇప్పటికే మూడు కమిటీలను వేసిన ప్రభుత్వం అందుకు అనుగుణమైన కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ సిసిఎల్‌ఎగా ఉన్నపుడు ఆమె అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సిఫార్సులపై ప్రభుత్వం దృష్టి సారించింది. సిఫార్సులపై మరింత అధ్యయనం చేసి పది పదిహేను రోజుల్లో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించింది. దాని ప్రకారం ఇక మీదట రాష్ట్రంలో గ్రూప్-1బి క్యాడర్ ఏర్పాటవుతుంది. గతంలో వీటిని గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులుగా వ్యవహరించేవారు. వాటిని గ్రూప్-1బి కిందకు తీసుకొస్తారు. గ్రూప్-2లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు యథాతథంగా కొనసాగుతాయి. ప్రతి ఏటా సెప్టెంబర్ 30నాటికి వివిధ శాఖల్లోని పోస్టులను గుర్తించడం, మార్చి 31నాటికి షెడ్యూలు ప్రకటించడం, షెడ్యూలు ప్రకారం ఏటా రిక్రూట్‌మెంట్ నిర్వహించడం సంస్కరణల్లో ప్రధాన భాగంగా ఉంటాయి. ఇంటర్వ్యూల్లోనూ, లిఖిత పరీక్షల నిర్వహణలోనూ పలు మార్పులు తీసుకొస్తున్నారు. ఎపిపిఎస్‌సి పనితీరు- సంస్కరణలపై ఏర్పాటు చేసిన కమిటీ సమర్పించిన నివేదికపై మంగళవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. విస్తృతంగా చర్చించిన మీదట నివేదికపై మరింత అధ్యయనం చేసి వీలైనంత తొందరలో తగిన నిర్ణయాలు తీసుకోవాలని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యును ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఎపిపిఎస్‌సి చైర్మన్ రేచల్ ఛటర్జీ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్, సర్వీసు సెక్రటరీ బి వెంకటేశ్వరరావు, న్యాయశాఖ కార్యదర్శి ఆర్ దామోదర్‌లు పాల్గొన్నారు.
కొత్తగా తీసుకొచ్చే గ్రూప్-1బి క్యాడర్‌లోకి మున్సిపల్ కమిషనర్లు, ఎసిటిఓలు, డిప్యూటీ తహసీల్దార్‌లు, సహకార శాఖ సబ్ రిజిస్ట్రార్‌లు, సహాయ కార్మిక శాఖ
అధికారులు, పంచాయతీరాజ్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు, ఎక్సైజ్ సబ్ ఇనస్పెక్టర్లు వస్తారు. అయితే గ్రూప్-1కు, గ్రూప్-1బి సర్వీసులకు కామన్ పరీక్ష నిర్వహిస్తారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకుడు, చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అధికారి, పరిశ్రమల శాఖ సహాయ సంచాలకుడు, పోలీసు కమ్యూనికేషన్స్ డిఎస్పీ, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల్లో మైనింగ్ ఇంజనీరింగ్ సెక్షన్ హెడ్‌లు, పోలీసు సర్వీసులో తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ రిపోర్టర్లు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి, సహాయ గిరిజన సంక్షేమ అధికారి, సహాయ వెనుకబతడిన తరగతుల సంక్షేమ ాధికారి, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో సహాయ లెక్చరర్లు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో లెకర్చర్ల పోస్టులకు సైతం ఇక మీదట ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో ఉన్నా, ఎగ్జిక్యూటివ్ తరహా పోస్టులకూ ఇక మీదట ఇంటర్వ్యూలు నిర్వహించాలనేది మరో ప్రతిపాదన. వీటిలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, ఎపిఆర్‌ఓ, మహిళా సంక్షేమ శాఖ సూపర్ వైజర్లు, చిల్ట్రన్ హోమ్ సూపరింటెండెంట్ తదితర పోస్టులు ఉంటాయి. మిగతా పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవు. అన్నీ రాత పరీక్ష ఆధారంగానే జరుగుతాయి. కొత్తగా సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఇండియన్ మెడిసిన్‌లో మెడికల్ ఆఫీసర్లు, వెటర్నరీ అసిస్టెంట్లు, వ్యవసాయాధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు పోస్టులను కూడా ఎపిపిఎస్‌సి పరిధిలోకి తెస్తారు. డైరెక్టు రిక్రూట్‌మెంట్‌కు అవసరమయ్యే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ప్రతి ఏటా రిక్రూట్‌మెంట్ జరిగేలా ప్రణాళిక ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికోసం క్యాలండర్ ఆఫ్ రిక్రూట్‌మెంట్‌ను ప్రతి ఏడాది మార్చి 31నాటికి ఎపిపిఎస్‌సి ఆమోదిస్తుంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏర్పడబోయే ఖాళీల జాబితాతో నవంబర్ 30 నాటికి ఆయా శాఖలు సర్వీసు కమిషన్‌కు అందజేయాల్సి ఉంటుంది.
