Sunday, September 18, 2011

ముగ్గురు నేతలకు మైనస్ మార్కులే ???




ముగ్గురు నేతలకు మైనస్ మార్కులే
గత కొన్ని రోజులుగా రాజకీయ యుద్దం అనండి, మాటల యుద్దం అనండి ప్రధానంగా తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు , వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిల మధ్య జరుగుతోంది. లేదా ఈ రెండు పార్టీల నేతల మధ్య సాగుతోంది. మధ్యలో అసలు కధనాయకుడి పాత్రలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై అటు విమర్శలు కాని, ఇటు ప్రశంసలు కాని ఉండకుండా సాధారణంగా నడిచిపోతోంది. ఇదొక చిత్రమైన రాజకీయ స్థితే. దేశంలోకాని, రాష్ట్రంలోకాని ఏదైనా కొత్త ప్రజాఉద్యమం వచ్చినా లీడ్ తీసుకోవడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చొరవ చూపుతున్నారు.పంటల విరామం ఉద్యమం జరుగుతుంటే చంద్రబాబు నాయుడు కోనసీమ పర్యటించి అక్కడ రైతు సదస్సునే నిర్వహించారు. అలాగే జాతీయ స్థాయికి చెందిన వివిధ రాజకీయపార్టీల నేతలను తీసుకువచ్చి రైతుల సమస్యలపై వారి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించారు. జగన్ కూడా క్రాప్ హాలిడ్ ఉద్యమం నడుపుతున్న రైతుల వద్దకు వెళ్లి వారిని పరామర్శించి, ఆ తర్వాత తన ఓదార్పుయాత్రకు పరిమితం అయిపోయారు.అదే సమయంలో ఆయన ఆస్తులపై సిబిఐ దాడుల వ్యవహారాన్ని ఎదుర్కునే విషయంలొ వ్యూహరచన చేస్తూనే, ఓదార్పు యాత్రను ఆపకపోవడం విశేషం. మరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం వీటికి జోలికి వెళ్లకుండా తన మానాన తాను ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకుంటూపోతున్నారు.విశాఖలో రాజీవ్ యువకిరణాల కార్యక్రమం అనో, మరొకటనో చేసుకుంటూ వెళుతూ ప్రభుత్వంపై తన పట్టు నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నారు. అయితే జనం మీద ఇంకా తన ప్రభావాన్ని పూర్తిగా చూపలేకపోతున్నారన్నది వాస్తవం. దానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. ముందుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా తనకు అండగా నిలబడేలా చూసుకోవాలి. అది ఇంకా పూర్తిగా సఫలం కాలేదు. ఇప్పుడిప్పుడే ఆయన ఎమ్మెల్యేలను దారిలో పెట్టుకోవడానికి యత్నిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ కు చెందిన వారు ఇరవైఆరు మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పడం సి.ఎమ్.కు మైనస్ మార్కుకిందే లెక్క.అలాగే తెలంగాణ అంశాన్ని ఒక దశకు తీసుకురావడంలోకాని, కాంగ్రెస్ కు చెందిన తెలంగాణ ఎమ్మెల్యేలను, మంత్రులందరిని తన లైన్ కు అనుగుణంగా నడిచేలా చేయడంలో కూడా ఆయన అంతగా సఫలం కాలేకపోయినట్లే లెక్క. ముఖ్యంగా రాష్ట్రానికి చెందిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలను ఆయన ఆకట్టుకోలేకపోయారన్న అభిప్రాయం ఇంకా అలానే ఉంది.గతంలో రాజశేఖరరెడ్డి ఇతర పార్టీల నుంచి ఎమ్.పిలను, ఎమ్.ఎల్.ఎ.