Monday, August 8, 2011

సర్వే చెలరేగిపోవడంతో కె.కె కి మూడిందా…!!!??


సర్వే చెలరేగిపోవడంతో కె.కె కి మూడిందా…!!!??
రాజకీయం ఏ క్షణం ఎలా ఉంటుందో, ఎవరికి తెలియదు. నిన్న పంది అనుకున్నవారు ఈ రోజు నంది అయ్యి పూజలు అందుకోవచ్చు. పోలిక లేకపోయినా సరిగ్గా అలాంటి పరిణామమే నిన్న లోక్ సభ సమావేశంతో జరిగింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంపీ సర్వే సత్యన్నారయణ రాజీనామా చేయలేదని అతనిపై తెలంగాణవాదులు విరుచుకుపడ్డారు. ఉస్మానియాతో సహా తెలంగాణ వ్యాప్తంగా దిష్టిబొమ్మ దగ్దాలు, రాజకీయ భవిష్యత్ నాశనం చేస్తానని హెచ్చరికలకయితే లెక్కే లేదు. అయితే నిన్నటి లోక్ సభ సమావేశాలతో సర్వే ఒక్కసారిగా తెలంగాణ హీరో అయిపోయారు. తెలంగాణ కోరుతూ ఓ తెలంగాణ ఎంపీ లోక్ సభలో సుదీర్ఘంగా మాట్లాడటం ఇదే ప్రధమం. సుష్మ ప్రసంగాన్ని సమర్ధించడానికిగాని, కావురి సమైక్యవాదానికి వ్యతిరేకంగా గొడవ చేయడానికిగాని సభలో మిగిలింది ఆయన ఒక్కడే. అనూహ్యంగా తనకు దొరికిన అవకాశాన్ని సర్వే కూడా చక్కగా అన్ని రకాలుగాను ఉపయోగించుకున్నారు. సోనియాను పొగుడుతూ, కాంగ్రెస్ లో తన స్థానానికి డోకా లేకుండా చేసుకున్న సర్వే, ప్రత్యేక రాష్ట్రం గురుంచి తెలంగాణ ప్రజలకున్న అభిప్రాయాలను వివరించారు. తెరాస ఎంపీలు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఎప్పుడూ అలా లోక్ సభలో చెప్పలేదు. 05-08-11శుక్రవారం జరిగిన లోక్ సభా సమావేశాలను యావత్ ఆంధ్రప్రదేశ్ ఆసక్తిగా గమనించింది. దీంతో వంద సార్లు మీడియా ముఖంగా ధర్నాలు, ఆందోళనలు చేసినా రాని పబ్లిసిటీ సర్వే సొంతమయ్యింది. ఇప్పుడు టి.కాంగ్రెస్ ఎంపీలకు కలవరపాటుకి గురిచేస్తున్న విషయం ఇదే. ప్రజల ఆకాంక్షలు పార్లమెంట్ లో చెప్పాల్సిన వారు రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చవడంతో రాజీనామా చేయని సర్వే కు చాన్స్ దక్కింది. రాజీనామాలు చేయకుండా ఉంటే తమకూ మాట్లాడే అవకాశం వచ్చేది. మాట్లాడకపోయినా కనీసం కావూరి మాట్లాడినప్పుడు ఆందోళన చేసినా ఫలితం ఉండేది. రాజీనామాలతో ఆ చాన్స్ లేకుండా పోయింది. కేసీఆర్, కె.కె మాటలు విని రాజీనామాలు చేయడం వలెనే చాన్స్ మిస్సయ్యామని భావన కలగక తప్పదు. దీనికి తోడు పార్లమెంట్ ఆవరణలో సర్వే తో మాట్లాడటానికి తెలుగు మీడియా తెగ ఆత్రం చూపింది. మీడియా తో రాజీనామాలు వల్ల ఒరిగేదేమీ లేదని, ఎంపీలను రాజీనామాలు చేయమని ఉసిగొల్పిన కె.కె.దే తప్పని సర్వే మాట్లాడటం మరికొంత అగ్గి రాజేసిందనే చెప్పాలి. కేసీఆర్ తో కుమ్మక్కయ్యే కె.కె ఇలా చేసారని అటు కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఇటు తెలంగాణ ఎంపీలు కె.కె పై గరం గరంగా ఉన్నారు. ఆ విధంగా పార్లమెంట్ లో సర్వే చెలరేగిపోవడంతో కె.కె కి మూడినట్లేనని రాజకీయ నిపుణలు విశ్లేషిస్తున్నారు.

No comments:

Post a Comment