డైరెక్టు రిక్రూటీస్ ప్రమోషన్ల విషయంలో నిబంధనలకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ, రోస్టర్ పాయింట్లు పాటిస్తున్నదీ లేనిదీ వంటి అంశాల పరిశీలనకు వీలుగా ముసాయిదా డిపిసి ప్రతిపాదనలను ఆయా శాఖలు సర్వీసు కమిషన్‌కు అందిస్తాయి. ఎపిపిఎస్‌సి రిక్రూట్‌మెంట్స్‌కు ఇప్పటికే అమలులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, వికలాంగ ఉద్యోగాలకు ఇచ్చిన వయోపరిమితి సడలింపునకు అదనంగా సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంకా అదనపు వయస్సు మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా కమిటీ అభిప్రాయపడింది.
ఎపిపిఎస్‌సి నిర్వహించే రాత పరీక్షలకు అభ్యర్థులు ఎన్నిసార్లు హాజరుకావచ్చనే అంశంపై యుపిఎస్‌సి నిబంధనలను అధ్యయనం చేయాలని నిర్ణయించారు. సర్వీసు కమిషన్ రిక్రూట్‌మెంట్‌లకు అవసరమైన నిధులను విడుదల చేయడానికి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అంగీకరించారు. సర్వీసు కమిషన్ రిక్రూట్‌మెంట్‌లను మరింత మెరుగుపర్చడానికి, వేగవంతం చేయడానికి కొత్తగా కంప్యూటర్ సెల్‌ను ఏర్పాటు చేస్తారు.
ఇంటర్వ్యూ బోర్డుల ఏర్పాటుకు సంబంధించి కమిషన్ చైర్మన్, ఇద్దరు సభ్యులతో సబ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ప్రతి ఇంటర్వ్యూ బోర్డులో ఒకరు లేదా ఎక్కువమంది సబ్జెక్టు నిపుణులను నియమించే అధికారం చైర్మన్ /సబ్‌కమిటీ ఆమోదించిన ఒక ప్యానల్ /శాఖాధిపతులకు ఉంటుంది. ఇంటర్య్వూ మార్కులను ఇచ్చే విధానంపై కూడా ఈ సబ్ కమిటీ కమిషన్‌కు సలహా ఇస్తుంది.
ఎపిపిఎస్‌సి పనితీరు -సంస్కరణలపై సిఫార్సు చేయడానికి అప్పటి సిసిఎల్‌ఎ మిన్నీ మాథ్యూ అధ్యక్షతన కమిటీని గతంలోనే వేశారు. దీనిలో సభ్యులుగా పివి రమేష్,సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ జిఎన్ ఫణికుమార్,  సర్వీసు కమిషన్ కార్యదర్శి పూనం మాలకొండయ్య, దామోదర్‌, వెంకటేశ్వరావు లు ఉన్నారు.

No comments:

Post a Comment