కడపలో పంచతంత్రం
ఆ ఐదుగురూ ఐదుగురే. ఒక్కోరిదీ ఒక్కో స్టైల్. ఎవరి వ్యూహాలు వారివి. ప్రజల పల్సు పట్టేందుకు ఎవరి దారిలో వారు పయనిస్తున్నారు. వీరికి ఎన్ని సానుకూల అంశాలు న్నాయో.. అన్ని ప్రతికూలాంశాలు ఉన్నాయి. వీరికి ఈ ఎన్నికలు ఒక పరీక్ష. ఒక సవాలు. ఇప్పుడు ప్రచారంలో వాటినే ఎదుర్కొంటున్నారు.వచ్చే నెలలో జరగనున్న కడప పార్లమెంటు, పులివెందుల ఉప ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్ధులుగా మారిన ఐదుగురు నేతలు అప్రతిహతంగా, అవి శ్రాంతంగా పోరాడుతున్నారు. పులివెందులలో వదిన -మరిది మధ్య హోరాహోరీ సంగ్రామం జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మి తనయుడు స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థ్ధిగా పోటీ చేస్తున్నారు. ఆమెపై వైఎస్ సోద రుడు, సొంత మరిది వైఎస్ వివేకానందరెడ్డి బరిలో ఉన్నా రు. వారిద్దరూ వారి వారి కుటుంబసభ్యుల దన్నుతో ప్రచా రంలో ముందున్నారు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్-వైఎస్సార్ కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొంది. వారిద్దరి మధ్య చీలే ఓట్లతో బయటపడాలన్నది బీటెక్ రవి ఆశగా కనిపిస్తోంది. విజయ లక్ష్మి మరోసారి సానుభూతి ఓట్లపై ఆశపెట్టుకున్నారు.
ఇక పార్లమెంటు అభ్యర్థుల మధ్య నువ్వా-నేనా అన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ స్వయంగా అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థిగా ఎంపీ మైసురారెడ్డి రంగంలో ఉన్నారు. ముగ్గు రూ అవిశ్రాంతంగా ప్రచారబరిలో దూసుకువెళుతున్నారు.అయితే ఈ ముగ్గురు అభ్యర్ధులకు సొంత జిల్లా కంటే బయట జిల్లాల నుంచి వచ్చి ప్రచారం చేస్తున్న వారే ఎక్కువగా ఉండటం ప్రస్తావనార్హం.
అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించిన జగన్‌కు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాధ్‌రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ..గురునాధరెడ్డి, కొండా సురేఖ, రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, శేషారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, షాజ హాన్, శోభానాగిరెడ్డి, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, జూపూడి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గోనె ప్రకాశరావు, సినీ నటి రోజా వంటి ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. పులి వెందులలో విజయలక్ష్మికి మద్దతుగా కుటుంబసభ్యులం తా బరిలో నిలిచారు. ఆమె ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రతి ఇంటికీ తిరుగుతున్నారు. కూతురు షర్మిల ఆమెతోనే ఉంటున్నారు. జగన్ ఎక్కువగా తన తండ్రి మృతి చెందిన సానుభూతి ఓట్లపైనే ఆధారపడుతున్నారు.
ఇక కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డికి మద్దతుగా మంత్రులు ప్రచారంలో నిలుస్తున్నారు. ఇన్చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో.. మంత్రి ధర్మాన ప్రసాదరావు, బొత్స, అహ్మదుల్లా, మోపిదేవి, మహీధర్ రెడ్డి, ఆనం, రఘువీరారెడ్డి, గల్లా, మాణిక్యవరప్రసాద్, బస్వరాజు సారయ్య వంటి ప్రముఖులతో పాటు ఎమ్మెల్యే లు కూడా కడపలోనే మోహరించారు. మంత్రులకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో మండలా నికి ఒక్కో ఎమ్మెల్యే బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తుం డగా, ఈనెల 28 నుంచి పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి మూడురోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో జగన్ కు వచ్చిన ఓట్లలో చీలికతో జగన్ గట్టెక్కరని డీఎల్ ఆశాభావంతో ఉన్నారు. పులివెందులలో కాంగ్రెస్ అభ్యర్ధి వైఎస్ వివేకానందరెడ్డి అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నా రు. ఆయనకు కుటుంబసభ్యులు దన్నుగా నిలస్తున్నారు. మంత్రులు పులివెందుల ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.
