Sunday, March 11, 2012

లక్షన్నర కోట్ల నష్టాల్లో ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు !!!?


దేశంలోని ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు రూ. లక్షా 50 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి తెలియచేశారు. సుమారు 2,200 కోట్లతో విశాఖ రిఫైనరీలో ఏర్పాటు చేసిన క్లీన్ ఫ్యూయల్స్ ప్రాజెక్ట్‌ను సోమవారం ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్నందుకు తను ఆనందపడాలో? బాధపడాలో అర్థం కావడం లేదని అన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇరాన్‌లో ఉద్రిక్తత ఏర్పడినా, అరబ్ దేశాల్లో తిరుగుబాటు వచ్చినా క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతోందని అన్నారు. యూరప్ ఖండంలో రాజకీయ, ఆర్థిక సంఖోభం వచ్చినా డాలర్ రేట్లలో మా ర్పులు చోటు చేసుకుంటున్నాయని అ న్నారు. ఈ రెండు నష్టాలనూ చమురు సంస్థలు ఎదుర్కోవలసి వస్తోందని ఆయన చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచాల్సి వస్తోందని జైపాల్‌రెడ్డి చెప్పారు. తనకు వ్యక్తిగతంగా పెట్రో ధరలు పెంచాలన్న ఉద్దేశం లేకపోయినా గణితవాదం నుంచి తప్పించుకోలేం కదా! అని ఆయన అన్నారు. ఎప్పుడు పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచాలన్నా ఎన్నికలు అడ్డు వస్తుంటాయి. ఎన్నికల్లేని సంవత్సరమే లేదు. ఆర్థిక భారాన్ని మోస్తున్నా, నిగ్రహంతో ఉండి, వీలైనంత వరకూ ధరలు పెంచకుండా చూస్తున్నామని జైపాల్‌రెడ్డి వివరించారు. రేట్లు పెరిగినప్పుడల్లా, ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటుపరం చేయమని ఉచిత సలహాలు వస్తున్నాయని, నష్టాల్లో ఉన్న కంపెనీలను వారెందుకు తీసుకుంటారని మంత్రి ప్రశ్నించారు.
త్వరలో యూరో-4 పెట్రోలు
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు యూరో-4 పెట్రోలును దేశంలోని 13 నగరాల్లో వినియోగిస్తున్నామని మంత్రి జైపాల్‌రెడ్డి తెలియచేశారు. యూరో-3 పెట్రోలను యూరో-4 పెట్రోలుగా మార్చనున్నామని, ఇందుకు 40 వేల కోట్ల రూపాయలు ఖరవుతుందని ఆయన చెప్పారు. త్వరలోనే విశాఖ నగరంలో కూడా యూరో-4 పెట్రోలను అందుబాటులోకి తీసుకురానున్నామని ఆయన చెప్పారు. అలాగే యూరో-4 డీజిల్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
కేంద్ర మానవవరుల అభివృద్ధి శాఖ మంత్రి డి.పురంధ్రీశ్వరి మాట్లాడుతూ ప్రపంచంలో ఆయిల్ ఉత్పత్తి రంగంలో హెచ్‌పిసిఎల్ నాలుగో స్థానంలో ఉందని అన్నారు. క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో మన దేశం ఐదో స్థానంలో ఉందని అన్నారు. అలాగే పెట్రోలు ఎగుమతిలో మన దేశం ఆరో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఆయిల్ రంగంలో మరిన్ని అద్భుతాలు సాధించి, ప్రపంచంలోనే భారత దేశం ఒక సూపర్ శక్తిగా ఆవిర్భవించబోతోందని ఆయన చెప్పారు. హెచ్‌పిసిఎల్ విడుదల చేస్తున్న కాలుష్యకారకాల్లోని ప్రమాదాన్ని తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారని ఆమె అన్నారు. వాహనాల సంఖ్య పెరిగిపోవడం వలన కూడా కాలుష్యం పెరుగుతోందని ఆమె అన్నారు.
రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జైపాల్‌రెడ్డిని కోరారు. రాష్ట్రాన్ని ఆదుకోవలసిన సమయం వచ్చిందని చెప్పారు. రాష్ట్ర పెట్టుబడులు, వౌలిక, సహజవాయువుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ హెచ్‌పిసిఎల్ గ్రీన్‌బెల్ట్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. కాలుష్య రహిత నగరంలో తీర్చి దిద్దేందుకు పరిశ్రమలు కదలి రావాలని ఆయన కోరారు.


రాజ్యసభ సభ్యులు సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ యూరో-3, యూరో-4 పెట్రోలు వాడకం వలన కాలుష్యానికి తెరపడబోతోందని అన్నారు. భవిష్యత్‌లో హెచ్‌పిసిఎల్ కాలుష్య నివారణ సంస్థగా మారుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ హెచ్‌పిసిఎల్‌లో కాంట్రాక్ట్ కింద పనిచేసేందుకు ఈ ప్రాంతంలో నివసించే వారికే ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రీనరీ అభివృద్ధికి హెచ్‌పిసిఎల్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. 

No comments:

Post a Comment