కరీంనగర్ రణభేరి సభలో చోటుచేసుకున్న పరిణామాలు తెలంగాణలో టీడీపీ శ్రేణులకు ఆత్మస్థైర్యం ఇచ్చాయి. టీఆర్ఎస్ను ఇకపై ఎక్కడిక్కడ ఎదుర్కొనేందుకు ఒక టానిక్‌లా ఉపకరించాయి. దేవేందర్‌గౌడ్, దయాకర్, రేవంత్‌రెడ్డి, అన్నపూర్ణమ్మ, సీతక్క, దయాకర్‌రెడ్డి, రమణ వంటి అగ్రనేతల ప్రసంగాలు పరిశీలిస్తే.. టీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుని భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోందన్నదీ స్పష్టమయింది. ఇకపై టీఆర్ఎస్ నేతలను రోడ్లపై తిరగనివ్వమన్న దయాకర్ హెచ్చరికలు, ఉద్యమాన్ని అటకెక్కించారన్న రేవంత్ ఆరోపణలతో పాటు… వరంగల్‌లో ఎర్రబెల్లి, హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి నివాసాలపై దాడులు పరిశీలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకే టీడీపీ సిద్ధమవబోతోందన్న సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి తెలంగాణ టీడీపీ నేతలకు ఒక గుణపాఠంగా సైతం నిలిచాయి. ఇన్నాళ్లూ హైదరాబాద్‌లో ఉండి తాము భయ పడుతూ, నాయకత్వాన్ని భయపెడుతున్నందున వచ్చే లాభం లేదని, తాము కూడా ప్రత్యక్షంగా రంగంలోకి దిగకపోతే భవిష్యత్తు పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయన్నది ఒక హెచ్చరికలా గుర్తించడానికి దోహదపడింది. తాము హైదరాబాద్‌లో కూర్చుంటే స్థానికంగా పార్టీ కార్యకర్తలు తెలంగాణ అంశంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, టీఆర్ఎస్ నుంచి ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో బుధ వారం అగ్రనేతలంతా ప్రత్యక్షంగా చూశారు. ఈ పరిణామా లు ప్రధానంగా.. ఇకపై అన్ని ప్రాంతాల్లోనూ రణభేరి సభలు నిర్వహించనున్న టీడీపీ తెలంగాణ నేతలకు ఒక అనుభవం మిగిల్చడంతో పాటు, వాటిని ఎలా ఎదుర్కోవాలన్న ప్రణాళి కకు స్ఫూర్తిగా నిలిచాయి. వాటిని ధైర్యంగా నిర్వహించు కునేందుకు ఆత్మస్థైర్యం నింపాయి. తాజా పరిణామాల నేపథ్యంలో యువ నేతలు రేవంత్‌రెడ్డి, హన్మంతరావు ఇమేజ్ పెరిగినట్టయింది. రేవంత్‌రెడ్డి తన రైఫిల్‌ను మార్చి, పక్కకుపెట్టిన వైనం జగన్ మీడియా పదే పదే చూపించడంతో అది మిగిలిన వారిని రెచ్చగొట్టినట్టయింది. అయితే, ఆ తర్వాత సభలో రేవంత్ చేసిన ఉద్రేకపూరిత ప్రసంగం, చేసిన హెచ్చరికలు వాటిని వెనక్కి నెట్టివేసి, ఆయన ఇమేజ్ను పెంచాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఎమ్మెల్యే హన్మంతరావు తనపై దాడికి వచ్చిన టీఆర్ఎస్ నేతలపై ఎదురుదాడికి దిగిన వైనం కూడా ఆయన ఇమేజ్ను నిస్సందేహంగా పెంచిందంటున్నారు.
నాగంపై వేటు
తెలుగుదేశం పార్టీలో తెలంగాణ తుపాను రేపిన నాగం జనార్దన్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పొలిట్‌బ్యూరో బుధవారం రాత్రి పదిన్నరకు తీర్మానం చేసింది. అందుబాటులో ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యులు, సీనియర్లతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. నాగం, మహానాడు అంశాలపై చర్చించారు. నాగం చర్యలను ఉపేక్షించకూడదని, దాని వల్ల పార్టీ ఇంకా నష్టపోతుందని నేతలు సూచించారు. నాగం జనార్దన్‌రెడ్డికి పార్టీలో, ముఖ్యంగా తెలంగాణలో ఎవరికీ ఇవ్వనంత ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ, ఆయన పార్టీని ఇబ్బందిె పట్టేందుకు నిర్ణయించుకోవడం విచారకరమని బాబు వ్యాఖ్యానించారు. నాగం సొంత అజెండాతో వెళుతున్న విషయం తెలిసి, అనేకసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని వివరించారు. మీరు నాగంకు అనేక అవకాశాలు ఇచ్చినా ఆయన దానిని వినియోగించుకోకపోగా, పార్టీని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించినందున చర్యలు తీసుకోవలసిందేనని నేతలు స్పష్టం చేశారు. ప్రధానంగా.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నేతలు నాగం సస్పెన్షన్‌పై పట్టుపట్టారు. ఫలితంగా నాగంపై సస్పెన్షన్ వేటు అనివార్యమయింది.కాగా, ఉదయం నుంచి రాత్రి వరకూ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గాల నేతలు బాబు నివాసానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. నాగర్ కర్నూల్ నేతలు బాబును కలిశారు. బక్క నరసింహులు నేతృత్వంలో పలువురు జిల్లా నేతలు బాబును కలిసి తమ సంఘీభావం ప్రకటించారు. పార్టీ వల్ల అన్ని రకాల లాభపడిన నాగం పార్టీకి వెన్నుపోటు పొడిచారని, ఆయన పార్టీని వీడినా నష్టమేమీ లేదని, తామంతా మీ వెనుకే ఉంటామని భరోసా ఇచ్చారు.