లను ఆకట్టుకుంటే, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉన్నవారు పార్టీకి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది.దీనికి ఈయనే పూర్తి బాధ్యుడని ఎవరూ చెప్పజాలరు.కాని ముఖ్యమంత్రి బాద్యతలలో ఉన్నవారికి ఇవితప్పవు. అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డికి పూర్తిగా పాస్ మార్కులు రాని పరిస్థితే నెలకొంది. ఇక ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని అంతటిని రంగరించి మళ్లీ ప్రజలలో తన ఆధిపత్యాన్ని తెచ్చుకోవడానికి విశ్వయత్నం చేస్తున్నారు. హైటెక్ సిటీ వంటి ప్రాజెక్టుల ఘనత ఆయనదే అయినప్పట్టికీ రాజకీయాలలో ఎప్పటికప్పుడు పరగడుపే.పైగా చేసిన మంచి పనుల కన్నా ఇతర అంశాలే ఎక్కువగా ప్రస్తావనకు వస్తాయి. చంద్రబాబుకు ఇప్పుడు అదే పెద్ద సమస్యగా ఉంది. రాజకీయం అనుకూలంగా ఉన్నప్పుడు ఏమి చేసినా కలిసివస్తుంది. ప్రతికూలంగా మారినప్పుడు ఏది చేసినా వ్యతిరేక భావనలు కూడా పెరుగుతుంటాయి. ఇటీవలికాలంలో ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. యువతలో ఈ విషయమై ఒక చైతన్యాన్ని తేవడం ద్వారా తన ఇమేజీని సుస్థిరం చేసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నం అయితే బాగానే ఉంది. కాని గతం ఆయనను వెన్నాడుతూనే ఉంది. దానిని మరచిపోకుండా ఆయన ప్రత్యర్ధులు ప్రయత్నిస్తున్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై అభియోగాలు తీసుకురావడంలోకాని, లక్ష కోట్ల అవినీతి అని నినాదాన్ని కాయిన్ చేయడంలోకాని ఆయన సక్సెస్ అయిన మాట నిజం.కాని అదే సమయంలో ఆయన లేదా ఆయన పార్టీ విషయంలో దానికి ప్రతిగా సచ్చీలత సర్టిఫికెట్ సంపాదించడానికి ఆయన తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.కొన్ని కాలేజీలకు ఆయన వ్యూహాత్మకంగా వెళ్లి అవినీతికి వ్యతిరేకంగా ప్రశ్నలను ఆహ్వానిస్తే కొన్ని చోట్ల అది ఆయనకే చికాకుగా మారింది. ప్రత్యర్ది రాజకీయ నాయకులు చేసే ఆరోపణలనే కొన్నిచోట్ల విద్యార్దులు ప్రస్తావించడంతో ఆయన కొంత అసహనానికి గురి కావల్సి వచ్చింది.అయితే ఈ ప్రయత్నం ప్రత్యేకించి ఆయన ఒంటరిగా దీనిపై డీల్ చేసిన పద్దతి వరకు బాగానే ఉంది. కాని తొందరపడి వెయ్యికోట్లు ఇచ్చి తన ఆస్తి మొత్తం తీసుకోవచ్చని, ఆ డబ్బును తాను ట్రస్టుకు, లేదా సేవా కార్యక్రమాలకు ఇస్తానని ప్రకటించిన తీరు ఆయనను కాస్త ఇబ్బందిలోకి నెట్టింది. ప్రత్యర్ధి రాజకీయ నాయకులు చంద్రబాబు ఆస్తి వెయ్యికోట్లు అని ప్రచారం చేయడానికి ఆయన అవకాశం ఇచ్చారు.అంతేకాక ఆయన తన ఆస్తి వివరాలను త్వరలో బహిర్గతం చేస్తానని కొత్తగా చెప్పనవసరం లేదు. ఆయన గత ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్ లో అన్ని వివరాలు ఇచ్చారు. వాటిని చెబితే సరిపోయేది.జగన్ అవినీతిపై , ఆయన తండ్రి అవినీతిపాలనపై పోరు చేస్తున్నామనే చంద్రబాబునాయుడుగాని, ఆయన పార్టీ నేతలుకాని అవినీతి విషయంలో నిజంగానే గట్టిగా ఉంటారా? అన్న అనుమానాలు ప్రజలలో ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు కడప ఉప ఎన్నికల రూపంలో వచ్చిన గొప్ప అవకాశాన్ని ఆయన చేజేతులారా జార్చుకున్నారు.