'మీట్ ది ఎడిటర్' లో ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ
విశాఖపట్నం, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన లెజిస్లేచర్, న్యాయ వ్యవస్థలకన్నా ఎక్కువగా ప్రజలకు జవాబుదారీతనంగా పత్రికా వ్యవస్థ ఉందని ఆంధ్రభూమి పత్రికా సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ఎంవిఆర్ శాస్ర్తీతో సోమవారం మీట్ ది ఎడిటర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం అనుసరిస్తున్న ఎన్నికల విధానంలో మొత్తం ఓట్లలో 30 నుంచి 32 శాతం ఓట్లు సంపాదించుకున్న పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అంటే సుమారు 70 శాతం మంది ఆ పార్టీని వ్యతిరేకరించినట్టే కదా! అయినప్పటికీ ప్రజలు తమకు అధికారాన్ని కట్టబెట్టారని చెప్పుకుంటూ, ఐదేళ్ళపాటు తమను అడిగేవాడు లేదన్న ధైర్యంతో ప్రభుత్వాలు, శాసనకర్తలున్నట్టు ఆయన అన్నారు. అలాగే న్యాయ వ్యవస్థకు కూడా అవినీతి జాడ్యం పట్టుకుందని, అందులో పనిచేస్తున్నవారే అంటున్నారని చెపుతూ, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వ్యవహారంపై ఇప్పటికీ చర్చ నడుస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయినప్పటికీ ఆ వ్యవస్థను ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదని అన్నారు. ఈ రెండు వ్యవస్థలకు రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు కల్పించారని, అలాంటివేవీ ఫోర్త్ ఎస్టేట్‌గా పిలిచే పత్రికా వ్యవస్థకు లేవని చెప్పారు. ఒక పత్రిక తప్పుడు రాతలు రాస్తే, వెంటనే పాఠకుడు వేరే పత్రికను కొనుక్కుంటాడు. పాఠకుల ఆగ్రహానికి గురైతే పత్రిక, చానెళ్ల కార్యాలయాలపై దాడులు జరుగుతాయ. ఒక్కోసారి పత్రికా కార్యాలయాలను తగలబెడుతుంటారు. అయతే ఎన్నికల్లో అతి తక్కువ శాతం ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని మాత్రం రీకాల్ చేసే పరిస్థితి లేదు. కానీ పత్రికలు ప్రజాదరణ కోల్పోతాయని అన్నారు. లెజిస్లేచర్, న్యాయ వ్యవస్థలకున్న సౌకర్యాలు పత్రికా వ్యవస్థకు లేకపోయినా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నది పత్రికలేనని అన్నారు. రాజకీయ వ్యవస్థ కంటే జవాబుదారీతనం పత్రికా వ్యవస్థకే ఎక్కువగా ఉందని శాస్ర్తీ స్పష్టం చేశారు.పత్రికలు ఒక పార్టీకో, కులానికో కొమ్ముకాస్తే, పాత్రికేయులు నిష్పాక్షికంగా ఏవిధంగా రాయగలరని విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఎంవిఆర్ శాస్ర్తీ సమాధానం చెపుతూ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పత్రికనో, ఛానల్‌నో పెట్టినవారు కొంతవరకూ వారి ప్రయోజనం నెరవేరాలనుకోవడంలో తప్పులేదని అన్నారు. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఆ పత్రికో, చానలో వ్యవహరించ లేదని తేలినప్పుడు ప్రజలే వాటిని నిరాదరిస్తారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా వ్యవస్థను కావలి కుక్కతో పోల్చుకుంటారు. ఆ పాత్రను పత్రికలు ఇప్పటివరకు బాగానే నిర్వహిస్తున్నాయ. దొంగలను పసిగట్టి కుక్కలు మొరిగినప్పుడు అప్రమత్తమై ఆ దొంగల భరతం పట్టాల్సిన పని ఇంటి యజమానిదేనని ఆయన అన్నారు. అలాగే పత్రికా వ్యవస్థ ఉన్నత స్థానంలో ఉన్నదని, అవినీతి అక్రమాలను బహిర్గతం చేసినప్పుడు అప్రమత్తమై దోషులకు తగిన శాస్తి చేయవలసిన బాధ్యత పౌరసమాజానిదని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు, సమాజం నిర్లిప్తంగా ఉంటూ మీడియానే అంతా చేయాలని మిన్నకుండడం వల్లే గ్రంథసాంగులకు ఆడిందే ఆటైందని అన్నారు.ఇటువంటి పరిస్థితుల్లో పాత్రికేయులు తమ వృత్తిని పవిత్రంగా భావించి పనిచేయాలని పేర్కొన్నారు. ఈ స్పృహ ఉన్నప్పుడు అద్భుతమైన వార్తలు రాయగలుగుతారని అన్నారు. పాత్రికేయులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మరే వ్యవస్థకూ తీసిపోని చురుకైన పాత్ర వహిస్తున్నందుకు వారికి వృత్తిపరమైన గర్వం, ఆత్మవిశ్వాసం ఉండాలన్నారు.
No comments:
Post a Comment