ఇక్కడ విజయలక్ష్మి కంటే వివేకానందరెడ్డే ఎక్కువగా ప్రజలతో ఎక్కువ సేపు గడుపుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఎం.వి.మైసురారెడ్డి కూ డా అవిశ్రాంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. నామా నాగేశ్వరరావు, రమేష్‌రాథోడ్, ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, తుమ్మల నాగేశ్వరరావు, దేవేందర్‌గౌడ్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్.రమణ, తలసాని శ్రీనివాసయాదవ్, రేవంత్‌రెడ్డి, శ్రీరాం తాతయ్య, పల్లె రఘునాధరెడ్డి, రమణ, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అబ్దుల్‌ఘనీ, రామకృష్ణ, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, బాబూ రాజేంద్రప్రసాద్, సినీ నటి కవిత, తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి తదితరులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఒక్కో మండలానికి ఒక్కో ఎమ్మెల్యే ఇన్చార్జిగా, వారికి సహాయకులుగా రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలత
వైఎస్ మృతి సానుభూతి. కొడుకుగా వాటిని పొందే యత్నం.
గ్రామ నేతలపై పట్టు. క్రిస్టియన్లు, ముస్లిం ఓటు బ్యాంక్.
కాంగ్రెస్ ఓట్లలో భారీ చీలిక.
అంతమంది కలసి ఒక్కడిని ఓడించేందుకు యత్నిస్తున్నారన్న స్థానిక సెంటిమెంట్.
నాలుగు నియోజకవర్గాల్లో సొంత ఎమ్మెల్యేల బలం.
ప్రతికూలత
గతంలో తనకు వచ్చిన ఓట్ల చీలికతో నష్టం. గెలిస్తే బీజేపీతో కలసిపనిచేస్తారన్న ప్రచారంతో కలవరం. దానివల్ల క్రిస్టియన్లు, దళిత క్రిస్టియన్లు, ముస్లిం ఓట్లు దూరమయ్యే ప్రమాదం.
తన వర్గీయులపై పోలీసుల కట్టడితో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గే ప్రమాదం. అది తగ్గితే మెజారిటీ ఎంతన్నది అనుమానం.
ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటారన్న కారణంతో స్థానికంగా ఉండరన్న విమర్శలు. అవినీతిపరుడన్న ప్రచారం మైనస్ పాయింట్. ఆరేళ్లలో లక్షకోట్లు అక్రమంగా సంపాదించారన్న విమర్శలు.
గతానికి భిన్నంగా కాంగ్రెస్-టీడీపీలను ఏకకాలంలో ఎదుర్కోవలసి రావడం.
డీఎల్ రవీంద్రరెడ్డి సానుకూలత
వివాదరహిత ముద్ర.
గతంలో జగన్‌కు పడిన ఓట్ల చీలి కపై ఆశ.
ప్రభుత్వ యంత్రాంగం మద్దతు.
ఎస్సీ, మైనారిటీల ఓటు బ్యాంకుపై ఆశ.
అందుబాటులో ఉంటారన్న సానుకూలత.
ప్రతికూలత
ఎవరికీ పనులు చేయరని, అహంకార పూరితంగా వ్యవహరిస్తారని, ఎవరినీ కనీసం గౌరవించరన్న విమర్శలతో కొంత మైనస్.
సొంత నియోజకవర్గంలోనే పలుకుబడి లేని వైనం. జగన్‌కే ఎక్కువ బలం ఉండటం.
ప్రచారంలో జగన్ వర్గీయుల నుంచి ప్రతిరోజూ ఎదురీత. ప్రజల నుంచి నిరసనలు.
బలవంతంగా పోటీకి దిగారన్న అప్రతిష్ఠ.
పార్టీ శ్రేణులతో సత్సంబంధాలు లేకపోవడం.