పార్టీ జెండాతో ఉద్యమిస్తామన్నారు. తాము పార్టీ జెండాలతో నాగం నివాసం ముందు ధర్నా చేస్తామని చెప్పారు. అయితే అలాంటి చర్యలు వద్దని, నాగంకు మనమేం చేశాం, ఆయన పార్టీకి ఏం చేశారు, పార్టీని ఎంత ఇబ్బందిపెట్టారన్నదీ ప్రజలు చూస్తున్నందున అలాంటి చర్యలు తీసుకోవద్దని బాబు నచ్చచెప్పారు.నాగంను పార్టీ నుంచి సస్పెండ్ చేయటం వల్ల తమకు స్వాతంత్య్రం వచ్చినంత సంతోషంగా ఉందని జిల్లా నేతలు బాబు వద్ద వ్యాఖ్యానించారు. తమను నాగం అణగదొక్కారని, దాని వల్ల అనేక మంది సీనియర్లు రాజకీయంగా నష్టపోయారన్నారు. అలాంటి వారికి మీరు ఇకనయినా న్యాయం చేయాలని సూచించగా, బాబు దానికి అంగీకరించారు. గత కొద్దిరోజుల నుంచి చోటుచేసుకుంటున్న పరిణామాలతో శ్రేణులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో బుధవారం ఇద్దరు కీలక నేతలు అలక వీడి బాబుతో భేటీ కావడం ఊరట కలిగించింది. తెలంగాణ అంశం పేరుతో పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగువ వేసిన నాగం జనార్దన్‌రెడ్డికి బాసటగా నిలచిన ఆదిలాబాద్ జిల్లా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారితో పాటు.. రాజమండ్రిలో మేయర్‌తో వచ్చిన విబేధాలు-పార్టీలో తనకు ఎదురవుతున్న నిరాదరణతో అలిగి పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, తెలంగాణ నేతలు రాములు, జైపాల్‌యాదవ్ బుధవారం పార్టీ అదినేత చంద్రబాబునాయుడును ఆయన నివాసంలో కలిశారు. రావుల బంధువు మృతి చెందటంతో ఆయన అక్కడికి వెళ్లారు. తామంతా పార్టీ వెంటే ఉంటామని, పార్టీ జెండాతోనే ఉద్యమిస్తామని వారు హామీ ఇచ్చారు. అయితే, తాము కొన్ని కారణాల వల్ల కరీంనగర్ సభకు వెళ్లడం లేదన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణ అంశంలో తాను చేసిన తప్పేమిటని బాబు వేణుగోపాలచారిని ప్రశ్నించారు. గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కితీసుకోలేదని, తెలంగాణ కోసం నాయకులు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పార్టీ పరంగా అన్ని విధాలా అండగా నిలుస్తున్న విషయం నీకు తెలియదా అని ప్రశ్నించారు.కాంగ్రెస్-టీఆర్ఎస్ ఉద్యమం పక్కకు పెట్టి రాజకీయ లబ్థి కోసం పనిచేస్తుంటే మన నేతలు మాత్రం పార్టీని ఇబ్బందిపెట్టడం భావ్యమా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం వద్దని నేనెప్పుడైనా చెప్పానా? అడ్డుపడ్డానా? తెలంగాణ ఇచ్చే శక్తిగానీ, తెచ్చే శక్తిగానీ మనకు లేదని మీకు తెలియదా? అన్నారు. అయితే, తమకు స్థానికంగా తెలంగాణవాదంతో కొన్ని సమస్యలున్నాయని, అంతే తప్ప పార్టీతో విబేధాలు లేవని చారి చెప్పారు. ప్రజల పక్షాన ఉద్యమం చేయమని గతంలోనే చెప్పా కదా అని బాబు అన్నారు. అయితే తాను పార్టీని వీడేది లేదని, మీపై విశ్వాసం ఉందని చారి స్పష్టం చేశారు. ఆ తర్వాత కలిసిన జైపాల్‌యాదవ్, రాములు కూడా అదే హామీ ఇచ్చారు.మధ్యాహ్నం గోరంట్ల బుచ్చయ్య చౌదరితో బాబు భేటీ అయ్యారు. రాజమండ్రిలో తనకు జరుగుతున్న అవమానాలు, సీనియర్నయిన తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఆయన బాబు ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు. మహానాడు ముగిసిన తర్వాత మీతో అన్నీ చర్చిస్తానని, సమస్య పరిష్కరిస్తానని బాబు హామీ ఇచ్చారు. ‘మీరు సీనియర్లు. మీరు కూడా అలిగితే ఎలా? నా సమస్యలు మీకు తెలియవా? మీ ప్రాధాన్యం మీకు తప్పకుండా ఉంటుంది. మీరంటే నాకు గౌరవ’మని బాబు చెప్పారు. దానితో బుచ్చయ్య చౌదరి మెత్తబడ్డారు. మళ్లీ రేపు మాట్లాడదామని బాబు చెప్పడంతో అంగీకరించారు. పార్టీపై అలిగి ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన గోరంట్ల వద్దకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహన్‌రావు రాయబారం నెరిపారు. చివరకు వారిద్దరూ కలసి బాబును కలసి చర్చించారు.
No comments:
Post a Comment