Thursday, November 24, 2016

నోట్లరద్దు విమర్శల పాలవుతుందా...!!?


ప్రజల సొమ్ము జాతీయం చేస్తారా? టైమ్స్‌ ప్రశ్న, విజయం సాధించామంటున్నారా? చీప్‌ జస్టిస్‌ ఠాగూర్‌ పార్లమెంటులో ప్రతిపక్షాల సమిష్టి సమరం సంగతి అటుంచితే మోడీ ప్రభుత్వం నోట్లరద్దు నిర్ణయంపై విపరీతమైన విమర్శల పాలవుతున్నది. ఇందాకటి పోస్టులో వ్యాఖ్యానించినట్టు అగ్ర తెలుగు పత్రిక మినహాయిస్తే మిగిలినవన్నీ విమర్శనాత్మక వైఖరినే తీసుకున్నాయి. బుధవారం(23వ తేదీ) టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సంపాదకీయం చాలా సూటిగా ప్రభుత్వ చర్యను తప్పు పట్టింది. నల్లడబ్బును అంటుకునే చర్యలు తీసుకున్నది లేదు గాని ప్రజల సొమ్మును జాతీయం చేసినట్టు కనిపిస్తుందని ఆ పత్రిక రాసింది. తన రాజకీయ స్వభావాన్ని బట్టి ఇది 1990లకు ముందున్న సరళీకరణ పూర్వపు దశలోకి తీసుకువెళ్లినట్టు కనిపిస్తుందని కూడా రాసింది. ప్రజాపక్ష ఆర్థిక వేత్త ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌ కూడా మరో కోణంలో ఇలాటి ప్రశ్నే వేశారు. మీరు ఇంతకాలం చెప్పిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, ఓపెనింగ్‌ లన్నీ ఏమైపోయాయి?సామాన్యులపై సర్జికల్‌ స్ట్రయిక్‌ ఎందుకు? హిందూస్తాన్‌ టైమ్స్‌ కూడా నోట్లరద్దు వల్ల అనుకున్న ఫలితాలు కలిగే అవకాశం లేదని స్పష్టం చేసే చాలా అధ్యయనాలను ఇచ్చింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ, గూగుల్‌ ఇండియా కన్సల్టెన్సీ, మూడీ సంస్థతో సమానమైన ఫిచ్‌, హెచ్‌ఎస్‌బిసి వంటివన్నీ వివరాలతో సహా ఇదే చెబుతున్నాయి. చిన్న వ్యాపారాలకు కరెన్సీ అందుబాటులో లేకపోవడం వల్ల దీర్థకాలిక నష్టం వుంటుందని వీరంతా హెచ్చరిస్తున్నారు. 
ఇక ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ కెసి చక్రవర్తి మరింత స్పష్టంగా సోదాహరణంగా ఈ నిర్ణయం దుష్పలితాలు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల బ్యాంకులకు రుణాలు ఇచ్చేశక్తి తగ్గి డిపాజిట్లపై ఇవ్వాల్సిన వడ్డీ భారం పెరుగుతుందని ఆయన తెలిపారు. 17 లక్షల కోట్టు నల్లధనం కాదు. అది పన్ను చెల్లింపుదారుల చేతుల్లోకి పోతే తెల్లదే అవుతుంది. అక్రమధనాధిపతులు తమ సొమ్ము చాలా త్వరితంగా ప్రజల చేతుల్లోకి వచ్చేట్టు చేయగలరు. రిజర్వు బ్యాంకు దగ్గరకు ధనం చేరినా అది చెత్తకాగితమే. దాన్ని తిరిగి ముద్రించడానికి చాలా సమయం పడుతుంది. ఇక భారీ రుణ ఎగవేతల విషయంలో ఇప్పటికీ సమాచారం బయిటపెట్టడం లేదు. ఇప్పటికే 4 లక్షల కోట్లు రద్దు చేశారు. మరో 5 లక్షల కోట్టు ఎన్‌పిఎలు అంటున్నారు. ఇంకా రెండు లక్షల కోట్టు రద్దు చేసే అవకాశముంది. ఈ జాబితాలు సక్రమంగా వెల్లడించకుండా మనం నోట్లపై యుద్ధంచేస్తున్నాం అని ఆయన వ్యాఖ్యానించారు.
ఒక అంచనా ప్రకారం వినిమయ దారీ సరుకులు(ఎఫ్‌ఎంసిజి)వ్యాపారం 30 నుంచి 70శాతం పడిపోయే అవకాశముంది.. హైకోర్టులలో కేసుల నిలిపివేయాలన్న కేంద్రం అభ్యర్థనను సుప్రీం కోర్టు ఈరోజు తోసిపుచ్చింది. ప్రజలు ఇన్ని సమస్యల్లో వుంటే తలుపులు ఎలా మూసేయగలననిప్రశ్నించింది.ఇప్పటికే విజయం సాధించామని అటార్జీ జనరల్‌ ముకుల్‌ రోహ్తగి చెప్పగా విజయం సాధించారా అని ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌ ఠాగూర్‌ ఆక్షేపణగా అడిగారు. సహకార బ్యాంకుల సమస్యలపై గాని ఇతరత్రా అంశాలపై గాని ఎవరైనా దిగువ కోర్టులకు వెళ్లవచ్చని అనుమతినిచ్చింది.

No comments:

Post a Comment