Monday, May 16, 2011

రైతుల సమ్యసల గురించి చర్చించటం ద్వారా ,,,వ్యూహం మార్చిన ,,,చిరు,,,


 రైతుల సమ్యసల గురించి చర్చించటం ద్వారా ,,,వ్యూహం మార్చిన ,,,చిరు,,,

 కాంగ్రెస్ అధినాయకత్వంతో విలీనం ప్రక్రియ గురించి చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పనిలో పనిగా రైతుల సమస్యలపై దృష్టి కేంద్రీకరించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత చంద్రబాబునాయుడు వచ్చే వారం రైతుల సమస్యలపై చేపట్టనున్న ధర్నా కార్యక్రమానికి ప్రతిగా ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మతో రైతుల సమస్యల గురించి చర్చించటం ద్వారా తనదే పైచే అనిపించుకోవాలనుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌తో విలీనం ప్రక్రియ గురించి చర్చలు జరిపిన అనంతరం బుధవారం సాయంత్రం రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు తిరుగుప్రయాణమైన చిరంజీవి అకస్మాత్తుగా తన పర్యటనను ఒక రోజు వాయిదా వేసుకున్నారు. చంద్రబాబునాయుడు, జగన్‌మోహన్ రెడ్డి రైతుల సమస్యలపై వచ్చే వారం గుంటూరు తదితర ప్రాంతాల్లో ధర్నా, ఇతర కార్యక్రమాలు చేపడుతున్నందున అంతకు ముందే తాను కేంద్ర మంత్రులతో రైతుల సమ్యసల గురించి చర్చించటం ద్వారా ప్రజారాజ్యం చిత్తశుద్ధిని చాటుకోవాలని పథకం వేసారు. అందుకే చిరంజీవి, విధాన మండలి సభ్యుడు సి.రామచంద్రయ్య, శాసన సభ్యుడు గంటా శ్రీనివాస్‌లను వెంట తీసుకొని గురువారం వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్‌శర్మలను కలుసుకొని రైతుల సమస్యల గురించి వివరించనున్నారు. రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు ముఖ్యంగా ఇటీవల కురిసిన వర్షాల మూలంగా రైతులకు జరిగిన నష్టంపై శరద్‌పవార్‌కు ఒక వినతిపత్రం సమర్పించనున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయాలని కోరనున్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల మూలంగా రైతులు పండించిన ధాన్యం పెద్ద మొత్తంలో పాడైపోయిందనీ, ఈ ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చిరంజీవి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌ను కోరనున్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇప్పించాలనీ, ధాన్యం తదితర పంటలను నిల్వ చేసుకునేందుకు అదనపు గిడ్డంగులు నిర్మించాలని కోరనున్నారు.ఆయన ఆనంద్‌శర్మను కూడా కలుసుకుని పొగాకు రైతుల సమస్యల గురించి వివరించనున్నారు. పొగాకు బోర్డు నిర్థారించిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో పొగాకు పండించిన వారిపై పెనాల్టీ విధించకూడదని కూడా చిరంజీవి కేంద్ర వాణిజ్య మంత్రిని కోరనున్నారు. కేంద్రం వద్ద ఉన్న పెనాల్టీకి సంబంధించిన నిధి నుండి పొగాకు రైతులకు రుణాలు ఇప్పించాలని చిరంజీవి డిమాండ్ చేస్తారు. పొగాకు వేలం పాటల విషయంలో కర్నాటక, ఆంధ్ర రైతుల మధ్య చూపుతున్న వివక్షను తొలగించాలని కోరనున్నారు.

No comments:

Post a Comment