ఆ ఎన్నికలలో కనుక టిడిపి డబ్బు ను ఒటర్లకు పంచకుండా ఉన్నట్లయితే ఓటమి ఎలా ఉన్నా జాతీయ స్థాయిలో చంద్రబాబుకు గొప్ప ఇమేజీ వచ్చేది.అలా చేసి ఉన్న పక్షంలో ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న ఉద్యమానికి నిజంగానే మంచి ఊపు వచ్చేది. మంచి గుర్తింపు లభించేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వచ్చే ఉప ఎన్నికలలో కచ్చితంగా తాము నిర్దిష్ట ఎన్నికల వ్యయానికి మించి ఖర్చు చేయబోమని చెప్పి, ఆ ప్రకారం నిజాయితీగా వ్యవహరిస్తే , ఆ తర్వాత చంద్రబాబు కాని, ఆ పార్టీ నేతలు చెప్పే మాటలు జనం విశ్వసించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మన చర్యలే మన ముందు అద్దంలా నిలుస్తాయి. ఎవరో ఏదో అన్నారని ఉలిక్కిపడడం కాకుండా ఎవరికి వారు తామెంత నిజాయితీగా ఉన్నామని ఆలోచించుకుంటే వారి మనసుకే వాస్తవం తెలుస్తుంది. అవినీతి వ్యతిరేక ఉ ద్యమం పక్కనబెడితే తెలంగాణ అంశంలోకాని, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే విషయంలోకాని తెలుగుదేశం క్లారిటీతో ఉండే పరిస్థితి లేకపోవడం కూడా వారి బలహీనత. కనుక ఇవన్ని చంద్రబాబుకు మైనస్ పాయింట్లుగానే తీసుకోవాలి. ఇక మూడో నేత వై.ఎస్.జగన్.ఆయన ముందుగానే ఊహించుకుని కష్టాలను ఎదుర్కుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో నుంచి బయటకు వచ్చే రోజునే పులివెందులకు వెళ్లి అక్కడ తనను కలిసినవారితో భవిష్యత్తులో కష్టాలు, నష్టాలు భరించాల్సివస్తుందని ముందుగానే తనను హెచ్చరించుకున్నారు. ఇది బాగానే ఉంది.కాంగ్రెస్ పార్టీ జగన్ ను ఎలా వేధిస్తున్నది, చంద్రబాబు నాయుడు ఎలాంటి విమర్శలు చేస్తున్నది పక్కనబెడితే జగన్ కూడా కొన్నివిషయాలలో క్లారిటీ ఇవ్వవలసిన అవసరం ఉంది. రాజశేఖరరెడ్డికి సంబంధం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వంతో సంబందం లేకుండా, మరెవ్వరితో సంబంధం లేకుండా జగన్ ఒక్కడే ఆర్ధిక నేరాలకో, అవినీతికో పాల్పడ్డారని ఎవరూ అనుకోవడం లేదు. అయినప్పటికీ మీడియాలోకాని, ఇతరత్రా సిబిఐ ఎఫ్ ఐ ఆర్ లో కాని, లేదా శంకరరావు, ఎర్రన్నాయుడు వంటివారు వేసిన అఫిడవిట్ లలో ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని హైకోర్టు చెప్పినదానిపై జగన్ కోర్టులలో ఎదుర్కోవడం సంగతి ఎలా ఉన్నా ప్రజలకు ఏదో ఒక రోజు తన వివరణ ఇవ్వవలసి ఉంది. ప్రస్తుతం జగన్ తప్పులు చేయలేదని, అక్రమాలకు పాల్పడడం లేదని ఎవరూ అనుకోవడం లేదు. కాకపోతే ఆయనను ఒంటరిగా వేదిస్తున్నారన్నదానిపై సానుభూతి వస్తుంటే వస్తుండవచ్చు కాని, ఏదో ఒక రోజున వాస్తవాలను ప్రజలకు తెలియచెప్పవలసిన పరిస్థితి వస్తుంది. లేకుంటే జగన్ కు అప్రతిష్ట ఎదురు కాకతప్పదు. ఒకవేళ జగన్ అరెస్టయితే అది కచ్చితంగా ఆయనకు మైనస్సే అవుతుంది.సానుభూతి వేరు . అప్రతిష్ట వేరు. అయినప్పటికి జగన్ కు మద్దతుగా ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్.