Friday, August 30, 2013

మనసుతో వైద్యం చేసే డాక్టర్లు రావాలి:డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం

న దేశంలో మనసుతో సంబంధం లేకుండా శరీరానికి మాత్రమే వైద్యం చేసేవారు ఎక్కువగా ఉన్నారని ఈ పరిస్థితిని యువ వైద్యులే మార్చాలని భారత మాజీ రాష్టప్రతి డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం అన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్య విద్య పరిశోధనకు సంబంధించి ఏర్పాటు చేసిన ఓస్మికాన్ సమావేశంలో కలాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌లో ఫైవ్‌స్టార్, త్రీ స్టార్ ఆస్పత్రులు అంతకుమించి హంగులు ఉన్నా, మనసుతో వైద్యం చేసే డాక్టర్లు అరుదుగా ఉన్నారని అన్నారు. రోగి మానసిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి రోగికి అవసరమున్నా లేకున్నా కనీసం 15 రోగ నిర్ధారణ పరీక్షలు చేయించేందుకు వైద్యులు సిద్ధపడుతున్నారని తప్పుపట్టారు. వైద్య విద్యార్ధులు అంతా కలిసి ఈ లోపభూయిష్టమైన విధానాన్ని అడ్డుకోవాలని సూచించారు. అణ్వాయుధ దేశంగా భారత్ గుర్తింపు పొందిన సమయం కన్నా ఆర్ధోపెడిక్ వైద్యంలో వినియోగించే కాలిపర్స్ తయారీకి తన వంతు సాయం అందజేయడం, గుండె వైద్యంలో వినియోగించే రాజు-కలాం స్టెంట్ తయారీ వంటి అంశాలు తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చాయని అన్నారు.ఈ కార్యక్రమంలో వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, వైద్య విద్య సంచాలకుడు శాంతారావు, ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పుట్టా శ్రీనివాస్ పాల్గొన్నారు.

ప్రతి విద్యార్థికి ఉత్తమ వ్యక్తిత్వం అవసరం



త్తమ వ్యక్తిగా ఎదగాలంటే గొప్ప లక్ష్యాన్ని ఎంచుకో
వడంతో పాటు క్రమశిక్షణ చాలా అవసరమని కలాం హితవు పలికారు. గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్ధుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్ధులు గొప్ప లక్ష్యాలను ఎంచుకోవాలని చిన్న లక్ష్యాలను ఎంచుకోవడం నేరమని సూచించారు. మహిళలను గౌరవించే విద్యను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ప్రాధమిక పాఠశాల స్థాయిలో విద్యార్ధులకు స్ర్తిల పట్ల గౌరవడం కలిగించే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలని కలాం పేర్కొన్నారు. స్ర్తిల పట్ల గౌరవం పెరిగే విధంగా విద్యాబోధన ఉంటే మహిళలపై దాడులు తగ్గుతాయని అన్నారు. చదువు అనంతరం తీసుకోవల్సింది పట్టా కాదని, జ్ఞానాన్ని తీసుకువెళ్లాలని అన్నారు. అనంతరం విద్యార్ధులు అడిగిన అనేక ప్రశ్నలకు అబ్దుల్ కలాం సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి సిద్ధార్ధ రెడ్డి సహా అనేక మంది అధికారులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment