Thursday, May 26, 2011

త్వరలో పంచాయితీరాజ్‌ ఎన్నికలు


త్వరలో పంచాయితీరాజ్‌ ఎన్నికలు

* జూలైతో ముగుస్తున్న కాలవ్యవధి 
* సర్కార్‌కు ఈసీ లేఖ 
* ఎన్నికలు నిర్వహించకుంటే రాజ్యాంగ సంక్షోభమే ! 
* అభ్యర్థుల కోసం పార్టీల వేట 
పంచాయితీ రాజ్‌ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. జూలైతో ప్రస్తుత పాలకవర్గాల కాలవ్యవధి ముగుస్తుండటంతో ఎలక్షన్లకు ఈసీ రెడీ అవుతోంది. ఈ విషయంలో సర్కార్‌ సత్వరమే నిర్ణయం తీసుకోవాలంటూ లేఖరాసింది. కాలయాపన చేస్తే రాజ్యాంగ సంక్షోభం తప్పదంటూ హెచ్చరించింది. పల్లెల్లో సందడి మొదలవ్వబోతోంది. త్వరలో పంచాయితీరాజ్‌ ఎన్నికల నగారా మోగబోతోంది. ఐదేళ్ళకొకసారి వచ్చే ఈ సండగ కోసం పార్టీలన్నీ రెడీ అయిపోతున్నాయి. 
జూలై 21తో కాలవ్యవధి పూర్తవుతుండటంతో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందంటూ హెచ్చరించింది. అటు గవర్నర్‌కు సైతం ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలంటూ సూచించింది ఈసీ. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేయాలనుకున్న ప్రభుత్వానికి మాత్రం ఇది శరాఘాతంగా తగిలింది. 
కాలపరిమితి ముగియగానే ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రిజర్వేషన్లను సైతం రెండు వారల్లో ప్రకటించాలని ఈసీ, రాష్ట్రప్రభుత్వానికి లేఖరాసింది. మునిసిపల్‌ చట్టంలోని లొసుగులను అడ్డంపెట్టుకొని ఏడాది కాలంగా పురపాలక సంఘ ఎన్నికలను వాయిదా వేసి స్పెషలాఫీర్ల పాలనలో కొనసాగిస్తుంది. పంచాయితీ రాజ్‌ చట్టంలో అలాంటి వెసులుబాటు లేకపోవడంతో ఎన్నికల నిర్వహణ అనివార్యం కానుంది. 
ఒకవేళ సర్కార్‌ జాప్యం చేస్తే హైకోర్టుకెళ్ళేందుకు కూడా ఈసీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. జూన్‌ మొదటి వారంలోగా రిజర్వేషన్ల ప్రక్రియ ముగిస్తే జూన్‌ 11 - 13 తేదీల మధ్య నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 21 నాటికి జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లకు కార్యవర్గాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. మొత్తం ఎన్నికలు, పరోక్షంగా అధ్యక్షులుగా ఎన్నుకోవడానికి మొత్తం 27 రోజుల సమయం పడుతుంది. 
ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అలసత్వం వహిస్తే పంచాయితీ రాజ్‌ సంస్థల్లో పాలన స్థంభించి రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. సర్కార్‌ ఈ ఎన్నికల విషయంలో త్వరిత గతిన మేల్కొంటే జూలైలో రాష్ట్రమంతా ఎన్నికల సందడి కనిపించనుంది. 

No comments:

Post a Comment