పి ఇప్పటికే రాజీనామా చేయడం ఆయనకు కాస్త ఊరటే కావచ్చు. ఇంత జరుగుతున్నా ఆయన ఓదార్పుయాత్రలోనే ఉండడం ద్వారా తన కమిట్ మెంట్ ను తెలియచేస్తుండవచ్చు. ప్రస్తుతం జగన్ కు ఒకరకంగా నెగిటివ్ వాతావరణం,మరో రకంగా పాజిటివ్ వాతావరణం ఉంది. సిబిఐ కేసులు పెట్టడం వంటివి నెగిటివ్ అయితే, కొంత సానుభూతి ఉందన్న భావన కలగడం పాజిటివ్ పాయింట్. అయితే అవినీతి అనేది ఎప్పటికైనా మచ్చే అది ఏ నాయకుడినైనా వెంటాడుతూనే ఉంటుంది.కాకపోతే జనం కూడా అవినీతి చట్రంలో కూరుకుపోయారు కనుక దానిని సీరియస్ గా తీసుకోవడం లేదన్న భావన ఉంది. కాని అది హద్దులు దాటితే ఇదే జనం తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఎప్పుడో ఒకప్పుడు అలాంటి రోజు వస్తుంది. కాని ఇప్పుడున్న పరిస్థితిలో ముగ్గురు ముఖ్య నేతలు ప్రజల దృష్టిలో ఇంకా మైనస్ మార్కులతోనే ఉన్నారని ఒప్పుకోవాలి.

Monday, September 12, 2011

12 వ పంచవర్ష ప్రణాళిక చివరికి 83 వేల మెగావాట్ల అదనపు విద్యుత్



విశాఖపట్నం;12వ పంచవర్ష ప్రణాళిక చివరినాటికి దేశంలో 83 వేల మెగావాట్ల అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. విశాఖలోని సింహాద్రి పవర్ ప్లాంట్ రెండో దశ 500 మెగా వాట్ల పూర్తిస్థాయి వాణిజ్య ప్రక్రియను మంత్రి షిండే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తను విద్యుత్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటికి 1,22,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, దాన్ని 1,80,000 మెగావాట్లకు పెంచగలిగామని తెలిపారు. 10వ ప్రణాళిక వరకు విద్యుత్ కొరత తీవ్రంగానే ఉందని, 11వ ప్రణాళికలో దీన్ని తగ్గించగలిగామని అన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, గ్యాస్ కొరత 12వ పంచవర్ష ప్రణాళికాంతం వరకూ ఉండదని, 13వ పంచవర్ష ప్రణాళిక నాటికి ఈ సమస్య మొదలవుతుందని మంత్రి షిండే తెలిపారు. ఇండొనేషియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకునేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయని విలేఖరులు ప్రశ్నించగా, అక్కడ చవకగా బొగ్గు లభిస్తుంది. అయితే ఇక్కడికి దిగుమతి చేసుకోవడం కష్టతరంగా ఉందని అన్నారు. శ్రీలంకలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఎంఓయు చేసుకోవలసి ఉందని, దీనిపై ఇరు ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అదే విధంగా సౌత్ ఆఫ్రికాలో కూడా పవర్ ప్లాంట్ ఏర్పాటు ఆలోచన ఉందని చెప్పారు. ఎన్‌టిపిసి సిం హాద్రి ద్వారా విద్యుత్‌లో అధిక భాగం ఆంధ్ర ప్రదేశ్‌కు ఇస్తారా? అని అడిగిన ప్రశ్నకు విద్యుత్ కొరత అనేక రాష్ట్రాల్లో ఉందని, ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి అయిన విద్యుత్‌ను అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇకపై ఎన్‌టిపిసి ఏర్పా టు చేయనున్న కొత్త ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో ఆయా రాష్ట్రాలకు 50 శాతం ఇవ్వాలని నిర్ణయించామని షిండే తెలిపారు.