మైసూరారెడ్డి సానుకూలత
కడప జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నేతగా, పాదయాత్రలు చేసిన సీమ నేతగా సుదీర్ఘకాల గుర్తింపు.
వివాద రహిత ముద్ర.
హంగు, ఆర్భాటాలకు దూరం.
అవినీతి ముద్ర లేకపోవడం.
విశ్వసనీయత కలిగిన నేతగా గుర్తింపు.
ప్రతికూలత
కడప జిల్లాలో ఉండే సమయం తక్కువ.
రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు ఉన్నప్పటికీ ఎక్కువగా తన నియోజకవర్గ, తన మండలం, తన గ్రామానికే పరిమితం కావడం.
సాధారణ నేతల మాదిరిగా జనాలతో మమేకం కాలేకపోవడం.
జిల్లా నేతలతో అంతంత మాత్రపు సంబంధాలు.
పెద్ద వక్త కాకపోవడం. ఎదుటి వారి మనోభావాలను పట్టించు కోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం.
వైఎస్ విజయలక్ష్మి సానుకూలత
వైఎస్ భార్యగా సానుభూతి.
ఎప్పుడూ బయటకు రాని ఆమె ఈ ఎన్నికల్లో ప్రతి గడప ఎక్కడంతో పెరుగుతున్న సానుభూతి.
భారీ బలగం ఉన్న కుటుంబసభ్యుల అండ.
ఇతరులకు సహాయపడాలన్న తత్వం.
వివాదరహిత మనస్తత్వం.
ప్రతికూలత
ఇంతకాలం ప్రజలకు దూరంగా ఉండటం.
సమస్యలపై అవగాహన లేకపోవడం. వక్త కాకపోవడం.
రాజకీయ కుటుంబంలో ఉన్నా రాజకీయాలపై అవగాహన లేకపోవడం.
స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోవడం.
ఒకసారి అసెంబ్లీకి గెలిపించినా ఒక్కసారి కూడా సభకు రాలేదన్న అపఖ్యాతి. సానుభూతి ఈసారి ఎన్నికలో పనిచేస్తుందా లేదానన్న సంశయం.
వైఎస్ వివేకానందరెడ్డి సానుకూలత
అందరికీ అందుబాటులో ఉండే నైజం.
మండలాలు, గ్రామాల్లో అందరినీ పేరు పెట్టి పిలిచేంత పరిచయాలు, చనువు. విస్తృతమైన బంధుత్వాలు.
సమస్యలపై పూర్తి అవగాహన.
ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్‌కు ఆయనే రధసారథి కావడంతో పెద్దగా సమస్యలు లేని సానుకూలత.
అవినీతిపరుడన్న ముద్ర లేకపోవడం.
ప్రతికూలత
వైఎస్ కుటుంబంతో విబేధాల వల్ల ఆ కుటుంబ మద్దతు కోల్పోవడం.
వైఎస్ బంధుగణాలు మూకుమ్మడిగా దూరమవుతున్న వైనం.
ఆపదలో అన్న కొడుకుకు అండగా నిలబడలేదన్న అపవాదు.
కాంగ్రెస్ ఓట్లలో చీలిక.
ఇన్నాళ్లూ ‘అన్న’ బలమే తన బలమని భావించారు. ఫలితంగా ఇప్పుడు సొంత వర్గమంటూ లేకపోవడం.
బీటెక్ రవి సానుకూలత
రాజకీయాలకు కొత్త.
అవినీతి ముద్ర లేకపోవడం.
యువకుడు కావడం.
నియోజకవర్గంలో పార్టీకి శాశ్వ త ఓటు బ్యాంకు ఉండటం.
ధనబలం ఉండటం.
ప్రతికూలత
సొంత పార్టీలోనే స్థానిక నేతల నుంచి వ్యతిరేకత.
బలమైన వర్గం లేకపోవడం.
పార్టీ నేతలతో సంబంధాలు అంతంతమాత్రమే.
సమస్యలపై అవగాహన లేకపోవడం.
కొత్త అభ్యర్ధి కావడం, జగన్ కుటుంబస్థాయిలో ఆర్థి కంగా బలంగా లేకపోవడం.