నేడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి 64వ జన్మదినం. శుక్రవారం పాదయాత్రలో 200రోజులు పూర్తి చేసుకున్న బాబు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలుగు తమ్ముళ్లు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజల మధ్యే బాబు జన్మదినం జరుపుకుంటారని భావించినా ఢిల్లీలో చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటనతో కలత చెందిన ఆయన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
అదే ఉత్సాహం. అదే గుండె నిబ్బరం. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇంకా ఏదో చేయాలన్న తపన. 63ఏళ్లు పూర్తి చేసుకుని 64వ ఏట అడుగు పెడుతున్నా నవయువకునిలా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం అధినేతగా, పార్టీ సారథిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఇప్పుడు పాదయాత్ర బాటసారిగా బహుముఖ పాత్ర పోషిస్తున్నారు నారా వారు వినూత్న పథకాలతో, ప్రజాకర్షక కార్యక్రమాలతో రాష్ట్రంలో ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుది. దేశ, విదేశాల్లో మన రాష్ట్ర కీర్తి పతాకను రెపరెపలాడించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి బలమైన కార్యకర్తల శక్తిని అందించడానికి విశేష కృషి చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని నారావారిపల్లెలో 1950, ఏప్రిల్ 20న ఖర్జూరనాయుడు, అమ్మాణమ్మ దంపతులకు జన్మించారు చంద్రబాబు.
వ్యవసాయ ఆధారిత కుటుంబంలో పుట్టినా ఉన్నత చదువులు చదివారు. నారావారిపల్లె చిన్న పల్లెటూరు. పాఠశాల లేదు. అందుకే పక్కనే ఉన్న శేషాపురంలో ప్రాథమిక విద్యను, ఆ తర్వాత తిరుపతి ఎస్ వీ యూనివర్శీటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలతో ఉండే చంద్రబాబు చదువుకొనే రోజుల్లోనే నారావారి పల్లెలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి జన్మభూమి పథకానికి బాటలు వేశారు.
1972లో గ్రామ యువకుల సాయంతో ఐదు కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించి శ్రమదానానికి బీజం వేశారు. విద్యార్థి నాయకుడి ఉన్న రోజుల్లోనే 1978లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంజయ్య మంత్రివర్గంలో మంత్రిపదవి చేపట్టారు. మంత్రిగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత కూడా చంద్రబాబు కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఒకదశలో అధిష్టానం అవకాశమిస్తే తన మామ ఎన్టీఆర్ పైనే పోటీ చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో తెలుగుదేశంలో చేరారు.
1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఎన్టీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు నాదెండ్ల భాస్కరరావు శిబిరానికి వెళ్లకుండా చంద్రబాబు కీలక పాత్ర పోషించి ఎన్టీఆర్ దృష్టిని ఆకర్షించారు. పార్టీ శ్రేణులకు శిక్షణతో పాటు పార్టీ నిర్మాణంలోనూ బాబుదే ముఖ్యభూమిక అంటారు నేతలు.
1994లో ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ మరోసారి అధికారం చేజిక్కించుకుంది. ఏడాదయ్యాక పార్టీ, పాలనా వ్యవహారాల్లో లక్ష్మిపార్వతీ జోక్యం పట్ల నాయకుల్లో నిరసన వ్యక్తమైంది. తర్వాత 1995లో చంద్రబాబు అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త శకం ప్రారంభమైంది.
ముఖ్యమంత్రిగా జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, శ్రమదానం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రపంచబ్యాంకు ఒప్పందం మేరకు సంస్కరణలకు బీజం వేశారు. సాంకేతిక విప్లవానికి ఆద్యుడిగా నిలిచారు. హైటెక్ ముఖ్యమంత్రిగా పేరొందారు. హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ ఇంతలా అభివృద్ధి చెందడానికి చంద్రబాబే కారణంగా చెబుతారు ఐటీ నిపుణులు. దీంతో పాటు మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్ ను, నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ లను రాష్ట్రానికి రప్పించారు. మొత్తంగా పరిపాలనలో తనదైన ముద్ర వేశారు.
తన హయాంలో మావోయిస్టుల పట్ల కఠినంగా వ్యవహరించారు చంద్రబాబు. దీంతో తిరుపతి పర్యటనలో ఉన్న బాబుపై 2003లో మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారాయన. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో 2004 అధికారానికి దూరమయ్యారు. 2009ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. రెండుసార్లు అధికారానికి దూరమైనా పార్టీని పటిష్టంగా నిలపడంతో బాబు కృషిని విస్మరించలేమంటారు నేతలు.
ప్రజలు కష్టాల్లో ఉన్నారంటూ వారి సుఖదుఖాలను తెలుసుకునేందుకు ఆరునెలల నుంచి పాదయాత్ర చేస్తున్నారు. పార్టీ కార్యకలాపాలకు, కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రజలతో మమేకం అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2749కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పార్టీ ఆటుపోట్లను సునాయాసంగా ఎదుర్కోవడంలో, సంక్షోభాలను పరిష్కరించడంలో బాబుది అందెవేసిన చేయి అంటూ ప్రశంసిస్తారు తమ్ముళ్లు.
మొత్తంగా అధికారంలో ఉన్న కాలంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు 9ఏళ్ళకు పైగా విపక్షంలోనే ఉన్నారు. పార్టీని, నేతలను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. అయితే టీడీపీని లక్ష్యంగా చేసుకొని రాజకీయ ప్రత్యర్థుల వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో చంద్రబాబు అనుకున్న ఫలితాలు సాధించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఏమైనా బాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో పలు రకాల కార్యక్రమాల చేపట్టేందుకు పార్టీ సమాయత్తమవుతుంది. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
No comments:
Post a Comment