అంతకు ముందు సింహాద్రి పవర్ ప్లాంట్‌లో జరిగిన సభలో షిండే మాట్లాడుతూ ఎన్‌టిపిసి ఏటా 9,200 కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తోందని అపంచవర్ష ప్రణాళిక చివరికి 83 వేల మెగావాట్ల అదనపు విద్యుత్
విశాఖపట్నం;12వ పంచవర్ష ప్రణాళిక చివరినాటికి దేశంలో 83 వేల మెగావాట్ల అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. విశాఖలోని సింహాద్రి పవర్ ప్లాంట్ రెండో దశ 500 మెగా వాట్ల పూర్తిస్థాయి వాణిజ్య ప్రక్రియను మంత్రి షిండే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తను విద్యుత్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటికి 1,22,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, దాన్ని 1,80,000 మెగావాట్లకు పెంచగలిగామని తెలిపారు. 10వ ప్రణాళిక వరకు విద్యుత్ కొరత తీవ్రంగానే ఉందని, 11వ ప్రణాళికలో దీన్ని తగ్గించగలిగామని అన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, గ్యాస్ కొరత 12వ పంచవర్ష ప్రణాళికాంతం వరకూ ఉండదని, 13వ పంచవర్ష ప్రణాళిక నాటికి ఈ సమస్య మొదలవుతుందని మంత్రి షిండే తెలిపారు. ఇండొనేషియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకునేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయని విలేఖరులు ప్రశ్నించగా, అక్కడ చవకగా బొగ్గు లభిస్తుంది. అయితే ఇక్కడికి దిగుమతి చేసుకోవడం కష్టతరంగా ఉందని అన్నారు. శ్రీలంకలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఎంఓయు చేసుకోవలసి ఉందని, దీనిపై ఇరు ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అదే విధంగా సౌత్ ఆఫ్రికాలో కూడా పవర్ ప్లాంట్ ఏర్పాటు ఆలోచన ఉందని చెప్పారు. ఎన్‌టిపిసి సిం హాద్రి ద్వారా విద్యుత్‌లో అధిక భాగం ఆంధ్ర ప్రదేశ్‌కు ఇస్తారా? అని అడిగిన ప్రశ్నకు విద్యుత్ కొరత అనేక రాష్ట్రాల్లో ఉందని, ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి అయిన విద్యుత్‌ను అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇకపై ఎన్‌టిపిసి ఏర్పా టు చేయనున్న కొత్త ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో ఆయా రాష్ట్రాలకు 50 శాతం ఇవ్వాలని నిర్ణయించామని షిండే తెలిపారు.
అంతకు ముందు సింహాద్రి పవర్ ప్లాంట్‌లో జరిగిన సభలో షిండే మాట్లాడుతూ ఎన్‌టిపిసి ఏటా 9,200 కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తోందని అన్నారు. పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు భూమిని సేకరించడం వలన చాలా మంది నిరాశ్రయులవుతున్నారని అన్నారు. ఇకపై కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసేటప్పుడు ముందుగానే నిర్వాసితుల్లో అర్హత కలిగిన యువకులకు ఆయా ప్లాంట్లలో పనిచేయడానికి కావల్సిన శిక్షణను ముందుగానే ఇప్పించాలని అన్నారు.
రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్‌టిపిసి దేశంలోనే తలమానికమైన సంస్థగా అభివర్ణించారు. ఇందులో పనిచేసే ఉద్యోగులకు అంకితభావం ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఎన్‌టిపిసి ఆరు లక్షల మొక్కలు నాటాలనుకోవడం శుభపరిణామమని అన్నారు. ఎన్‌టిపిసి సిఎండి అరూప్‌రాయ్ చౌదరి మాట్లాడుతూ దేశానికి అవసరమైన విద్యుత్‌లో 1/3 విద్యుత్‌ను ఎన్‌టిపిసి అందిస్తోందని అన్నారు. మంత్రి వట్టి వసంతకుమార్ మాట్లాడుతూ ఎన్‌టిపిసి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ మొత్తాన్ని మన రాష్ట్రానికే చెందేటట్టు చూడాలని కోరారు.






























