Tuesday, May 24, 2011

దొంగల కాల్పుల్లో ఇద్దరు మృతి






దొంగల కాల్పుల్లో ఇద్దరు మృతి
విశాఖపట్నం: దొంగతనానికి వచ్చిన దొంగలు ఇంటి యజమానులపై కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని అగనంపూడిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. 
ప్రముఖ పారిశ్రామిక ప్రాంతం. ప్రశాంత వాతావరణానికి నిలయం. అలాంటి గాజువాక మంగళవారం రాత్రి ఉలిక్కిపడింది. శివారు ప్రాంతమైన అగనంపూడిలో తూటాల వర్షం కురిసింది. ఇద్దరు దుండగులు తుపాకులతో ఇంట్లో చొరబడ్డారు. ఒక రియల్టర్, అతని కుమారుడిని కాల్చిపారేశారు. గతంలో ఇలాంటి సంఘటనలు గాజువాక ప్రాంతంలో జరిగిన దాఖలాల్లేవు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడటం ఈ ప్రాంతీయుల్ని కలవరపరుస్తోంది. రియల్ ఎస్టేట్ మాఫియా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలివి.


 తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన వాసర్ల సాయిబాబా (43) గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఎనిమిదేళ్ల క్రితం అగనంపూడికి కుటుంబంతో తరలివచ్చాడు. ఇక్కడి బొర్రమాంబ ఆలయ సమీపంలోని దిబ్బపాలెంలో స్థిరపడ్డాడు. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల వెనుక తిరిగేవాడు. నాలుగేళ్లుగా ఖాళీగా ఉంటున్నాడు. సాయిబాబా కుమారుడు పవన్ నరేష్ (23) గాజువాక ఆటోనగర్‌లోని ఒక ప్రయివేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. చిన్నకుమారుడు సురేష్ (20) హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. 


మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు తలుపుతట్టి బలవంతంగా లోపలికి ప్రవేశించారు. తాము చోరీ కోసం వచ్చామని... ఇంట్లోని నగదు, ఆభరణాలన్నీ ఇచ్చేయాలని గదమాయించారు. మూడు పిస్తోళ్లతో బెదిరించారు. ఈ హఠాత్ పరిణామానికి సాయిబాబా కుటుంబసభ్యులు బెంబేలెత్తిపోయారు. తమ వద్ద చెవిదుద్దులు మాత్రమే ఉన్నాయని చెప్పగా దుండగులు కేకలు వేస్తూ కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో సాయిబాబా అక్కడికక్కడే మృతి చెందాడు. నరేష్‌ను అగనంపూడి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అక్కడే ఉన్న సాయిబాబా తోడల్లుని కుమారుడు మట్టపర్తి దినేష్ తలపై కూడా దుండగులు కుట్టుమిషన్ కత్తెరతో మోదడంతో గాయపడ్డాడు. 


ఈ దాడితో మృతుని భార్య కమలమ్మ తేరుకోలేకపోతోంది. జీవితాంతం తోడుండాల్సిన భర్త, చేతికందిన పెద్ద కొడుకు కన్నుమూయడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అగనంపూడిలోనే సాయిబాబా తోడల్లుడు రసాయనాల వ్యాపారం చేస్తున్నాడు. మృతునికి స్వగ్రామంలో పాత తగాదాలున్నట్టు సమాచారం. ఈ హత్యకు కారణం భూ తగాదాలా?, పాతకక్షలా అన్నది తేలాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని నగర పోలీస్ కమిషనర్ పూర్ణచంద్రరావు, క్రైమ్ ఏసీపీ బి.పి.తిరుపాలు, సీఐలు దేవప్రసాద్, చంద్రశేఖర్ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించాయి. 



పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తయితే తప్ప దీనిపై ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. అగనంపూడి టోల్‌ప్లాజావద్ద 30 మంది పోలీసు సిబ్బంది, కూర్మన్నపాలెం కూడలి వద్ద మరో 30 మందితో పికెట్లు ఏర్పాటు చేసి వాహనాలను పకడ్బందీగా తనిఖీ చేస్తున్నారు.

No comments:

Post a Comment