Saturday, May 21, 2011

ఈగో సమస్య: వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు నటి రోజా రాం రాం!


ఈగో సమస్య: వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు నటి రోజా రాం రాం!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈగో సమస్య పతాక స్థాయికి చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా ఈ పార్టీలో సినీ స్టార్లు ఇమడలేక పోతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. మొన్నటి మొన్న సినీ స్టార్లు డాక్టర్ జీవితా రాజశేఖర్‌లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెల్సిందే. తమకున్న ప్రజాకర్షణను వైఎస్.జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారని అందువల్లే తాము పార్టీని వీడుతున్నట్టు వారు ఆరోపించారు. 
ఇపుడు ఆ పార్టీకి చెందిన మరో తార ఆర్.కే.రోజా ఇదే తరహా ఆరోపణలు చేసి, పార్టీకి దూరమైనట్టు సమాచారం. ఈ ఊహాగానాలను రుజువు చేసేలా ఇటీవల గుంటూరులో వైఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన 48 గంటల రైతు దీక్షలో ఆమె ఎక్కడా కనిపించలేదు. ఏ చిన్నపాటి సమావేశం, సదస్సు, ధర్నా నిర్వహించినా ముందుండే రోజా.. ఈ దీక్షలో మాత్రం ఎక్కడా కనిపించలేదు. 
గుంటూరులో జరిగిన రైతు దీక్షా వివరాలను రోజాకు జగన్ మాటమాత్రం చెప్పలేదన్నది వినికిడి. ఈ దీక్షకు తనకు ఆహ్వానం అందక పోవడంతో తీవ్ర నిరాశకు లోనైన రోజా.. తన వ్యవహారంపై పార్టీ నేతల్లో ఆరా తీశారట. ఇందులో పార్టీ సభలు, సమావేశాలకు రోజా మేకప్ వేసుకుని రావడం జగన్‌కు నచ్చలేదట. 
అందుకే ఆమెను దూరంగా పెట్టాలని భావించిన జగన్.. రైతు దీక్షకు ఆహ్వానం పంపలేదనే విషయాన్ని రోజా తెలుసుకున్నారట. దీంతో రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తిరిగి మాతృసంస్థ తెదేపాలోకి వెళ్లాలన్న ఆలోచనలో రోజా ఉన్నట్టు తెలుస్తోంది.

No comments:

Post a Comment