Sunday, September 4, 2011

శాకాహారమే ఎందుకు తినాలి?

శాకాహారమే ఎందుకు తినాలి? కూరగాయలు తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, మాంసాహారం తీసుకుంటేనే బలంగా ఉంటాం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ మాంసాహారం కంటే వెజిటే రియన్ డైట్‌తోనే ఎక్కువ ప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో చదవండి.డీటాక్సిఫై : వెజిటబుల్ డైట్‌లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అంటే పీచుపదార్థాలు. పాలకూర, క్యాబేజీ, సొరకాయ, గుమ్మడి వంటి కూరగాయలలో పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. పీచుపదార్థాలు శరీరానికి చాలా అవసరం. మలబద్ధకం రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండాల్సిందే. శరీరంలో నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపించడానికి ఈ ఫైబర్ చక్కగా ఉపయోగపడుతుంది. నాన్‌వెజ్‌లో ఫైబర్ లభించదు.
ధృడమైన ఎముకలు : మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొటీన్ శాతం పెరిగిపోతుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా శరీరం కాల్షియం గ్రహించడం తగ్గిపోతుంది. ఎముకలు బలహీనంగా మారుతాయి. శాకాహారుల్లో ఇలాంటి సమస్యలు తక్కువే. కార్బోహైడ్రేట్స్ లోపం : నాన్-వెజిటేరియన్ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా లభిస్తాయి. శరీరానికి తగినంత కార్బోహైడ్రేట్స్ లభించనపుడు అది కెటొసిస్‌కు దారితీస్తుంది. అంటే శరీరం తనకు అవసరమైన ఎనర్జీ కోసం కొవ్వును కరిగించుకొంటుంది. అంతేకాకుండా వెజిటేరియన్ ఫుడ్‌లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా జీర్ణం అవుతూ శరీరానికి అవసరమైన గ్లూకోజ్‌ను మెల్లగా అందిస్తాయి. అయితే నాన్‌వెజ్‌లో ఫ్యాట్, ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆరోగ్యకరమైన చర్మం: బీట్‌రూట్, టమోట, గుమ్మడి, కాకరకాయ వంటి కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆపిల్స్, పియర్స్, జామకాయ లాంటి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. మాంసాహారం తీసుకోవడం వల్ల చర్మానికి ఎలాంటి ఉపయోగం లేదు. బరువు నియంత్రణ : కొవ్వును తగ్గించుకోవాలంటే సులభమైన మార్గం నాన్‌వెజ్‌కు దూరంగా ఉండటమే. మాంసాహారం తీసుకునే వారు బరువును తగ్గించుకోలేరు. అయితే నాన్‌వెజ్‌కు బదులుగా తృణధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, నట్స్, ఫ్రూట్స్ తీసుకొంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటుంది. వెజిటేరియన్ డైట్ వల్ల అధిక రక్తపోటు, అధిక బరువు నియంత్రణలో ఉంటాయి. ఫైటో న్యూట్రియెంట్స్ : డయాబెటిస్, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, స్ట్రోక్, బోన్ లాస్ వంటి వ్యాధులను ఫైట్రోన్యూట్రియెంట్స్ తీసుకోవడం ద్వారా నివారించవచ్చు. ఇవి వెజిటేరియన్ డైట్‌లో మాత్రమే లభిస్తాయి. నాన్‌వెజ్ తీసుకునే వారిలో వీటికి కొరతేఉంటుంది. సులభంగా నమలడం : మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడం లాలాజలంతో మొదలవుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడే ఈ ప్రక్రియ మరింత బాగా జరుగుతుంది. అంతే కాకుండా కూరగాయలతో తీసుకునే ఆహారాన్ని సులభంగా నమలవచ్చు.